బిగ్ బాస్ 3 షో పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెరపై సంచలనం.. బిగ్ బాస్.. ఈ షో మూడవ సీజన్ ఇప్పుడు సాగుతుంది. ఇప్పటికే డెబ్బై రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఈ షో గురించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘బిగ్‌బాస్ 3’ రియల్టీ షోను నిలుపుదల చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిల్‌ను పరిశీలించిన కోర్టు.. ఆ విషయంలో మేం జోక్యం చేసుకోమంటూ స్పష్టం చేసింది.
టెలివిజన్ షోలు ప్రజల భావ ప్రకటనకు సంబంధించిన అంశమని, వారి భావాలను ప్రకటించవద్దంటూ కోర్టులు ఉత్తర్వులు ఇవ్వలేవంటూ చెప్పుకొచ్చింది. ఈ మేరకు సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి ఈ పిటీషన్ వేయగా టీవీ షోల్లో అభ్యంతరాలు ఉంటే ట్రాయ్‌కి ఫిర్యాదు చేసుకోవచ్చని, మాకు సంబంధించిన అంశం ఇది కాదని కోర్టు పిటీషనర్ కు సూచించింది.
ఈ షోను పిల్లలు చూడకుండా నియంత్రించాలంటే వారి తల్లిదండ్రులే నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ షోలో అసభ్యకర, అనైతిక సన్నివేశాలను సెన్సార్ చేయకుండా నేరుగా ప్రసారం చేస్తున్నారని, యువతను చెడుమార్గం వైపు తీసుకెళ్లే ఇలాంటి ప్రసారాలను ఆపివేయాలని పిటీషనర్ కోరారు.