ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలుకి కరోనా, దయచేసి ఎవరూ ఫోన్ చేయొద్దు

తెలుగు రాష్ట్రాలు సహా అన్ని రాష్ట్రాల్లో సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే దర్శకులు రాజమౌళి, తేజ అలాగే మరి కొందరు నటులకి కరోనా సోకింది. టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు కరోనాతో చనిపోయారు. నిన్నటికి నిన్న సింగర్ స్మితకు కరోనా సోకింది. ఇక తాజాగా లెజెండరీ సింగర్ బాల సుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ అని తేలింది.
దయచేసి ఫోన్ చేయొద్దు:
ఎస్పీ బాలు ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్నారు. దీంతో అక్కడే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. తనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నట్లు బాలు తెలిపారు. తన గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన కోరారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసేందుకు దయచేసి తనకు ఫోన్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. నేను బాగానే ఉన్నా అని బాలు తెలిపారు. ఆయన ఆరోగ్య౦ నిలకడగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.
బాలుకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆయన కుటుంబ సభ్యులను సెల్ఫ్ క్వారంటైన్ చేశారు అధికారులు. అదే విధంగా ఆయన సోదరి ఎస్పీ శైలజ కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని బాలు కోరారు.
నెలలు కావొస్తున్నా ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత మాత్రం తగ్గడం లేదు. కొన్ని దేశాల్లో కేసులు శర వేగంగా పెరుగుతుంటే, మరికొన్ని దేశాల్లో కేసులతో పాటు మరణాల రేటూ ఎక్కువగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్ధిక వ్యవస్థలను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్ నిబంధలను సడలించాయి. దీంతో చాలా దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి. కాగా, మరో రెండు నెలల పాటు కేసులు ఊహించని స్థాయిలో ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరిక ఆందోళకు గురి చేస్తోంది.
దేశంలో 19లక్షలు దాటిన కరోనా కేసులు:
దేశంలో కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. ప్రతిరోజు 50 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 19 లక్షల మార్కును దాటింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 52వేల 509 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19లక్షల 08వేల 255కు చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 5లక్షల 86వేల 244 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా బారినపడినవారిలో 12లక్షల 82వేల 216 మంది కోలుకున్నారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 857 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 39వేల 795కు పెరిగింది.
కరోనా కేసులు, మరణాల్లో 3వ స్థానంలో భారత్:
రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో గత 24 గంటల్లో 56,411 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 54 వేలకు పైగా పాజిటివ్ కేసులతో అమెరికా రెండో స్థానంలో ఉన్నది. రోజువారి మృతుల్లో కూడా భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. అమెరికా, బ్రెజిల్ దేశాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.