Ram Gopal Varma : ఆ కేసులో రాంగోపాల్ వర్మకు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..

మేజిస్ట్రేట్ కోర్టు దోషిగా నిర్ధారించి 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అలాగే 3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

Ram Gopal Varma : ఆ కేసులో రాంగోపాల్ వర్మకు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..

Ram Gopal Varma

Updated On : March 8, 2025 / 12:04 AM IST

Ram Gopal Varma : 2018 చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి దర్శకుడు రాంగోపాల్ వర్మకు ముంబైలోని దిండోషి సెషన్స్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ ఏడాది జనవరిలో మెజిస్ట్రేట్ కోర్టు తనకు విధించిన 3 నెలల జైలు శిక్షను నిలిపివేయాలని ఆయన చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన అదనపు సెషన్స్ జడ్జి.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అయితే, వర్మ కోర్టుకు హాజరై బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు.

హార్డ్ డిస్క్ లు సరఫరా చేసే ‘శ్రీ’ అనే సంస్థ 2018లో దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు వచ్చింది. శ్రీ.. వర్మ కంపెనీకి 2.38 లక్షల విలువైన హార్డ్ డిస్క్‌లను సరఫరా చేసింది. 2018 జూన్ 1న దానికి సంబంధించి చెక్ ఇచ్చాడు వర్మ. అయితే, తగినంత నిధులు లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అయింది. ఆ తర్వాత వర్మ మరో చెక్కు జారీ చేశాడు. అది కూడా బౌన్స్ అయింది. దాంతో శ్రీ సంస్థ వర్మపై క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేసింది.

Also Read : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా వల్ల నా సినిమాకు థియేటర్స్ దొరకలేదు.. బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్..

చెక్కులు తాను జారీ చేయలేదని వర్మ వాదించినప్పటికీ, అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించి మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అలాగే 3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. తీర్పు సమయంలో వర్మ హాజరుకాకపోవడంతో ఈ ఏడాది జనవరిలో మేజిస్ట్రేట్ కోర్టు అతనిపై నాన్-బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది.

వర్మ ఈ తీర్పును ఫిబ్రవరిలో దిండోషి సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం ఈ నెల 4న అప్పీల్‌ను తిరస్కరిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అలాగే, ఆయనకు విధించిన శిక్షను రద్దు చేసేందుకు నిరాకరించింది. అయితే, ఆర్జీవీ కోర్టుకు హాజరై బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు. తదుపరి విచారణ తేదీ జూలై 28 నాటికి నాన్-బెయిలబుల్ వారెంట్ నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.