Utsavam : ‘ఉత్సవం’ మూవీ రివ్యూ.. అంతరించిపోతున్న నాటకాలకు ప్రేమ కథ ముడి వేసి..
ఉత్సవం సినిమాని అంతరించిపోతున్న నాటకాల గురించి, నాటకాలకు పూర్వ వైభవం తీసుకురావాలనే కథ అంటూ ప్రమోట్ చేసారు.

Dilip Prakash Regina Cassandra Utsavam Movie Review and Rating
Utsavam Movie Review : దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా తెరకెక్కిన సినిమా ‘ఉత్సవం’. ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, నాజర్, బ్రహ్మానందం, అలీ, మధుబాల, ఆమని, అలీ.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కింది ఈ సినిమా. హార్న్ బిల్ బ్యానర్ పై సురేష్ పాటిల్ నిర్మాతగా అర్జున్ సాయి దర్శకత్వంలో తెరకెక్కిన ఉత్సవం సినిమా నేడు సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ విషయానికొస్తే.. సురభి నాటక మండలిలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు అభిమన్యు నారాయణ(ప్రకాష్ రాజ్), అతని కొడుకు కృష్ణ(దిలీప్ ప్రకాష్) అనుకోకుండా మరో నాటకాల ప్రముఖుడు సహదేవ్(నాజర్) కూతురు రమ(రెజీనా కసాండ్రా)ని కలిసి ప్రేమలో పడతాడు. రమ, కృష్ణ ఇద్దరూ ఒకరికొకరికి పరిచయం లేకుండానే ఇష్టపడతారు. వీరి ఫ్రెండ్స్ పెళ్లి వల్ల ఇద్దరు కలవడం, రమ ఆఫీస్ లో కృష్ణ జాబ్ లో జాయిన్ అయి నాటకాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పనిచేస్తాడు. ఈ క్రమంలో ఒకర్నొకరు ప్రేమించుకుంటారు కానీ అనుకోని సంఘటనలతో మనస్పర్థలు వచ్చి రమ కృష్ణకు దూరం అవుతుంది.
ఓ పక్క అభిమన్యు నారాయణ, అతని గురువు ఆరాధ్యులు(రాజేంద్రప్రసాద్), సురభి నాటకాల సభ్యులు నాటకాలు అంతరించిపోతున్నాయని బాధపడుతూ ఉంటారు. ఆరాధ్యులు అభిమన్యు, సహదేవ్ ని పిలిచి వారి పిల్లలకు పెళ్లి చేయమని అడగడంతో ఇద్దరు ఇంట్లో పిల్లలతో మాట్లాడి ఒప్పిస్తారు. అయితే రమ, కృష్ణలే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అని తెలియకుండానే పెళ్ళిపీటల వరకు వెళ్తుంది. పెళ్లి జరిగే సమయానికి రమ, కృష్ణ ఇద్దరూ పెళ్లి చేసుకోబోయేది వాళ్లనే అని తెలియక లేచిపోతారు. మరి రమ కృష్ణలే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అని వాళ్లకు తెలిసిందా? వీళ్లిద్దరు లేచిపోవడంతో ఆ కుటుంబాలు ఏం చేసాయి? వాళ్ళ పెళ్లి జరిగిందా? వాళ్ళ మధ్య మనస్పర్థలు ఎందుకొచ్చాయి? నాటకాలకు పూర్వ వైభవం కృష్ణ ఎలా తీసుకొచ్చాడు? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Mathu Vadalara 2 : ‘మత్తు వదలరా 2’ మూవీ రివ్యూ.. సస్పెన్స్ కామెడీతో ఫుల్‌గా నవ్వించారుగా..
సినిమా విశ్లేషణ.. ముందు నుంచి కూడా ఉత్సవం సినిమాని అంతరించిపోతున్న నాటకాల గురించి, నాటకాలకు పూర్వ వైభవం తీసుకురావాలనే కథ అంటూ ప్రమోట్ చేసారు. కానీ సినిమాలో ప్రేమ కథని మెయిన్ పాయింట్ గా తీసుకొని దాని చుట్టూ సురభి నాటకాలను రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా నాటకాలు వేసేవాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, హీరో – హీరోయిన్ మధ్య ప్రేమ కథతో సాగుతుంది. సెకండ్ హాఫ్ హీరో – హీరోయిన్ మధ్య సన్నివేశాలతో పాటు నాటకాలకు పూర్వ వైభవం ఎలా తీసుకొచ్చారు అని సాగుతుంది.
అయితే హీరో – హీరోయిన్ ఒకరికొకరు తెలియకుండా ఇష్టపడటం, వాళ్ళిద్దరికే పెళ్లి అని తెలియకుండా కలిసి తిరగడం లాంటివి గతంలో శశిరేఖ పరిణయం.. లాంటి చాలా సినిమాల్లో చూసేసాం. ప్రేమ కథ అయితే కొత్తది కాదు. ఇక నాటకాల గురించి, వాళ్ళ బాధల గురించి రంగమార్తాండ సినిమాలో చూపించినంత గొప్పగా చూపించలేకపోయారు. సినిమాలో చాలా భాగం నాటకాలు, దక్ష యజ్ఞం నాటకం, నాటకాల్లోని డైలాగ్స్ తోనే సాగడంతో కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎమోషన్ దర్శకుడు అనుకున్నంత పండలేదు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లేతో కన్ఫ్యూజ్ అవ్వక తప్పదు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. దిలీప్ ప్రకాష్ ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి పర్వాలేదనిపించాడు. రెజీనా కూడా తన పాత్రలో మెప్పించింది. ఈ సినిమాలో ముఖ్యంగా ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం.. పలువురు నాటకాల్లోని పాత్రలతో, డైలాగ్స్ తో అదరగొట్టారు. అలీ, బ్రహ్మాజీ, LB శ్రీరామ్, జబర్దస్త్ అభి, మధుబాల.. మిగిలిన నటీనటులు కూడా మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు ముఖ్యంగా ఆర్ట్ వర్క్ చాలా ముఖ్యం. సురభి వాళ్ళతో కో ఆర్డినేట్ చేసుకొని నాటకాలకు సంబంధించిన ప్రతి ప్రాపర్టీ, నాటకాల సెట్స్ అన్ని చాలా బాగా చూపించారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తాయి. మంచి కథని కొంత కన్ఫ్యూజ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు. అర్జున్ సాయి మాత్రం దర్శకుడిగా అంతమంది స్టార్ క్యాస్ట్ ని ఒకేచోట డీల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.
మొత్తంగా ఉత్సవం సినిమా ఓ ప్రేమ కథతో నాటకాలకు ముడిపెట్టి అందంగా చూపించాలనుకున్నారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.