8 Vasantalu : ‘8 వసంతాలు’ మూవీ రివ్యూ.. కవితాత్మక ప్రేమకథ..

గతంలో మధురం, బ్యాక్ స్పేస్ లాంటి షార్ట్ ఫిలిమ్స్ తో ఒక ట్రెండ్ సృష్టించిన ఫణీంద్ర నర్సెట్టి ఆ తర్వాత మను సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు 8 వసంతాలు అనే సినిమాతో తన స్టైల్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

8 Vasantalu : ‘8 వసంతాలు’ మూవీ రివ్యూ.. కవితాత్మక ప్రేమకథ..

Ananthika Sanilkumar Phanindra Narsetti 8 Vasantalu Movie Review and Rating

Updated On : June 20, 2025 / 7:47 AM IST

8 Vasantalu Movie Review : మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాణంలో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘8 వసంతాలు’. అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించగా హను రెడ్డి, రవితేజ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 20న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ముందు రోజు రాత్రే స్పెషల్ ప్రీమియర్స్ కూడా వేశారు.

కథ విషయానికొస్తే.. 2013 ఊటీలో కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్పించే స్కూల్ లో పొగరుగా ఉండే వరుణ్(హనురెడ్డి)ని ఓడిస్తుంది శుద్ధి అయోధ్య(అనంతిక). దాంతో వరుణ్ మారి శుద్ధి ప్రేమలో పడతాడు. శుద్ధి తండ్రి చనిపోవడంతో తమ టీ ఎస్టేట్స్ ని చూసుకుంటూ రచయితగా బుక్స్ రాస్తూ ఉంటుంది. వరుణ్ శుద్ధి అయోధ్య చుట్టూ తిరిగి కొన్నాళ్ళు ఆమె కోసమే ప్రయాణించి ప్రపోజ్ చేస్తాడు. శుద్ధి కూడా వరుణ్ తో ప్రేమలో పడుతుంది. కానీ ఓ కారణంతో వరుణ్ శుద్ధిని వదిలేసి వెళ్ళిపోతాడు. అదే సమయంలో శుద్ధికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువు చనిపోతాడు. అలాంటి సమయంలో శుద్ధి ఎలా తట్టుకొని నిలబడింది? ప్రేమని ఎలా మర్చిపోయింది? గురువు కోసం ఏం చేసింది? మళ్ళీ తన లైఫ్ లోకి ఇంకో ప్రేమ ఎలా వచ్చింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Manchu Vishnu : టాలీవుడ్ హీరో – హీరోయిన్స్ వాట్సాప్ గ్రూప్.. బయటకు వచ్చేసిన మంచు విష్ణు.. ఎందుకో తెలుసా?

సినిమా విశ్లేషణ.. గతంలో మధురం, బ్యాక్ స్పేస్ లాంటి షార్ట్ ఫిలిమ్స్ తో ఒక ట్రెండ్ సృష్టించిన ఫణీంద్ర నర్సెట్టి ఆ తర్వాత మను సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు 8 వసంతాలు అనే సినిమాతో తన స్టైల్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టైటిల్ కి తగ్గట్టు ఒక అమ్మాయి జీవితంలోని 8 సంవత్సరాలను చూపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ప్రేమ కథ చూపించి, సెకండ్ హాఫ్ ఇంకో ప్రేమకథని చూపించారు. కథ పరంగా రొటీన్ రెగ్యులర్ లవ్ స్టోరీనే. కానీ ఒక అమ్మాయి దృక్పథం నుంచి కథని చూపించడం, అచ్చ తెలుగులో మాటలు అన్ని కవితాత్మకంగా చెప్పడం చేసారు. ముఖ్యంగా ఒక అమ్మాయి మానసికంగానూ, శారీరకంగానూ చాలా బలంగా ఉండగలదు అనే పాయింట్ తో పాటు గురు శిష్యుల బంధం, పేరెంట్స్ తమ కోరికలను పిల్లల మీద రుద్దడం, పిల్లలు ఏదైనా కొత్తగా చదువుతాను, లైఫ్ లో ఒక డ్రీమ్ ఉంది అంటే పేరెంట్స్ సహకరించకపోవడం, అనాథల జీవితం, చదువు విలువ, రచయితల నేపథ్యం.. లాంటి పలు అంశాలను అంతర్లీనంగా కథతో పాటే చూపించారు.

ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఒక అబ్బాయి అమ్మాయి వెనకపడే లవ్ స్టోరీలా సాగినా సెకండ్ హాఫ్ లో చాలా సందేహాలు వస్తాయి. తన లవ్ కోసం ఆరాటపడే అమ్మాయి క్యారెక్టర్ ఫ్రెండ్స్ లవ్ మాత్రం బ్రేకప్ అయితేనే మంచిది అని చెప్పడం వెరైటీగా ఉంటుంది. క్లైమాక్స్ లో హీరో తన భావాలని చెప్పే సీన్ లా చిత్రీకరిద్దాం అనుకున్నా అది డైలాగ్స్ చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనిపిస్తుంది. కొన్ని చోట్ల కంటిన్యుటీ షాట్స్ చూసుకోలేదు. రెండో హీరో లుక్స్ ఎందుకు పాతకాలం హీరోలా చూపించాలి అనుకున్నారో డైరెక్టర్ కే తెలియాలి. రెండో హీరోకి విగ్ పెట్టారు అని ప్రతి సీన్ లోను తెలిసిపోతుంది, పాత్రకు అవసరం లేకపోయినా ఆ విగ్ ఎందుకో మరి. క్లైమాక్స్ లో సీరియల్ షాట్స్ అనిపించేలా, లేదా పాతకాలం క్లైమాక్స్ లా సీన్ క్రియేట్ చేసారు.

