Drinker Sai : ‘డ్రింకర్ సాయి’ మూవీ రివ్యూ.. మందు తాగడం తప్ప ఇంక ఏ పని లేని అబ్బాయికి..

డ్రింకర్ సాయి సినిమా నేడు డిసెంబర్ 27న థియేటర్స్ లో రిలీజయింది. 

Drinker Sai : ‘డ్రింకర్ సాయి’ మూవీ రివ్యూ.. మందు తాగడం తప్ప ఇంక ఏ పని లేని అబ్బాయికి..

Dharma Aishwarya Sharma Drinker Sai Movie Review and Rating

Updated On : December 27, 2024 / 4:30 PM IST

Drinker Sai Movie Review : ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా తెరకెక్కిన సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మాణంలో కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కిరాక్ సీత, రీతూ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, ఫన్ బకెట్ రాజేష్, సమీర్, భద్రం, SS కాంచి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. డ్రింకర్ సాయి సినిమా నేడు డిసెంబర్ 27న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. సాయి(ధర్మ) బాగా డబ్బున్న అనాథ. తాగడం, తిరగడం అతని పని. అతన్ని, అతని ఆస్తిని వాళ్ళ అంకుల్(శ్రీకాంత్ అయ్యంగార్) చూసుకుంటూ ఉంటాడు. సాయిని మారమని ఎంత చెప్పినా వినడు. ఓ రోజు బాగా తాగి ఉన్న సాయిని భాగీ(ఐశ్వర్య శర్మ) గుద్దేసి వెళ్ళిపోతుంది. తనతో గొడవ పెట్టుకొందామని వెళ్లి ప్రేమలో పడతాడు. అప్పట్నుంచి భాగీ ప్రేమ కోసం, ఆమె మెప్పు కోసం ఆమె వెనకాలే తిరుగుతాడు కానీ మందు, సిగరెట్ మాత్రం మానేయాడు.

భాగీ మొదట్నుంచి సాయిని నెగిటివ్ గా చూస్తూ అతనేమన్నా చేస్తాడేమో అనే భయంతో ప్రేమకు ఓకే చెప్తుంది. కానీ సాయి వెంటపడటం శృతిమించడం, కొన్ని విషయాల్లో మిస్ అండర్ స్టాండింగ్ చేసుకోవడంతో భాగీ ఓ రోజు అతనిపై అరిచి ప్రేమకు నో చెప్పి సాయిని తప్పించుకొని తిరుగుతుంది. భాగీ నో చెప్పాక సాయి ఏం చేసాడు? భాగీ సాయి ప్రేమని ఒప్పుకుందా? సాయి మందు, సిగరెట్ మానేశాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read  : Kichcha Sudeep Max : ‘మ్యాక్స్’ మూవీ రివ్యూ.. ఒక్క రాత్రిలో విధ్వంసం చేశారుగా..

సినిమా విశ్లేషణ.. అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు ఓ అమ్మాయి వెంట పడటం చివరి దాకా ఇదే నడిపించి చివర్లో అమ్మాయి అతన్ని అపార్థం చేసుకుందని తెలిసి తిరిగి ప్రేమించడం..ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. ఈ డ్రింకర్ సాయి కూడా అలాంటిదే. కానీ ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కొసమెరుపు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడం, హీరో హీరోయిన్ వెంట పడటంతో సాగుతుంది. ఇంటర్వెల్ సింపుల్ గానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో కూడా హీరో వెంటపడటం, ఓ ఆశ్రమంలో కామెడీతో సాగి చివరి అరగంట మాత్రం ఎమోషనల్ చేస్తారు.

ట్రైలర్ లో బూతులు, కొన్ని సీన్స్, టైటిల్ చూసి బోల్డ్ సినిమా అనుకున్నారు కానీ సినిమాలో బోల్డ్ సీన్స్ ఏమి ఉండవు. అయితే గతంలో మారుతీ సినిమాల లాగా సినిమా అంతా చెడు అంశాలను చూపించి చివర్లో మారండి అని మంచి చెప్పినట్టు ఈ సినిమాలో కూడా సినిమా అంతా మందు, సిగరెట్ తాగకపోతే వేస్ట్ అని, నాన్ వెజ్ తినకపోతే అదేదో పాపం చేసినట్టు అన్నట్టు చూపించి చివర్లో మాత్రం నాలుగు మంచి మాటలు చెప్పారు.

కాకపోతే సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగడం, చివర్లో ఎమోషన్ కాస్త పండటం ప్లస్ అయింది. కొన్ని సీన్స్ లో మాత్రం సీరియస్ ఎమోషన్ ని వెంటనే కామెడీ చేసేయడం, కామెడీ ని వెంటనే ఎమోషనల్ చేయడం సెట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ లో ఆశ్రమంలో కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఆశ్రమంలో చిన్న పిల్లాడితో ఓ నెగిటివిటి క్యారెక్టర్ వేయించి కామెడీ కోసం వాడటం అనేది ఎంతవరకు కరెక్టో డైరెక్టర్ కే తెలియాలి.

Drinker Sai

Also Read : Sabhapathy : దర్శకుడు సభాపతి కన్నుమూత.. అసలు చిరంజీవి ‘అంజి’ సినిమా తీయాల్సింది ఈయనే..

నటీనటుల పర్ఫార్మెన్స్.. హీరో పాత్ర చేసిన సాయికి ఇది రెండో సినిమా. బాగా తాగే ఓ యువకుడి పాత్రలో పర్ఫెక్ట్ గా చేసాడు. క్లైమాక్స్ లో ఎమోషన్ కూడా బాగానే పండించాడు. హీరోయిన్ ఐశ్వర్య శర్మ క్యూట్ గా కనిపించి అలరిస్తూనే మంచి ఎమోషన్ ని పండించింది. SS కాంచి కాసేపు నవ్విస్తారు. కిరాక్ సీత, రీతూ చౌదరి, సమీర్, శ్రీకాంత్ అయ్యంగార్, పోసాని కృష్ణమురళి.. వారి పాత్రల్లో ఓకే అనిపించారు. ఫన్ బకెట్ రాజేష్, భద్రం కాసేపు నవ్విస్తారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి. ఈ సినిమాకు పాటలు చాలా ప్లస్ అయ్యాయి. అన్ని పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. సినిమా అంతా చాలా లొకేషన్స్ విజయవాడలో రియల్ లొకేషన్స్ లో తీశారు. దర్శకత్వం పరంగా బాగున్నా కథనంలో అక్కర్లేని కామెడీ తగ్గించి ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగా ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘డ్రింకర్ సాయి’ సినిమా బ్యాడ్ హ్యాబిట్స్ తో విచ్చలవిడిగా తిరిగే ఓ అబ్బాయి జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చి ప్రేమలో పడితే ఏం జరిగింది అని ఎంటర్టైన్మెంట్ ఎమోషనల్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.