Ukku Satyagraham : గద్దర్ చివరి సినిమా.. ‘ఉక్కు సత్యాగ్రహం’ మూవీ రివ్యూ..
'ఉక్కు సత్యాగ్రహం' సినిమా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంతో కొన్ని కల్పిత అంశాలు జోడించి విప్లవాత్మకంగా తెరకెక్కించారు.

Gaddar Last Movie Ukku Satyagraham Movie Review and Rating
Ukku Satyagraham Movie Review : సత్యారెడ్డి హీరోగా నటిస్తూ దర్శక నిర్మాతగా తెరకెక్కించిన సినిమా ‘ఉక్కు సత్యాగ్రహం’. గద్దర్, పల్సర్ బైక్ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మ శ్రీ, ఎంవివి సత్యనారాయణ, ప్రసన్న కుమార్, వెన్నెల.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఉక్కు సత్యాగ్రహం సినిమా నేడు నవంబర్ 29న థియేటర్స్ లో రిలీజయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చెందిన అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారు.
కథ విషయానికొస్తే.. ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు జరుగుతుంటాయి. పలువురు నాయకులు, ఉద్యమకారులు ఆ ప్రైవేటీకరణ ఆపేందుకు ఉద్యమాలు చేస్తుంటారు. బాగా డబ్బున్న వ్యక్తి సత్యారెడ్డి ఉద్యమం కోసం వచ్చి ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తారు. ఈ ఉద్యమాన్ని ఆపడానికి ఒక లేడీ పోలీసాఫీసర్ వస్తుంది. కానీ ఉద్యమం గురించి సత్యారెడ్డి ద్వారా తెలుసుకున్న ఆమె వీళ్లకు సపోర్ట్ చేయడంతో కొంతమంది నాయకులు ఆమెను కిడ్నాప్ చేసి, ఆ ఉద్యమాన్ని తొక్కడానికి ప్రయత్నిస్తుంటారు. మరి సత్యారెడ్డి ఆ పోలీసాఫీసర్ ని కాపాడాడా? ఆ నాయకులు ఏం చేసారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు అడ్డగిస్తున్నారు? ప్రైవేటీకరణ చేయడం కోసం ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? ఈ కథలోకి గద్దర్ ఎలా వచ్చారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. ఇది రియల్ గా జరిగిన కొన్ని సంఘటనలు తీసుకొనే కల్పిత సన్నివేశాలు జతచేసి తెరకెక్కించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం గురించి బాగానే చూపించారు. ఇలాంటి ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వెనక ఎలాంటి కథలు నడిపిస్తారు అని చూపించారు. కొన్ని సీన్స్ మాత్రం మరీ నాటకీయకంగా ఉంటాయి. ఇక ఇది గద్దర్ నటించిన చివరి సినిమా. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే గద్దర్ చనిపోవడంతో సినిమాలో కూడా ఆయన మరణించినట్టు చూపించారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. మెయిన్ లీడ్ లో సత్యారెడ్డి పోరాటయోధుడిగా బాగానే నటించారు. డైలాగ్స్ తో బాగానే అలరించారు. ఓ పక్క దర్శకుడిగా, నిర్మాతగా చేస్తూనే యాక్టింగ్ పరంగా బెస్ట్ ఇవ్వడానికి కష్టపడ్డారు. ప్రజనౌక గద్దర్ కాసేపే కనిపించినా ఆయన విప్లవ పర్ఫార్మెన్స్ తో మెప్పించారు. పల్సర్ ఝాన్సీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాగా చేసింది. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ కొన్ని సీన్స్ లో మరింత బెటర్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కెమెరా ఫ్రేమ్స్ కొన్ని సీన్స్ లో కదిలిపోతుంటాయి. రియాలిటీ కథ తీసుకొని కొన్ని సన్నివేశాలని జత చేసి కొన్ని కమర్షియల్ అంశాలను జోడించి విప్లవాత్మక సినిమాగా బాగానే రాసుకున్నారు. ఓ పక్క నటిస్తూనే దర్శకుడిగా సత్యారెడ్డి బాగానే కష్టపడి మంచి అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నించారు.
లొకేషన్స్ వైజాగ్ లోని రియాలిటీ లొకేషన్స్ వాడటంతో ఒరిజినాలిటీ కనిపించింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్. గద్దర్ రాసిన పాటలు విప్లవాత్మకంగా బాగానే ఉన్నాయి. డబ్బింగ్ కూడా అక్కడక్కడా సింక్ కుదరలేదు. నిర్మాణ పరంగా చిన్న సినిమా అయినా కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంతో కొన్ని కల్పిత అంశాలు జోడించి విప్లవాత్మకంగా తెరకెక్కించారు. విప్లవ సినిమాలు నచ్చేవారికి ఈ సినిమా నచ్చొచ్చు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.