సినిమాల్లో ఎమోషన్స్ కి ప్రేక్షకుడికి కన్నీళ్లు వస్తేనే ఆ సీన్ పండినట్టు. ఈ సినిమాలో అలాంటి ఎమోషనల్ సీన్స్ ఉన్నా వాటికి ప్రేక్షకులకు కన్నీళ్లు వచ్చేంత అయితే ఆ సీన్స్ పండలేదు. సెకండ్ హాఫ్ లో రాణిమాలిని అనే ఎపిసోడ్ ఏదో హీరో ఎలివేషన్ కోసం పెట్టినట్టు ఉంటుంది. ఆ కథ, ఆ కథ డైలాగ్స్ అన్ని చాలా సినిమాల్లో ఉన్నవే. సెకండ్ హాఫ్ చివర్లో రాసుకున్న రివర్స్ స్క్రీన్ ప్లే బాగుంటుంది. కాకపోతే అక్కడ రివీల్ చేసే ట్విస్టులు రెగ్యులర్ గా సినిమాలు చూసే ప్రేక్షకులు ఊహించేయొచ్చు. మొత్తంగా ఒక అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా ఉండగలదు అని చెప్తూనే ఆమె జీవితంలో ఉన్న రెండు ప్రేమకథలను కవితాత్మకంగా చూపించారు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడొచ్చు. మొత్తానికి ఇది ఫణింద్ర నర్సెట్టి సినిమా అని ఈజీగా చెప్పేయొచ్చు.

8 vasanthalu

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఈ సినిమాకు అనంతిక చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఓ పక్క మార్షల్ ఆర్ట్స్ పర్ఫార్మ్ చేస్తూ, ఎమోషనల్ సీన్స్ లో, ప్రేమ సన్నివేశాల్లో.. ఇలా ప్రతి సీన్ లోను తన బెస్ట్ ఇచ్చిందనే చెప్పొచ్చు. అనంతికకు ఈ సినిమాతో మంచి పేరుతో పాటు అవార్డులు, అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. హనురెడ్డి యువ ప్రేమికుడిగా మంచి నటనను కనబర్చాడు. రవితేజ గతంలో షార్ట్ ఫిలిమ్స్ లో లాగే నటించి మెప్పించినా అతని లుక్ మాత్రం సెట్ అవ్వలేదు. కన్న, సంజన అనంతిక ఫ్రెండ్స్ గా బాగానే మెప్పించారు. అనంతిక తల్లిపాత్రలో నటించిన నటి కూడా క్లైమాక్స్ లో బాగా నటించారు. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు అంతా వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : Uppu Kappurambu : సుహాస్ – కీర్తి సురేష్ ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్ వచ్చేసింది.. స్మశానంలో స్థలం కోసం గొడవ..

సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోశాయి. ప్రతి ఫ్రేమ్ ని కెమెరామెన్ విశ్వనాధ్ చాలా అందంగా చూపించారు. కచ్చితంగా విజువల్స్ కి ఫిదా అవ్వాల్సిందే. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రతి కవితాత్మక డైలాగ్ ని ఎలివేట్ చేసింది. డైరెక్టర్ చేసిన చిన్న చిన్న తప్పులను మ్యూజిక్, విజువల్స్ కవర్ చేసేస్తాయి. ఉన్న రెండు పాటలు వినడానికి బాగుంటాయి. లొకేషన్స్ కూడా చాలా బాగా చూపించారు. కాశ్మీర్, ఊటీ, ఆగ్రా, కాశీ అందాలను అద్భుతంగా కొత్తగా చూపించారు. ఎడిటర్ కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా పర్ఫెక్ట్ గా కట్ చేసాడు.

కాస్ట్యూమ్ డిజైనర్ ని కూడా మెచ్చుకోవలసిందే. లొకేషన్ కి తగ్గట్టు, సన్నివేశాలకు తగ్గట్టు చక్కగా డిజైన్ చేసారు. ముఖ్యంగా హీరోయిన్ ప్రతి కాస్ట్యూమ్ చాలా బాగుంది. ఇక దర్శకుడు ఫణింద్ర నర్సెట్టి ఒక రెగ్యులర్ కథను ఒక అమ్మాయి దృక్పథంలో బలంగా చెప్పడానికి తనకు అచ్చొచ్చిన స్టైల్ లో కవితాత్మక డైలాగ్స్ తో సినిమాని నడిపించాడు. నిర్మాణ పరంగా మైత్రి సంస్థ బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘8 వసంతాలు’ సినిమా ఒక అమ్మాయి జీవితంలో 8 సంవత్సరాలలో జరిగిన సంఘటనలు, ప్రేమ కథలతో అచ్చ తెలుగు మాటలతో కవితాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.