Shirish Reddy: నన్ను క్షమించండి.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కు దిల్ రాజు సోదరుడి లేఖ..
మేము చిరంజీవి, చరణ్, మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము అని శిరీశ్ రెడ్డి స్పష్టం చేశారు.

Shirish Reddy: రామ్ చరణ్ ఫ్యాన్స్ కు సారీ చెప్పారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ రెడ్డి. ఈ మేరకు ఆయన చరణ్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి లేఖ విడుదల చేశారు. తాను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు, సోషల్ మీడియా ద్వారా అపార్దాలకు దారి తీశాయని, దాని వల్ల కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తనకు తెలిసిందన్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి, మాకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. మేము చిరంజీవి, చరణ్, మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము అని శిరీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ తాను అన్న మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే తనను క్షమించాలని శిరీష్ రెడ్డి కోరారు.
గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కానీ, డైరెక్టర్ శంకర్ కానీ కనీసం తనకు ఫోన్ కూడా చేయలేదని ఓ ఇంటర్వ్యూలో నిర్మాత శిరీష్ చెప్పడం దుమారం రేపింది. శిరీష్ చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి. నిర్మాత శిరీష్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. సినిమా అనేది ఒక బిజినెస్. అందులో లాభాలు వస్తాయి, నష్టాలూ వస్తాయి. ఈ విషయం అందరికీ తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్ లో మీరు చేసే సినిమాలన్నీ మీ వల్లే విజయాలు, లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు.. ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాదించడం ఎంత వరకు కరెక్ట్?
Also Read: “గేమ్ ఛేంజర్” అసలు బాధితుడు రామ్ చరణ్.. శిరీష్ కామెంట్స్‌పై దిల్‌రాజు క్లారిటీ
ప్రతి ప్రెస్ మీట్ లో, ప్రతి ఇంటర్వ్యూలో పదే పదే దీని గురించి మీరు చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురి చేస్తున్నారు. మీకు ఇదే చివరి హెచ్చరిక. ఇంకోసారి గేమ్ ఛేంజర్ సినిమా గురించి కానీ, రామ్ చరణ్ గురించి కానీ తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ నిర్మాత శిరీష్ ను హెచ్చరిస్తూ చరణ్ అభిమానులు ఓ లేఖను విడుదల చేశారు. మెగా ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడంతో నిర్మాత శిరీష్ ఈ ఇష్యూపై స్పందించారు. తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే తనను క్షమించాలని కోరారు. ఈ మేరకు క్షమాపణలు చెబుతూ లేఖ విడుదల చేశారు.
ఇక తన సోదరుడు చేసిన కామెంట్స్‌పై దిల్ రాజు సైతం వివరణ ఇచ్చారు. శిరీష్ ఎప్పుడూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదని.. ఫస్ట్ టైమ్ కావడం వల్లే ఎమోషనల్‌గా అలా మాట్లాడి ఉంటారని చెప్పుకొచ్చారు.