Kichcha Sudeep Max : ‘మ్యాక్స్’ మూవీ రివ్యూ.. ఒక్క రాత్రిలో విధ్వంసం చేశారుగా..
'మ్యాక్స్' మూవీ ఒక రాత్రిలో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ సినిమా.

Kannada Star Kichcha Sudeep Max Movie Review and Rating
Kichcha Sudeep Max Movie Review : కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా ‘మ్యాక్స్’. ఈ సినిమా కన్నడలో డిసెంబర్ 25న రిలీజయి మంచి టాక్ తో దూసుకుపోతుంది. తెలుగులో రేపు డిసెంబర్ 27న రిలీజవుతుండగా ముందే ప్రీమియర్స్ వేశారు. S థాను నిర్మాణంలో విజయ్ కార్తికేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వరలక్ష్మి శరత్ కుమార్, సునీల్, ఇళవరసు, రెడీన్ కింగ్స్లీ, సంయుక్త, సుకృత.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
కథ విషయానికొస్తే.. అర్జున్ అలియాస్ మ్యాక్స్ (కిచ్చ సుదీప్) పోలీస్ ఛార్జ్ తీసుకోడానికి కొత్త ఊరికి వస్తాడు. రాత్రి ట్రైన్ దిగి ఇంటికి వెళ్తుండగా గంజాయి కొట్టిన మైఖేల్, వీర ఇద్దరు మంత్రి కొడుకులు నైట్ టైం చెక్ చేసే పోలీసులని కొట్టి, లేడీ పోలీస్ తో మిస్ బిహేవ్ చేస్తారు. దీంతో పోలీస్ గా ఛార్జ్ తీసుకోకుండానే వాళ్ళని పట్టుకొని జైలులో వేస్తాడు మ్యాక్స్. FIR రాయమని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ పోలీసులంతా వాళ్ళు మంత్రి కొడుకులని, వాళ్ళ వెనకాల గ్యాంగ్ స్టార్ ఘని(సునీల్) ఉన్నాడని భయపడతారు. అందరూ పలు కారణాలతో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్తారు. గతంలో అర్జున్ తో పనిచేసిన సీనియర్ హెడ్ కానిస్టేబుల్ రమణ(ఇళవరసు) కూడా వాళ్ళ భార్యకి హెల్త్ బాగోలేదని స్టేషన్ తాళం వేసి వెళ్ళిపోతాడు.
అందరూ వచ్చేసరికి ఇద్దరు కుర్రాళ్ళు చనిపోయి ఉంటారు. దీంతో పోలీసులు అంతా ఆ గ్యాంగ్ స్టార్స్, మంత్రులు మనల్ని చంపేస్తారని భయపడుతూ అర్జున్ కి చెప్తారు. అర్జున్ మళ్ళీ స్టేషన్ కి వచ్చి జరిగింది తెలుసుకొని తన తోటి ఉద్యోగులను కాపాడాలని, అసలు ఇద్దరు కుర్రాళ్ళు ఏమయ్యారో ఎవ్వరికి తెలియకుండా చేయాలని చూస్తాడు. మంత్రుల కొడుకులు అరెస్ట్ అయ్యారని తెలిసి క్రైమ్ పోలీస్ రూప(వరలక్ష్మి శరత్ కుమార్) పోలీస్ స్టేషన్ కి వచ్చి గమనించి వెళ్తుంది. కొంతమంది గుండాలు పోలీసుల మీదకు దాడికి వస్తారు, కొంతమంది ఆ స్టేషన్ బయటే కాపలా ఉంటారు. వీళ్ళందర్నీ తప్పించుకొని ఆ ఇద్దరు శవాలని అర్జున్ ఎలా మాయం చేసాడు? అసలు వాళ్ళు ఎలా చనిపోయారు? పోలీసులను అర్జున్ కాపాడాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Tamil Movies : 2024లో పాన్ ఇండియా సినిమాలంటూ చేతులు కాల్చుకున్న తమిళ సినీ పరిశ్రమ..
