అమరావతిలో ఫిల్మ్‌సిటీ.. తెలుగు నిర్మాతల సరికొత్త ప్లాన్‌

వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం 2019కు ముందే రాజధాని అమరావతికి తెలుగు చిత్ర పరిశ్రమను..

అమరావతిలో ఫిల్మ్‌సిటీ.. తెలుగు నిర్మాతల సరికొత్త ప్లాన్‌

రాజధాని నగరం అమరావతిపై తెలుగు చిత్ర పరిశ్రమ ఫోకస్‌ చేస్తోందా? డిప్యూటీ సీఎం పవన్‌, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్‌తో తెలుగు సినీ నిర్మాతల భేటీ వెనుక అసలు ఉద్దేశమేంటి? సినీ పరిశ్రమకు వెన్నుదన్నుగా ఉండే టీడీపీ… సినీ రంగానికి చెందిన పవన్‌ భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం టాలీవుడ్‌ కోసం ఎలాంటి యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తోంది.

ఏపీ రాజధాని అమరావతికి సినీ కళ అద్దేలా రంగం సిద్ధమవుతోందని టాలీవుడ్‌ టాక్‌. రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు ఎన్నో అందమైన లోకేషన్లు ఉన్నప్పటికీ…. అన్నిరకాల సౌకర్యాలు ఉండే ఫిల్మ్‌సిటీ లేకపోవడం పెద్ద లోటే… ఇప్పటివరకు ఏపీలో ఒకే ఒక్క సినీ స్టుడియో ఉంది. అదికూడా విశాఖ నగరంలో ఉంది. అయితే అమరావతిని దేశంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో చెబుతున్నారు.

చంద్రబాబుకు ఇప్పుడు పవన్‌ కూడా తోడయ్యారు. రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాజధాని ముందుగా అభివృద్ది చెందాలి. ఇందుకోసం తమవంతుగా అమరావతిలో సినీ పరిశ్రమ అభివృద్ధి చేయాలని తెలుగు సినీ నిర్మాతల మండలిలో కొందరు నిర్మాతలు భావిస్తున్నారట.. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్‌తో భేటీలో ప్రాథమికంగా చర్చించారని అంటున్నారు.

హైదరాబాద్‌లో ఇన్ని..
ప్రస్తుతం హైదరాబాద్‌లో అన్నపూర్ణ, రామకృష్ణ, పద్మాలయ, రామానాయుడు, సారథి స్టుడియోస్‌ ఉన్నాయి. ఇక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్‌సిటీలో అన్నిరకాల సౌకర్యాలు ఉన్నాయి. ఇలాంటి సౌకర్యాలన్నీ రాజధాని అమరావతిలో ఉండేలా ప్లాన్‌ చేస్తున్న కొందరు నిర్మాతలు అమరావతిలో ప్రపంచ స్థాయి స్టుడియో నిర్మాణానికి సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. అమరావతిలో సినిమాలు నిర్మిస్తే లీకేజీ బెడద తగ్గడంతోపాటు నిర్మాణ ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఉందంటున్నారు.

వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం 2019కు ముందే రాజధాని అమరావతికి తెలుగు చిత్ర పరిశ్రమను తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ఇందుకోసం సీఆర్‌డీఏ పరిధిలో అనంతవరం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో 5,167 ఎకరాల్లో మీడియా సిటీకి ప్లాన్‌ చేసింది. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత స్థలంలో 20-30 ఎకరాల్లో స్టూడియో నిర్మించాలని భావించింది.

స్టూడియోల నిర్మాణానికి ముందుకొచ్చే వారికి ఎకరం 50 లక్షల రూపాయలకు ఇవ్వాలని అప్పట్లో భావించారు చంద్రబాబు. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రతిపాదనల్నీ బుట్టదాఖలయ్యాయి. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం కొలువుదీరడం, అందులో సినీ రంగానికి చెందిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీఎంగా ఉండటంతో అమరావతిలో ఫిల్మ్‌సిటీ నిర్మాణానికి మళ్లీ కదలిక వచ్చిందంటున్నారు.

Committee Kurrollu Song : ‘కమిటీ కుర్రాళ్ళు’ లవ్ సాంగ్ విన్నారా.. మెలోడీ 90s కిడ్స్ ప్రేమ పాట..