Mahavatar Narsimha : ‘మహావతార్ నరసింహ’ మూవీ రివ్యూ.. భక్త ప్రహ్లాద కథ యానిమేషన్ లో..
భక్త ప్రహ్లాద, నరసింహ స్వామి అవతారం మన అందరికి తెలిసిందే. ఆ కథతోనే ఈ సినిమాని తెరకెక్కించారు.

Mahavatar Narsimha
Mahavatar Narsimha Movie Review : హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాణంలో అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహ’. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ విష్ణువు అవతారలపై యానిమేషన్ సినిమాలను నిర్మిస్తుండగా అందులో మొదటి సినిమా ఇది. తెలుగులో ఈ సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నేడు జూలై 25న రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే.. భక్త ప్రహ్లాద, నరసింహ స్వామి అవతారం మన అందరికి తెలిసిందే. ఆ కథతోనే ఈ సినిమాని తెరకెక్కించారు. కశ్యప మహర్షి భార్య దితి సంధ్య సమయంలో వద్దన్నా శృంగారం కోరుకుంటుంది. అలాంటి సమయంలో శృంగారం చేస్తే రాక్షస అంశ ఉన్నవాళ్లు పుడతారు అని కశ్యప చెప్పినా వినదు. దీంతో కశ్యప – దితిలకు హిరణ్య కశ్యపుడు, హిరణ్యాక్షుడు పుడతారు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు చిన్నప్పుడే వీరిని తీసుకెళ్లి అన్ని విద్యలను నేర్పించి రాక్షసులకు శత్రువు విష్ణువు అని చెప్తాడు. దీంతో అన్నదమ్ములు విష్ణు భక్తుల్ని ఇబ్బందులు పెడతారు. విష్ణువుని కనిపెట్టడానికి హిరణ్యాక్షుడు భూదేవిని సముద్రంలో దాయగా విష్ణువు వరాహ అవతారంలో వచ్చి హిరాణ్యాక్షుడిని చంపేస్తాడు.
Also Read : War 2 Trailer: ఎన్టీఆర్, హృతిక్ ‘వార్ 2’ సినిమా ట్రైలర్ వచ్చేసింది..
దీంతో హిరణ్యకశ్యపుడు విష్ణువు మీద పగతో బ్రహ్మకోసం తపస్సు చేసి గాలిలో, నేల మీద, బయట, లోపల, ఎలాంటి అస్త్ర శస్త్రాలతో, మనుషులు, పశుపక్షాదులతో చావు రాకూడదు అని వరం పొందుతాడు. దీంతో హిరణ్యకశ్యపుడు దేవతలను తన ఆధీనంలోకి తెచ్చుకొని ముల్లోకాలను తానే దేవుడ్ని అని ప్రకటించి విష్ణు భక్తులను ఇబ్బందిపెడతాడు. హిరణ్య తపస్సుకి వెళ్లి వచ్చేలోపు భార్య కయాదు నారదుడి సమక్షంలో ప్రహ్లాదుడికి జన్మనిస్తుంది. ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పట్నుంచే నారాయణుడి భక్తితో పెరుగుతాడు. గురుకులంలో కూడా అందరికి విష్ణువు గురించి చెప్తూ ఉంటాడు. ఇది హిరణ్యని కలవరపెడుతుంది. దీంతో హిరణ్య కశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని చంపమని రకరకాలుగా ప్రయత్నించినా అతనికి చావు రాదు. ఈ క్రమంలో తన చెల్లి హోలికని కూడా కోల్పోతాడు. దీంతో ప్రహ్లాదుడిని ప్రశ్నిస్తూ నీ విష్ణువు ఎక్కడైనా ఉంటాడా అని స్థంభం పగలగొట్టగానే అందులోంచి నరసింహ స్వామి వచ్చి హిరణ్యని ఎలా చంపాడు అనేది తెరపై చూసేయండి..
విశ్లేషణ.. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ విష్ణువు దశ అవతారాల పురాణ కథలను యానిమేషన్ లో చెప్పడానికి ప్లాన్ చేసారు. మొత్తం యానిమేషన్ తోనే ఈ కథ నడుస్తుంది. ఒక విజువల్ వండర్ గా ఈ సినిమాని చూపించారు. క్లైమాక్స్ నరసింహ స్వామి వచ్చిన దగ్గర్నుంచి ప్రతి సీన్ గూస్ బంప్స్ వస్తుంది. ఫుల్ కమర్షియల్ ఫార్మేట్ లో నరసింహ స్వామికి ఎలివేషన్స్ ఇస్తూ పోరాట సన్నివేశాలను యానిమేషన్ లో అంత గొప్పగా తీయడం గ్రేట్ అని చెప్పొచ్చు.
కథ పరంగా బాగానే రీసెర్చ్ చేసారని తెలుస్తుంది. కేవలం ప్రహ్లాదుడు పుట్టినప్పట్నుంచి కాకుండా హిరణ్య కశ్యపుడు, అతని తమ్ముడు గురించి, వరాహ అవతారం గురించి కూడా చూపించి ఒక పూర్తి స్థాయి కథ చెప్పారు. కథనం పరంగా ప్రహ్లాదుడు పాటల సన్నివేశాలు కాస్త సాగదీసినట్టు అనిపిస్తాయి. తెలుగులో డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. డైలాగ్స్ ఎవరు రాసారో కానీ మెచ్చుకోవలసిందే. అచ్చ తెలుగు పదాలు వాడి ప్రతి డైలాగ్ చాలా బాగా రాయడమే కాకుండా డబ్బింగ్ లో అలాగే చెప్పించారు. ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప ప్రతి సీన్ లో యానిమేషన్ పర్ఫెక్ట్ గా కుదిరింది. పిల్లలని కచ్చితంగా ఈ సినిమాకు తీసుకెళ్లాలి. ఇలాంటి చరిత్రను వారికి తెలియచేయడమే కాకుండా ఒక మంచి విజువల్ వండర్ చూపించినట్టు ఉంటుంది.
గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.