సినిమా విశ్లేషణ.. అరెస్ట్ చేసిన ఓ ఇద్దరు కుర్రాళ్ళు పోలీస్ లాకప్ లో చనిపోవడంతో వాళ్ళ గురించి ఎవ్వరికి తెలియకూడదు అని ఓ పోలీసాఫీసర్ ఏం చేసాడు, తన తోటి పోలీసులను ఎలా కాపాడాడు అనేదే కథాంశం. ఈ కథ అంతా ఒక్క రాత్రిలోనే జరుగుతుంది. ఓపెనింగ్ బాగానే ఉన్నా ఓ అరగంట తర్వాత కాస్త బోర్ కొడుతుంది, మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ ఎవ్వరూ ఊహించని షాక్ ఇస్తారు. ఇంటర్వెల్ తో సినిమాపై మంచి హైప్ వస్తుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచే పోలీసులు ఎలా తప్పించుకుంటారు అని టెన్షన్ నెలకొంటుంది ప్రేక్షకుల్లో. ఇక సెకండ్ హాఫ్ లో వాళ్ళు ఎలా బయటపడ్డారు, రౌడీలను ఎలా ఎదుర్కొన్నారు చూపిస్తారు. ప్రీ క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. కాకపోతే ఆ పాయింట్ రొటీన్ అనిపిస్తుంది. క్లైమాక్స్ లో ఇంకో ట్విస్ట్ కూడా ఎవరూ ఊహించలేరు. చనిపోయిన వాళ్ళను పోలీస్ అసలు మొత్తానికే మాయం చేయడం కరెక్ట్ కాదనిపించినా క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ తో లింక్ పెట్టి జస్టిఫికేషన్ ఇవ్వడం బాగా రాసుకున్నాడు డైరెక్టర్.
ఈ సినిమా కథాంశం చూస్తుంటే ఖైదీ సినిమా గుర్తుకు రావడం ఖాయం. చిన్న పాయింట్ ని తీసుకున్నా, కథ అంతా ఆల్మోస్ట్ ఒకే లొకేషన్ పోలీస్ స్టేషన్ లో నడిపించినా నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఆసక్తిని నెలకొల్పడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. యాక్షన్ సీక్వెన్స్ లు అయితే చాలా ఎక్కువగా, హెవీగా ఉన్నాయి. మ్యాక్స్ అనే పేరు ఎందుకు వచ్చిందో మాత్రం టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వలేదు. అలాగే హీరోకి ఏదో బ్యాక్ స్టోరీ ఉన్నట్టు అక్కడక్కడా హింట్స్ ఇచ్చినా ఆ బ్యాక్ స్టోరీ కూడా చెప్పలేదు. మరి అది ప్రీక్వెల్ తీస్తారేమో చూడాలి.
నటీనటుల పర్ఫార్మెన్స్.. సినిమా అంతా కిచ్చ సుదీప్ మీదే నడుస్తుంది. సుదీప్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ లో అదరగొట్టేసాడు. సుదీప్ తో పాటు స్టేషన్ లో పోలీసుల పాత్రల్లో చేసిన నటీనటులంతా అదరగొట్టేసారు అని చూపొచ్చు. వారి పాత్రల్లో పర్ఫెక్ట్ గా సరిపోయారు. వరలక్ష్మి శరత్ కుమార్ స్టైలిష్ గా పోలీస్ పాత్రలో బాగానే నటించింది. సునీల్ సీరియస్ గ్యాంగ్ స్టార్ అని చెప్పినా కామెడీ ఛాయలు కనిపించాయి. రెడీన్ కింగ్స్లీ అక్కడక్కడా నవ్వించాడు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకు పెద్ద మైనస్ మ్యూజిక్. మ్యూజిక్ సీన్ కి తగ్గట్టు ఇచ్చినా చాలా హెవీ సౌండింగ్ తో రీ రికార్డింగ్ చేసినట్టు అనిపిస్తుంది. థియేటర్స్ లో ఆ సౌండ్ కి తలనొప్పి రావడం ఖాయం. పాటలు మాత్రం గుర్తుండవు. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. కథ అంతా రాత్రి పూటే కావడంతో దానికి తగ్గట్టు విజువల్స్ బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లు కూడా బాగానే డిజైన్ చేశారు. లొకేషన్ అంతా ఒకే చోట ఒక పోలీస్ స్టేషన్ సెట్, దాని చుట్టు పరిసరాల్లోనే తీసేసారు. ఆల్మోస్ట్ ఒకే లొకేషన్, నైట్ టైం షూట్, తక్కువ మంది క్యారెక్టర్స్ కావడంతో తక్కువ బడ్జెట్ లోనే సినిమాని తీసినట్టు తెలుస్తుంది.
మొత్తంగా ‘మ్యాక్స్’ మూవీ ఒక రాత్రిలో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ సినిమా. చూస్తున్నకొద్దీ ప్రేక్షకులకు కచ్చితంగా ఆసక్తి నెలకొంటుంది. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.