బిగ్ బాస్ ఆపెయ్యండి.. టీవీ షోలకు సెన్సార్ బోర్డు : కేంద్రానికి బీజేపీ ఎమ్మెల్యే లేఖ

సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ మారిన టీవీ షో బిగ్ బాస్. భాషతో సంబంధం లేకుండా ప్రతీచోట హిట్ అయిన ఈ షోపై కాంట్రవర్శీలు కూడా అదే మాదిరిగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ షో ను నిలిపివేయాలంటూ కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాశారు ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్.
వివాదాస్పద రియాలిటీ షోగా మారిపోయిన బిగ్ బాస్ హిందీ వెర్షన్ 13వ సీజన్ ని ఆపివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బిగ్ బాస్ -13 ప్రైమ్ టైమ్ స్లాట్‌లో ప్రసారం అవుతోందని, ఇందులో కంటెంట్ అసభ్యంగా, అసహ్యంగా ఉందని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యే లేఖ రాశారు. బిగ్‌బాస్ షో ద్వారా అసభ్యత పెరిగిపోతుందని, సమాజంలో ఇలాగే కొనసాగితే నైతిక విలువలు పతనం అయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే ఈ షోను ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దేశీయ వాతావరణంలో ఈ ప్రదర్శనను చూడటం కష్టమని, అలాగే నేరుగా టీవీ ద్వారా జనాలకు చేరుతున్న ఇటువంటి షోలు, సీరియల్స్ నియంత్రణకోసం సినిమాలకు మాదిరిగానే ఒక సెన్సార్‌బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.