SVR కోసం : తాడేపల్లిగూడెంకు మెగాస్టార్ చిరంజీవి

  • Published By: madhu ,Published On : August 24, 2019 / 03:06 AM IST
SVR కోసం : తాడేపల్లిగూడెంకు మెగాస్టార్ చిరంజీవి

Updated On : August 24, 2019 / 3:06 AM IST

మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లి గూడెంకు రానున్నారు. ఆగస్టు 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు చేరుకోనున్నారు. ప్రత్యేక జెట్ విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో తాడేపల్లిగూడెంకు వచ్చి..హౌసింగ్ బోర్డులో ఏర్పాటు చేసిన SVR కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కొద్ది రోజుల కిందట..హైదరాబాద్ వెళ్లి SVR సేవా సమితి సభ్యులు చిరంజీవిని కలిశారు. విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా కోరారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సమితి సభ్యులు చూస్తున్నారు. 

తాడేపల్లిగూడెం ఎస్‌వీఆర్ సేవా సమితి కొన్ని నెలల కిందట ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. చిరంజీవితో విగ్రహాన్ని ఆవిష్కరింప చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ప్రోగ్రాం ఫిక్స్ అయ్యింది. 

ఇదిలా ఉంటే..చిరంజీవి నటించిన సైరా సినిమా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై సంచలనం సృష్టిస్తోంది. చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్ర పోషించారు. నయనతార, తమన్నతో పాటు ఇతరులు నటించారు. 

ఇక SVR విషయానికి వస్తే..ఈయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 1918, జులై 03న జన్మించారు. 1974, జులై 18న మరణించారు. నూజివీడులో జన్మించిన రంగారావు..మద్రాసు, ఏలూరు, విశాఖలో విద్యభ్యాసం చేశారు. చదువుకొనే రోజుల్లో నాటకాల్లో నటించేవారు. ఫైర్ ఆఫీసర్‌గా కొద్ది రోజులు జాబ్ చేశారు. నటనపై దృష్టి మళ్లడంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వరూధిని చిత్రంలో తొలిసారిగా నటించారు. ఈ సినిమా అంతగా ఆడలేదు. దీంతో ఛాన్స్‌లు రాలేవు. కొద్దికాలం తర్వాత మళ్లీ ఛాన్స్‌లు వచ్చాయి. తెలుగు, తమిళ, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో 300కి పైగా చిత్రాల్లో నటించారు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ సినిమాలు ఎస్వీఆర్‌కు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారం లభించింది. విశ్వనట చక్రవర్తి, నట సౌర్వభౌమ, నటసింహ బిరుదులు లభించాయి.