మార్చి 31 వరకు థియేటర్లు బంద్- స్కూల్స్, కాలేజీలు కూడా..
కరోనా ఎఫెక్ట్ - మార్చి 31 వరకు మూతపడనున్న థియేటర్లు..

కరోనా ఎఫెక్ట్ – మార్చి 31 వరకు మూతపడనున్న థియేటర్లు..
కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడబోతున్నాయా?.. అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. గతకొద్ది రోజులుగా కరోనా వైరస్ (కోవిడ్ -19) ప్రపంచాన్ని గజగజ వణికిస్తుంది. ఈ వైరస్ భారత్‌ను కూడా భయపెడుతోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు కేరళలోనూ పలువురు కరోనా వైరస్ బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఒక్క కేరళలో 12 కేసులు గుర్తించినట్లు సమాచారం. కరోనా అనుమానితులతో ఆసుపత్రులు నిండిపోయాయి.
ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. ప్రముఖుల చేత ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. రోజు రోజుకూ ఈ వైరస్ వ్యాప్తి చెందడంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకూ రాష్ట్రంలోని సినిమా థియేటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే స్కూల్స్, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించింది. సినిమా థియేటర్ల మూసివేత సినీ ఇండస్ట్రీపై భారీగా ప్రభావం చూపనుంది.
కంప్లీట్ యాక్టర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘మరక్కార్: అరబికడలింటే సింహం’ ఈ నెల 26న విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేశారు. ఈ సినిమాతో పాటు పలు చిన్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధమయ్యాయి. కరోనా భయంతో థియేటర్లు మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో నిర్మాతల్లో భయాందోళనలు నెలకొన్నాయి. హాలీవుడ్‌తో సహా పలు దక్షిణాది సినిమాల షూటింగులు ఇప్పటికే వాయిదా పడిన సంగతి తెలిసిందే.