సుశాంత్ చనిపోయిన రోజు ఏం జరిగింది.. చివరిసారిగా ఎవరికి ఫోన్ చేశాడు!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంద్రా ప్రాంతంలో ఉన్న తన అద్దె ఇంటి బెడ్‌రూమ్‌లో సుశాంత్ ఆత్మహత్య చేసుకోగా.. అతని ఆత్మహత్యకు గల కారణం మాత్రం స్పష్టంగా ఎవరికీ తెలియలేదు.
ఈ క్రమంలో అసలు సుశాంత్ చివరిగా ఎవరితో మాట్లాడాడనే విషయాన్ని ఆరా తీయగా.. సుశాంత్ ఆదివారం ఉదయం 6:30 గంటలకు లేచిన తరువాత తన గదిలోనే ఉన్నాడు. ఉదయం 9:30 గంటలకు సుశాంత్ దానిమ్మ రసం తీసుకొని తన గదిలో తాళం వేసుకున్నాడు. సుశాంత్‌ను అతని కుక్ చూడటం ఇదే చివరిసారి. ఉదయం 10:30 గంటలకు, వంట కోసం సుశాంత్‌ను ఏమి తినాలని అడిగినా.. సుశాంత్ తలుపు తెరవలేదు.
అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భోజనానికి ఏమి తినాలి అని అడగడానికి వంట మనిషి మళ్ళీ సుశాంత్ దగ్గరకు వెళ్ళాడు, ఈసారి సుశాంత్ తలుపు తెరవలేదు. చాలాసేపు తలుపులు కొట్టి సుశాంత్‌ని పిలిచిన తర్వాత, కుక్ సహా మిగతా ఇద్దరు పనిమనుషులకు ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఓ పనిమనిషి 12గంటల 15నిమిషాలకు సోదరిని పిలిచి మొత్తం విషయం చెప్పాడు. గోరేగావ్‌లో నివసించే సుశాంత్ సోదరి సమాచారం అందుకుని సుమారు 40 నిమిషాల్లో బాంద్రాకు చేరుకుంది.
సోదరి వచ్చిన తర్వాత తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించగా.. సుశాంత్ శరీరం ఆకుపచ్చ కుర్తాకు వేలాడుతోంది. వెంటనే, కుర్తాలో కొంత భాగాన్ని కత్తితో కోసి సుశాంత్‌ను కిందకు దింపారు. వైద్యుడిని పిలిచి పోలీసులకు సమాచారం అందించారు.
ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ బృందం పడకగదిలో పంచనామ చేసింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. సుశాంత్ సింగ్ ఆరు నెలలుగా ముంబైలోని ఒక ప్రముఖ మానసిక వైద్యుడి దగ్గర డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నాడు. ఇంట్లో అందుకు సంబంధించిన మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ కనిపించింది. తన సోదరుడికి ఎటువంటి సమస్య లేదని, ఆర్థికంగా ఇబ్బందులు లేవని సుశాంత్ సోదరి పోలీసులకు తెలిపింది.
ఇక సుశాంత్ చివరిసారిగా.. తన పాత స్నేహితుడు, టీవీ నటుడు మహేష్ కృష్ణ శెట్టితో చాలాకాలం తర్వాత మాట్లాడారు. మహేష్ సుశాంత్‌తో కలిసి ‘ప్రీతా రిష్ట’ సీరియల్‌లో పనిచేశారు. మహేష్ వాంగ్మూలాన్ని కూడా ముంబై పోలీసులు రికార్డ్ చేస్తారు.