‘F3’ రెమ్యునరేషన్లే అంతైతే.. రూ. 100కోట్లు రాబడుతుందా?

‘F3’ రెమ్యునరేషన్లే అంతైతే.. రూ. 100కోట్లు రాబడుతుందా?

Updated On : December 16, 2020 / 1:24 PM IST

సినిమా నిర్మాణానికి తక్కువ ఖర్చు అయ్యి, లాభాలు ఎక్కువ వస్తున్నాయంటే నిర్మాతకు పండుగే కదా? అలా వస్తున్నప్పుడు ఎన్ని సినిమాలైనా తియ్యాలని భావిస్తారు. పెద్ద పెద్ద హీరోలను పెట్టి కోట్లు దారబోసి.. ఛేజింగ్‌లు, ఫైటింగ్‌లు, ఫారెన్‌ ట్రిప్‌లు, లోకేషన్ టూర్లు.. ఇలా ఎన్నో ఖర్చులు పడి సంవత్సరాలు తరబడి పనిచేశాక సినిమాలు స్క్రీన్ మీదకు రావాలంటే.. అయ్యే ఖర్చు.. దానికి అయ్యే వడ్డీ.. అంతా ఇంతా కాదు.. అటువంటి పరిస్థితి ఉన్న సమయంలో కూడా తక్కువ ఖర్చుతో..తక్కువ సమయంలో తెరకెక్కి విపరీతంగా లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ‘ఎఫ్‌2’. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో రికార్డు వసూల్లే క్రియేట్ చేసింది.

విక్టరీ వెంకటేశ్‌, మెగాహీరో వరుణ్‌తేజ్‌ల కాంబినేషన్‌ మల్టీస్టారర్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ తదితరులు నటించగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఓ రేంజ్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న సినిమా ‘ఎఫ్ 3’. ఈ సినిమా కోసం దిల్ రాజు ఇద్దరు హీరోలకు భారీగా రెమ్యూరేషన్లు ఇస్తున్నారని టాక్. ఈ సినిమా రెమ్యూనిరేషన్లకే యాభై కోట్ల వరకు ఖర్చు అయిపోతున్నట్లు తెలుస్తోంది.

హీరో వెంకీకి 12 కోట్లు, వరుణ్‌కు 8 కోట్లు, తమన్నాకు రెండు కోట్లు, మెహరీన్‌కు 70లక్షలు, కమెడియన్ సునీల్‌కు 75 లక్షలు, దేవీశ్రీ ప్రసాద్‌కు మూడు కోట్లు, డైరక్టర్ అనిల్ రావిపూడికి 12 కోట్లు ఇస్తున్నారట రెమ్యూనిరేషన్లు. ఇవి కాక వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి ఇంకా చాలా స్టార్ కాస్ట్ ఉంది. యాక్టర్లు, టెక్నీషియన్లు కలిపి రెమ్యూనిరేషన్లే నలభై కోట్లు దాటేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల బోగట్టా. ఇక షూటింగ్.. మొత్తం ఖర్చుకు అయ్యే వడ్డీలు, అడ్వాన్స్‌లకు అయ్యే వడ్డీలు అన్నీ కలుపుకుంటే మొత్తం రూ. 80కోట్లు వరకు అవుతున్నట్లు సమాచారం. ఇవన్నీ చూస్తుంటే.. సినిమా లెక్కలు ఆకాశాన్ని అంటిపోయినట్లే అని అంటున్నారు. 80కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు కనీసం రూ. 100కోట్లు రాబట్టకుంటే నిర్మాతలకు వర్క్‌ఔట్ కాదు.. ఇప్పుడు ఈ ఎఫ్3 సినిమా వంద కోట్లు రాబడుతుందా? అనేది అసలు ప్రశ్న.