Lucky Baskhar : ‘లక్కీ భాస్కర్’ మూవీ రివ్యూ.. కామన్ మ్యాన్ డబ్బుతో ఆడిన ఆట..

ఇన్నాళ్లు సిరీస్ లలో చూసిన కథ ఇలా సినిమాగా నార్మల్ ఆడియన్స్ కు కూడా అర్ధమమ్యే విధంగా తీసుకొచ్చారు.

Lucky Baskhar : ‘లక్కీ భాస్కర్’ మూవీ రివ్యూ.. కామన్ మ్యాన్ డబ్బుతో ఆడిన ఆట..

Dulquer Salmaan Meenakshi Chaudhary Lucky Baskhar Movie Review and Rating

Updated On : October 31, 2024 / 12:20 PM IST

Lucky Baskhar Movie Review : దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా ‘లక్కీ భాస్కర్’. టిన్ను ఆనంద్, సర్వధామన్ బెనర్జీ, రాజ్ కుమార్ కసిరెడ్డి, రాంకీ, శ్రీనాథ్ మాగంటి, హైపర్ ఆది, సాయి కుమార్, సచిన్ ఖేద్కర్, మానస చౌదరి.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. లక్కీ భాస్కర్ సినిమా నేడు దీపావళి కానుకగా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. ఈ కథ 1989 – 92 సమయంలో జరుగుతుంది. భాస్కర్(దుల్కర్ సల్మాన్) ఓ మాములు ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయ్. సుమతి(మీనాక్షి చౌదరి) అతని దగ్గర డబ్బులేకపోయినా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. భాస్కర్ కు ఇంట్లో తమ్ముడు, చెల్లి చదువులు, పెళ్లిళ్లు, నాన్న హెల్త్, కొడుకు ఫీజ్.. ఇలా కష్టాలు, వాటికి తోడు అప్పులతో బతుకుతుంటాడు. ఇతని దగ్గర డబ్బు లేదని సుమతి తల్లి ఇంట్లో వీళ్ళ ఫ్యామిలీని అవమానపరుస్తారు. భాస్కర్ కి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కూడా మిస్ అవుతుంది. దీంతో భాస్కర్ ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ఫిక్స్ అవుతాడు. సుమతి కూడా బాగా డబ్బులు సంపాదించాలని, హోమ్ ఫుడ్స్ బిజినెస్ పెట్టాలని అనుకుంటుంది.

అదే సమయంలో యాంటోని(రాంకీ) లోన్ కోసం తిరుగుతుంటాడు. ఒక్క రోజులో రెట్టింపు చేసి తీర్చేస్తా అంటాడు. అతనికి బ్యాంక్ రూల్స్ ప్రకారం లోన్ రాదు. కానీ ఆ కాలంలో బ్యాంకుల్లో డబ్బులు బుక్స్ లో ఎంటర్ చేసి నెలాఖరుకు కంప్యూటర్స్ లో ఎంటర్ చేసేవాళ్ళు కాబట్టి ఈ మధ్యలో బ్యాంక్ మనీ శుక్రవారాలు తీసి సోమవారం కల్లా పెట్టేలాగా కొన్ని స్కామ్స్ జరిగేవి. అలా దుల్కర్ బ్యాంక్ మనీ తీసుకొచ్చి యాంటోనికి ఇచ్చి అతని బిజినెస్ లో కమిషన్స్ తీసుకుంటూ సంపాదిస్తాడు. అనుకోకుండా భాస్కర్ కి ఏకంగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రమోషన్ వస్తుంది. అప్పట్లో షేర్ మార్కెట్స్ స్కామ్ చేసిన హర్ష మెహ్రాకు సంబంధించి ఇతను బ్యాంక్ డీల్స్ చేయాల్సి వస్తుంది. దీంతో భాస్కర్ ఇంకా సంపాదించడం మొదలుపెడతాడు. అలా ఓ రోజు CBI వాళ్ళు భాస్కర్ పై రైడ్ చేస్తారు. అసలు భాస్కర్ బ్యాంక్ డబ్బుల్ని ఎలా వాడుకున్నాడు? హర్ష మెహ్రాని వాడుకొని ఎలా సంపాదించాడు? డబ్బు పెరిగాక భాస్కర్ ఎలా మారిపోయాడు? సుమతి హోమ్ ఫుడ్స్ బిజినెస్ పెట్టిందా? CBI వాళ్ళు భాస్కర్ ని పట్టుకున్నారా? హర్ష మెహ్రా స్కామ్ లో భాస్కర్ ఇరుక్కున్నాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : KA Movie : కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ రివ్యూ.. అదిరిందిగా.. క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించలేరు..

