Kuberaa : ‘కుబేర’ మూవీ రివ్యూ.. ఓ బిచ్చగాడి చుట్టూ తిరిగే కథ..
క్లాసిక్ లవ్ స్టోరీలు, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమాలు తీసే శేఖర్ కమ్ముల అనామిక తర్వాత మళ్ళీ కుబేరతో థ్రిల్లర్ జానర్ లోకి వచ్చారు.

Nagarjuna Dhanush Rashmika Mandanna Sekhar Kammula Kuberaa Movie Review and Rating
Kuberaa Movie Review : ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘కుబేర’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మాణంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమాని భారీగా నిర్మించారు. కుబేర సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో పాన్ ఇండియా వైడ్ నేడు జూన్ 20న రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే.. బంగాళాఖాతంలో దేశం మొత్తానికి 15 ఏళ్ళు సరిపడా ఆయిల్ నిధి దొరుకుతుంది. దాన్ని ఎలాగైనా సాధించాలని నీరజ్ మిత్రా(జిమ్ సార్బ్) గవర్నమెంట్ తో మాట్లాడతాడు. ఆ ప్రాజెక్టు రావాలంటే అందరికి కలిపి లక్షకోట్లు లంచం కావాలని అడగడంతో ఓకే అంటాడు. కానీ ఆ లక్ష కోట్లను ఎలాంటి అనుమానం రాకుండా అందరికి అధికారికంగా పంపిణీ చేయడానికి దీపక్ తేజ(నాగార్జున)ని ఎంచుకుంటారు. దీపక్ తేజ్ ఒక సిన్సియర్ సిబిఐ ఆఫీసర్. కానీ రాజకీయ నాయకులు తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేస్తారు. నిజాయితీగా ఉంటే ఇంతే అని బాధపడి, తన ఫ్యామిలీ కోసం నీరజ్ ఇచ్చిన ఆఫర్ కి ఓకే చెప్పి జైలు నుంచి బయటకు వచ్చి పనిచేయడం మొదలుపెడతాడు.
దీనికోసం నాలుగు నగరాల నుంచి నలుగురు బిచ్చగాళ్లను తీసుకొస్తారు. దేవా(ధనుష్), దిబియా, ఖేలు, కుష్బూలను తీసుకొచ్చి వాళ్ళని మాములు మనుషులుగా చేసి బినామీలుగా మార్చి వాళ్ళతో ఫేక్ కంపెనీలు పెట్టి డబ్బులు హవాలా చేద్దామని ప్లాన్ చేస్తారు. అలా చేసి వాళ్ళకి ఎంతో కొంత డబ్బు ఇచ్చి పంపించేయాలని దీపక్ అనుకుంటాడు. కానీ నీరజ్ వాళ్ళని చంపడానికి ప్లాన్ చేస్తాడు. దిబియా, ఖేలులను చంపడంతో దేవాకు అనుమానం వచ్చి తప్పించుకుంటాడు. దీంతో అతనిపేరు మీద జరగాల్సిన పదివేల కోట్ల ట్రాన్సక్షన్ ఆగిపోతుంది. తప్పించుకున్న దేవా అనుకోకుండా సమీర(రష్మిక మందన్న)ను కలుస్తాడు. నీరజ్ మనుషులు, దీపక్ దేవా కోసం వెతకడం మొదలుపెడతారు. మరి దేవా దొరికాడా? లక్షకోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయా? సమీర బ్యాక్ గ్రౌండ్ ఏంటి? సమీర – దేవా కలిసి ఏం చేసారు? బిచ్చగాళ్లను చంపే ప్లాన్ దీపక్ కి తెలుస్తుందా? ప్రగ్నెంట్ అయిన కుష్బూని చంపేస్తారా? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : 8 Vasantalu : ‘8 వసంతాలు’ మూవీ రివ్యూ.. కవితాత్మక ప్రేమకథ..
సినిమా విశ్లేషణ.. క్లాసిక్ లవ్ స్టోరీలు, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమాలు తీసే శేఖర్ కమ్ముల అనామిక తర్వాత మళ్ళీ కుబేరతో థ్రిల్లర్ జానర్ లోకి వచ్చారు. ప్రమోషన్స్ లో ఇది డబ్బున్నవాడు వర్సెస్ బిచ్చగాడు అని చెప్పినా ఇది ఓ బిచ్చగాడి కథే అన్నట్టు సాగుతుంది. ఫస్ట్ హాఫ్ పాత్రలు పరిచయం బిచ్చగాళ్లను తీసుకురావడం, వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళతో పని అయ్యాక చంపేయడంతో సాగుతుంది. దేవా తప్పించుకున్న తర్వాత రష్మిక పరిచయం నుంచి సినిమా కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తారు ప్రేక్షకులు. సెకండ్ హాఫ్ మాత్రం థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తుంది. దేవాని పట్టుకోడానికి పడే కష్టాలు, సమీర – దేవా కలిసి చేసే ప్రయాణంతో సాగుతుంది.
