RRR-Akhanda: అక్టోబర్ 13 .. బాబాయ్‌దా.. అబ్బాయిదా?
కరోనా సెకండ్ వేవ్ నుండి దాదాపుగా అన్ని రంగాలు పూర్తిగా కోలుకున్నా.. ఒక్క సినిమా రంగం మాత్రం ఇంకా నిలబడలేకపోతుంది. ఇంతకు ముందులా ధైర్యంగా సినిమాను విడుదల చేసేందుకు..

Rrr Akhanda
RRR-Akhanda: కరోనా సెకండ్ వేవ్ నుండి దాదాపుగా అన్ని రంగాలు పూర్తిగా కోలుకున్నా.. ఒక్క సినిమా రంగం మాత్రం ఇంకా నిలబడలేకపోతుంది. ఇంతకు ముందులా ధైర్యంగా సినిమాను విడుదల చేసేందుకు ఏ దర్శక, నిర్మాత సిద్ధంగా లేడనిపిస్తుంది. అయితే.. ఒకవైపు చిన్న సినిమాలు వరసగా థియేటర్లకు వస్తుండగా పెద్ద హీరోల సినిమాలు మాత్రం ఆలోచనలో ఉన్నాయి. కానీ, దసరాను టార్గెట్ చేసి అక్టోబరులో బడా సినిమాలకు టైం వచ్చేలానే ఉంది. ఇప్పటికే అక్టోబర్ 12న అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమా విడుదల చేయనున్నట్లు డేట్ ఇచ్చారు.
ఇండియన్ మోస్ట్ వెయిటెడ్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ కూడా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ప్రచారం కూడా హోరెత్తిపోతుంది. ఈమధ్యనే షూటింగ్ పూర్తయిందని పోస్టర్ ద్వారా ప్రకటించిన యూనిట్ అదే రోజు సినిమా విడుదల చేస్తామని మాత్రం పోస్టర్ లో లేకుండా చేశారు. దీంతో చెప్పిన అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ వస్తుందా రాదా అన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా తప్పదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా మేకర్స్ నోరు విప్పితే కానీ దీనిపై క్లారిటీ వచ్చేలా లేదు.
అయితే.. బాలయ్య అఖండ కూడా అదే దసరాకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన అఖండ టీజర్, బాలయ్య లుక్, బోయపాటి కాంబినేషన్ కలిసి సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో అఖండ దసరా విడుదలకు ముహూర్తం పెట్టేందుకే దర్శక, నిర్మాతలు ఆసక్తిగా ఉన్నట్లుగా వినిపిస్తుంది. దీనిపై కూడా అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. అయితే, దసరా లాంటి మంచి స్కోప్ మాత్రం కొత్త సినిమాలకు ఛాన్స్ ఉంది. మరి ఈ అవకాశాన్ని బాబాయ్ వాడుకుంటాడా.. లేక అబ్బాయే చెప్పిన టైంకి థియేటర్లలో దిగిపోయి రచ్చ చేస్తాడా అన్నది చూడాల్సి ఉంది.