సినిమా విశ్లేషణ.. లక్కీ భాస్కర్ మొత్తం బ్యాంకింగ్ కథాంశం, అది కూడా 1990 బ్యాంకింగ్ వ్యవస్థతో సాగుతుంది. గతంలో హర్ష మెహ్రా జీవిత కథతో 1992 స్కామ్ సిరీస్ తో పాటు పలు సిరీస్ లు వచ్చాయి. అవన్నీ ప్రేక్షకులని మెప్పించాయి. అవి హర్ష మెహ్రా లైఫ్ చూపిస్తే ఇది హర్ష మెహ్రా వల్ల ఓ ఎంప్లాయ్ లైఫ్ లో ఏం జరిగింది అని చూపించారు. అయితే కథని మన నేటివిటీకి మార్చుకొని ఎమోషన్స్ కూడా పండించారు. ఫస్ట్ హాఫ్ అంతా భాస్కర్ కష్టాలు, అవమానాలు, యాంటోనితో కలిసి డబ్బులు సంపాదించడంతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ హర్ష మెహ్రా కథకు లింక్ చేసి సంపాదించడం, దాని వల్ల వచ్చే సమస్యలు, వాటి నుంచి ఎలా బయటపడ్డాడు అని ఆసక్తిగా చూపించారు.

సినిమాలో 20 నిమిషాలకు ఒక హై మూమెంట్ ఇచ్చి ప్రేక్షకులని నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలా కట్టిపడేసారు. డబ్బు సంపాదించాలి అనుకునేవాళ్లకు, డబ్బు కష్టాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి డబ్బుతో ఎలా ఆడుకున్నాడు, కష్టం వచ్చినప్పుడు ఎలా ఆగిపోయాడు అని పర్ఫెక్ట్ గా రాసుకున్నారు. అసలు హర్ష మెహ్రా ఫేస్ చూపించకుండా అతని చుట్టూ కథ రాసుకోవడం చాలా బాగా రాసుకున్నారు. ఇన్నాళ్లు సిరీస్ లలో చూసిన కథ ఇలా సినిమాగా నార్మల్ ఆడియన్స్ కు కూడా అర్ధమమ్యే విధంగా తీసుకొచ్చారు.

Image

నటీనటుల పర్ఫార్మెన్స్.. దుల్కర్ సల్మాన్ ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా, బ్యాంక్ ఎంప్లాయ్ గా చక్కగా నటించాడు. భార్య పాత్రలో సుమతి ఒదిగిపోయింది. రాజ్ కుమార్ కసిరెడ్డి అక్కడక్కడా నవ్విస్తూ బాగానే మెప్పించాడు. సర్వధామన్ బెనర్జీ తండ్రి పాత్రలో సింపుల్ గా మెప్పించారు. బబుల్ గమ్ హీరోయిన్ మానస చౌదరి ఓ చిన్న పాత్రలో మెరిపిస్తుంది. రాంకీ, సచిన్ ఖేద్కర్, హైపర్ ఆది, టిన్ను ఆనంద్, శ్రీఆంధ్ మాగంటి, గాయత్రీ భార్గవి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. ఆ కాలానికి తగ్గ కథగా చూపించడానికి పర్ఫెక్ట్ కలర్ గ్రేడింగ్ చేసారు. ఇక ముంబైలో ఒక కాలనీ, బ్యాంక్ సెట్స్ చక్కగా వేశారు. బ్యాంకింగ్ బ్యాక్ డ్రాప్ లో కథ, కథనం బాగా రాసుకున్నాడు వెంకీ అట్లూరి. డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. చాలా డైలాగ్స్ జనాలకు కనెక్ట్ అవుతాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడా ఎలివేషన్స్ లో మంచి హై ఇస్తుంది. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. నిర్మాణ పరంగా ఎక్కడా తగ్గకుండా కావాల్సినంత ఖర్చుపెట్టి క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చారు సితార, శ్రీకర, ఫార్ట్యూన్ ఫోర్ నిర్మాణ సంస్థలు.

మొత్తంగా ‘లక్కీ భాస్కర్’ సినిమా ఓ మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయ్ బ్యాంక్ లో ఉన్న లొసుగులను వాడుకొని ఎలా డబ్బు సంపాదించాడు. దాన్ని సక్రమంగా ఎలా మార్చాడు అని ఆసక్తికర కథనంతో చూపించారు . ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

https://www.youtube.com/watch?v=krdomVobIxE

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.