Vision Document: 4 లక్షల మంది సూచనలు ఇచ్చారు.. విజన్ డాక్యుమెంట్ లక్ష్యం ఇదే: రేవంత్ రెడ్డి
వివిధ రంగ నిపుణులు, మేధావులు, ప్రజల అభిప్రాయాలతో డాక్యుమెంట్ రూపొందించామని అన్నారు.
Vision Document: తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ కోసం 4 లక్షల మంది సూచనలు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విజన్ డాక్యుమెంట్ విడుదల వేళ ఆయన మాట్లాడారు.
“భూమికోసం, భుక్తి కోసం పోరాడిన చరిత్ర తెలంగాణది. తెలంగాణ మట్టిలో పోరాట స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలకు సమాన అవకాశాలు, న్యాయం అందించాలన్నదే డాక్యుమెంట్ లక్ష్యం.
వికసిత్ భారత్ లో తెలంగాణ రైజింగ్ తో ముందువరసలో మన రాష్ట్రం ఉంది. ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ లక్ష్యం. నాలుగు గోడల మధ్య డాక్యుమెంట్ రూపొందించలేదు. వివిధ రంగ నిపుణులు, మేధావులు, ప్రజల అభిప్రాయాలతో డాక్యుమెంట్ రూపొందించాం.
ఇరిగేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ లను అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యం. పేదరికం, అంటరానితనం, జాతి వివక్ష.. నాకు తెలుసు. రిమోట్ విలేజ్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాడిని. రైతు కుటుంబం నుంచి వచ్చాను. 17 ఏళ్లల్లో జడ్పిటిసి నుండి సీఎంగా ఎదిగాను.
జాతి వివక్ష రూపుమాపేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెచ్చాం. విద్యపై ఖర్చు.. భవిష్యత్ కు పెట్టుబడి. విద్య, వైద్యం, ఉపాధి అందించడమే మా డాక్యుమెంట్ పాలసీ లక్ష్యం” అని అన్నారు.
