Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో బిగ్ సెలబ్రిటీస్.. రేపటి నుంచే విచారణ!

టాలీవుడ్‌లో సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో రేపటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు ప్రారంభించనుంది.

Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో బిగ్ సెలబ్రిటీస్.. రేపటి నుంచే విచారణ!

Drug Case (2)

Updated On : August 30, 2021 / 7:37 PM IST

Tollywood Drug Case: టాలీవుడ్‌లో సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో రేపటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు ప్రారంభించనుంది. ఈడీ దర్యాప్తుతో టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో డొంక కదులుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త లింకులు, అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాకు హవాలా డబ్బు చేరిందనడానికి ఆధారాలు సేకరించే దిశగా ఈ దర్యాప్తు సాగుతుందని భావిస్తున్నారు. రేపటి నుంచి సెప్టెంబరు 22 వరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నారు ఈడీ అధికారులు.

ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్నవారితో సహా మొత్తం 12మంది టాలీవుడ్‌ ప్రముఖులకు… ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 50 ప్రకారం నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు.. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని, ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా నోటీసులు అందించారు. రేపు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఈడీ ముందు హాజరుకానున్నారు.

ఈడీ నుంచి నోటీసులు అందుకున్న వారిలో పూరీ జగన్నాథ్‌, చార్మికౌర్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌, రానా దగ్గుబాటి, రవితేజ, శ్రీనివాస్‌, నవదీప్‌, జనరల్‌ మేనేజర్‌ ఎఫ్‌-క్లబ్‌, ముమైత్‌ఖాన్‌, తనీశ్‌, నందు, తరుణ్‌ ఉన్నారు. 2017లో ఎక్సైజ్‌ శాఖ మొత్తం 12 మందిపై చార్జిషీట్లు దాఖలు చేసింది. డ్రగ్స్‌ సరఫరా, వినియోగించిన వారి వివరాలకే పరిమితమైంది ఎక్సైజ్‌శాఖ. కానీ, ఎంత మొత్తంలో లావాదేవీలు జరిగాయి? విదేశాలకు డబ్బును తరలించారా? లాంటి అంశాలపై ఈడీ విచారణ కొనసాగనుంది.

మరోవైపు సిట్ అధికారి శ్రీనివాస్ నుంచి ఈడీ అధికారులు వివరాలు సేకరించారు. ఈడీ అధికారులకు ఎక్సైజ్ సిట్ అధికారులు వివరాలు సమర్పించారు. 2017లో డ్రగ్స్ కేసు ప్రత్యేక దర్యాప్తు బృందానికి శ్రీనివాస్ నేతృత్వం వహించారు. సిట్ దర్యాప్తు క్రమాన్ని ఈడీకి శ్రీనివాసరావు వివరించారు.