Jana Nayagan: ‘జన నాయగన్’ టైటిల్ మార్పు.. కొత్త టైటిల్ ఇదే.. సోషల్ మీడియా ఫ్యాన్స్ ట్రెండ్
జన నాయగన్(Jana Nayagan) సినిమా టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్న మేకర్స్.
Makers changing Jana Nayagan movie title
- విజయ్ పార్టీకి అఖండ ఎన్నికల విజయం.
- త్వరలో విడుదల కానున్న జననాయగన్ చిత్రం.
- అజయ్ జ్ఞానముత్తు వైరల్ సోషల్ పోస్ట్.
Jana Nayagan: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. మొత్తం 100కు పైగా స్థానాల్లో విజయం సాధించి రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. దాంతో, సినీ లోకం నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు సోషల్ మీడియా వేదికగా విజయ్ను ‘ముఖ్యమంత్రి’ అని సంబోధిస్తూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. సంక్రాంతికి మిస్ అయిన వేడుకను విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ విడుదలతో ఈ ఏడాదంతా జరుపుకుందామంటూ ఆయన చేసిన ట్వీట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ‘జన నాయగన్(Jana Nayagan)’ (తెలుగులో ‘జననాయకుడు’) చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్గా, బాబీ డియోల్ విలన్‌గా నటించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ సమస్యల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. దీనికి తోడు సినిమా ఆన్లైన్లో లీక్ కావడం, ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ హక్కులను వదులుకుందనే ప్రచారం చిత్ర యూనిట్‌ను కలవరపెట్టింది. అసలు ఈ చిత్రం థియేటర్లకు వస్తుందో లేదో తెలియని అనిశ్చితి నెలకొంది.
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సాధించిన ఘనవిజయంతో ఈ సినిమాకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి స్థాయికి విజయ్ చేరుకోవడంతో, నిలిచిపోయిన ‘జననాయగన్’ విడుదలకు లైన్ క్లియర్ అయిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మాంభూమికి ముదల్వర్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. రాజకీయ విజయంతో లభించిన మైలేజీని వాడుకుని, త్వరలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