డబ్బు చుట్టూ తిరిగే ఓ కార్పొరేట్ థ్రిల్లర్ కథలా చూపిస్తూనే ప్రతి సీన్ లో బిచ్చగాళ్ల జీవితాన్ని ప్రస్తావించారు. సినిమాకి నిడివి ఎక్కువగా ఉండటంతో మైనస్ అవుతుంది. అప్పటికే ఎడిటింగ్ లో చాలా సీన్స్ కట్ చేసినట్టు తెలుస్తుంది. గ్లింప్స్, టీజర్స్ లో చూపించిన కొన్ని సీన్స్ సినిమాలో లేవు. నాగార్జున తన పాత్రకు అలాంటి ఎండింగ్ ఒప్పుకోవడం నిజంగా గ్రేట్. రష్మిక – దేవా సీన్స్ కొన్ని సీరియస్ గా సాగే సినిమాలో కామెడీని వర్కౌట్ చేసాయి. సినిమాకు కుబేర కాకుండా బిచ్చగాడు అని టైటిల్ పెడితే బాగుండేది. సమాజంలో నువ్వు నీలా బతుకు అనే పాయింట్ చెప్తూ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు చేసే మోసాల గురించి చూపించారు. సమాజంలో అందరూ ఏదో ఒకదానికోసం అడుక్కునేవాళ్ళు అనే మెసేజ్ ని రశ్మికతో చెప్పించిన పాయింట్ బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ అంతా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని బాగానే థ్రిల్లింగ్ గా నడిపారు. కానీ క్లైమాక్స్ ఇంకేదో ఉంటుంది అని ఆశిస్తే సింపుల్ గా ముగించేశారు అనిపిస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో బిచ్చగాడి పాత్రలో, అమాయకుడిగా జీవించేసాడు అని చెప్పొచ్చు. తన డైలాగ్ డెలివరీతో పాటు బాడీ లాంగ్వేజ్ లో కూడా పాత్రకు తగ్గట్టు నటించి అదరగొట్టాడు. తిరుపతిలో రియల్ గా అడుక్కునే సీన్స్ లో నటించేందుకు ఒప్పుకున్నందుకు ధనుష్ లాంటి సూపర్ స్టార్ ని అభినందించాల్సిందే. నాగార్జున ఒక ఎక్స్ సిబిఐ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయారు. ఫ్యామిలీ ఎమోషన్, తప్పు చేస్తున్నాను అనే ఎమోషన్ ని బాగా పండించారు. రష్మిక ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించి అలరిస్తుంది. నెగిటివ్ పాత్రలో బాలీవుడ్ నటుడు జిమ్ సార్బ్ బాగానే నటించారు. ధనుష్ తో బిచ్చగాళ్లుగా నటించిన ముగ్గురూ తమ నటనతో చక్కగా మెప్పించారు. షియాజీ షిండే, మిగిలిన నటీనటులు వారి పాత్రలో బాగానే నటించారు.
Also Read : Kuberaa : ‘కుబేర’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్ – నాగార్జున సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారు?
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఉన్న మూడు పాటలు బాగున్నాయి. రష్మిక సాంగ్ ఎడిటింగ్ లో తీసేసారు. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ కట్ చేయాల్సింది. శేఖర్ కమ్ముల సమాజంలో కార్పొరేట్ – రాజకీయాలు చేసే మోసాన్ని తీసుకొని బిచ్చగాళ్ల చుట్టూ కథ రాసుకున్న విధానం, దాన్ని థ్రిల్లింగ్ గా తెరకెక్కించిన విధానం బాగుంది. సినిమా చాలా వరకు ముంబై, తిరుపతి లో రియల్ లొకేషన్స్ లో తీయడం చాలా ప్లస్ అయింది. నిర్మాణ పరంగా ఈ సినిమాకు భారీగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.
మొత్తంగా ‘కుబేర’ సినిమా డబ్బు చుట్టూ తిరుగుతూ థ్రిల్లింగ్ గా సాగే ఓ బిచ్చగాడి కథ. ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.