ప్లాస్మా దానం చేయాలని ఫ్యాన్స్ కు మహేశ్ పిలుపు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రేపటితో 45వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఆదివారం (అగష్టు 9, 2020) ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులంతా ప్లాస్మా దానం చేయాలని కోరారు. ప్లాస్మా దానంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చేపడుతున్న అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. ప్లాస్మా దానంతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తూ, పోలీస్ శాఖ సమర్థంగా పనిచేస్తోందన్నారు.
కరోనా కాలంలో అనుక్షణం ప్రజల భద్రత చూసుకుంటూనే, మరోవైపు ప్లాస్మా దానం గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్న సీపీ సజ్జనార్‌ను కృషిని మహేష్ కొనియాడారు. ప్లాస్మా దానంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు సైబరాబాద్ కమిషనర్ ప్రయత్నిస్తున్న తీరు అభినందనీయన్నారు. తన పుట్టినరోజున అభిమానులంతా కూడా ప్లాస్మా దానంపై అవగాహన కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు.
అవకాశం ఉన్నవాళ్లు ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.