Mathu Vadalara 2 : ‘మత్తు వదలరా 2’ మూవీ రివ్యూ.. సస్పెన్స్‌ కామెడీతో ఫుల్‌గా నవ్వించారుగా..

'మత్తు వదలరా 2' సినిమా పార్ట్ 1కి కంటిన్యూగా క్రైం కామెడీతో ఫుల్ గా నవ్వించేసారు.

Mathu Vadalara 2 : ‘మత్తు వదలరా 2’ మూవీ రివ్యూ.. సస్పెన్స్‌ కామెడీతో ఫుల్‌గా నవ్వించారుగా..

Sri Simha Faria Abdullah Satya Mathu Vadalara 2 Movie Review and Rating

Updated On : September 13, 2024 / 12:18 PM IST

Mathu Vadalara 2 Movie Review : కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహ కోడూరి మత్తు వదలరా సినిమాతో 2019లో హీరోగా పరిచయమయ్యాడు. కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా అదే టీమ్ తో మత్తు వదలరా 2 సినిమా వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రితేష్ రానా దర్శకత్వంలో మత్తు వదలరా 2 సినిమా తెరకెక్కింది. శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా జంటగా సత్య, సునీల్, రోహిణి, వెన్నెల కిషోర్, అజయ్.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా నిర్మించారు. మత్తు వదలరా 2 సినిమా నేడు సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. మత్తు వదలరా పార్ట్ 1కి కంటిన్యూగానే ఈ సినిమా సాగుతుంది. బాబు(శ్రీ సింహ), యేసు(సత్య) తమ డెలివరీ జాబ్స్ పోవడంతో ఓ యాడ్ చూసి HE టీమ్ లో జాబ్స్ సాధిస్తారు. HE (High in Emergency) టీమ్ కిడ్నాప్స్, మర్డర్స్.. లాంటి ఎమర్జెన్సీ కేసుల్ని డీల్ చేస్తుంది. ఇందులో బాబు, యేసు కలిసి కిడ్నప్ కేసుల్ని డీల్ చేసి సక్సెస్ అవుతుంటారు. కానీ జీతం సరిపోకవడంతో కిడ్నాపర్స్ ని పెట్టుకున్నాక రికవరీ చేసిన డబ్బుల్లో కొంత నొక్కేస్తూ ఉంటారు. లైఫ్ టైం సెటిల్ అయిపోవాలని ఓ కిడ్నాప్ కేసుని HE టీమ్ కి తెలియకుండా వీళ్ళే డీల్ చేసి డబ్బులు మొత్తం నొక్కేద్దాం అనుకుంటారు. అలా రియా అనే అమ్మాయి కిడ్నాప్ కేసుని వీళ్ళు డీల్ చేస్తారు.

కానీ వీళ్ళు కాపాడిన రియా ఫేక్ అని, అసలు రియాని వేరే వాళ్ళు చంపేసి వీళ్ళని అందులో ఇరికించినట్టు తెలుస్తుంది. అంతేకాక ఆకాష్(అజయ్)ని కూడా వీళ్ళే చంపినట్టు ఇరికిస్తారు. దీంతో HE టీమ్ వీళ్ళ వెంటపడుతుంది. అసలు రియాని ఎవరు చంపారు? రియా కేసు వీళ్ళ మీదకు ఎందుకు తోసారు? ఆకాష్ ని ఎవరు చంపారు? ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి ఉన్న లింక్ ఏంటి? బాబు, యేసులు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? వీరికి వాళ్ళ సీనియర్ నిధి(ఫరియా అబ్దుల్లా) ఎలా సపోర్ట్ చేసింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Bhale Unnade : ‘భలే ఉన్నాడే’ మూవీ రివ్యూ.. రాజ్ తరుణ్ భలే నవ్వించి ఎమోషనల్ చేశాడే..

సినిమా విశ్లేషణ.. మత్తు వదలరా సినిమా క్రైం సస్పెన్స్ కామెడీతో మెప్పించారు. ఇప్పుడు పార్ట్ 2 కూడా క్రైం సస్పెన్స్ తో ఈసారి మరింత నవ్వించారు. ఫస్ట్ హాఫ్ అంతా బాబు, యేసులు కిడ్నాప్ ఆపరేషన్స్ చేయడంతో సాగి ఇంటర్వెల్ కి ముందు రియా హత్య కేసులో ఇరుక్కోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఆ కేసుని బాబు, యేసు, నిధి కలిసి ఎలా సాల్వ్ చేసారు అని ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ ఆసక్తిగా సాగుతుంది.

ఫస్ట్ పార్ట్ ని మించి ఇందులో నవ్వించారు. ఇక సినిమా అంతా కమెడియన్ సత్య ఒక్కడే మోశాడని చెప్పొచ్చు. సత్య తన యాక్షన్స్ తో ఫుల్ గా నవ్విస్తాడు. ఫస్ట్ పార్ట్ లో చూపించిన సీరియల్ ఇందులో కూడా కథలో ఇన్వాల్వ్ అవుతూ కొనసాగుతుంది. ఆ సీరియల్ తో కూడా నవ్విస్తూనే చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ లో చూపించినట్టే ఇందులో కూడా ఓ డ్రగ్ గురించి చూపించి కథకి దాన్ని బాగా కనెక్ట్ చేసారు. ఇక మెగా ఫ్యాన్స్ కి ఈ సినిమా మంచి హై ఫీలింగ్ ఇస్తుంది. తెరపై చిరంజీవి, పవన్ కళ్యాణ్ కనపడి, వాళ్ళ రిఫరెన్స్ లు చూపించి మెప్పించారు. సెకండ్ హాఫ్ ట్విస్ట్ లు రివీల్ చేసేటప్పుడు కొన్ని సందేహాలు మాత్రం వస్తాయి. ప్రమోషన్స్ లో చెప్పినట్టు మత్తు వదలరా పార్ట్ 3 కూడా ఉండొచ్చు.

Sri Simha Faria Abdullah Satya Mathu Vadalara 2 Movie Review and Rating

నటీనటుల పర్ఫార్మెన్స్.. శ్రీ సింహ తన నటనతో మెప్పించాడు. ఇక సత్య కూడా కామెడీ ఏజెంట్ పాత్రలో సినిమాని తన భుజాలపై మోశాడు. ఫరియా అబ్దుల్లా యాక్షన్ సీక్వెన్స్ లో కూడా అలరించింది. సునీల్, వెన్నెల కిషోర్ కూడా తమ కామెడీతో నవ్వించారు. రోహిణి, రాజా.. మిగిలిన నటీనటులు తమ పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా క్రైం కామెడీ జానర్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఇచ్చి మెప్పించారు. యాక్షన్ సీక్వెన్స్ లు బాగా డిజైన్ చేసుకున్నారు. కథ, కథనం పార్ట్ 1 లాగే అనిపించినా ప్రేక్షకులని నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు రితేష్ రానా. నిర్మాణ పరంగా కూడా సినిమాకు కావలసినంత ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘మత్తు వదలరా 2’ సినిమా పార్ట్ 1కి కంటిన్యూగా క్రైం కామెడీతో ఫుల్ గా నవ్వించేసారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే ఫుల్ గా నవ్వుకోవచ్చు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.