Devara Review : ‘దేవర’ మూవీ రివ్యూ.. బాహుబలి ట్విస్ట్ ఇచ్చిన కొరటాల శివ..

చెడ్డ పని చేయకుండా ఉండటానికి భయం ఉండాలి, ఆ భయం దేవర ఎలా అయ్యాడు..

Devara Review : ‘దేవర’ మూవీ రివ్యూ.. బాహుబలి ట్విస్ట్ ఇచ్చిన కొరటాల శివ..

NTR Janhvi Kapoor Saif Alikhan Devara Part 1 Movie Review and Rating

Updated On : September 27, 2024 / 12:32 PM IST

Devara Movie Review : ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దేవర’. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. రెండు పార్టులుగా దేవర తెరకెక్కుతుండగా దేవర పార్ట్ 1 సినిమా నేడు సెప్టెంబర్ 27న రిలీజయింది. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించగా, రత్నవేలు సినిమాటోగ్రఫీకి పనిచేసారు. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, షైన్ చామ్ టాకో, శ్రీకాంత్, శృతి మరాఠీ.. పలువురు స్టార్స్ ముఖ్య పాత్రల్లో నటించారు.

కథ విషయానికొస్తే.. యతి అనే గ్యాంగ్ స్టర్ ని పట్టుకోడానికి ఓ స్పెషల్ ఆఫీసర్(అజయ్) తన టీమ్ తో కలిసి రత్నగిరి వస్తాడు. అక్కడ రత్నగిరిలో సింగప్ప(ప్రకాష్ రాజ్) ఆ ఆఫీసర్ కి దేవర కథ చెపుతాడు.

ఓ కొండ మీద నాలుగు ఊళ్లు జనాలు కలిసి పూర్వంలో సముద్రం నుంచి రాజ్యంలోకి శత్రువులు ఎవరు రాకుండా చూసుకునేవాళ్ళు. వాళ్ళకి భయం అంటే తెలీదు. రాజ్యాలు పోయాక బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి ఎత్తుకెళ్లి సొమ్మును సముద్రంలో నుంచి నౌకలు వెళ్తుంటే దాన్నుంచి వీళ్ళు ఎత్తుకొచ్చేవాళ్ళు. అలా రాజ్యం, దేశం కోసం పనిచేసిన వాళ్ళ ప్రస్తుతం తరాలకు పనిలేకుండా పోతున్న సమయంలో మురుగ(మురళి శర్మ) ఈ నాలుగు ఊళ్ళ పెద్దలు దేవర(ఎన్టీఆర్), కుంజర(కలైరాసన్), భైరా(సైఫ్ అలీఖాన్), రాయప్ప(శ్రీకాంత్)లకు డబ్బు ఆశ చూపి దొంగతనంగా తెప్పిస్తున్న సరుకును సముద్రంలో ఓడల నుంచి ఎత్తుకురావాలని చెప్పడంతో వీళ్ళు ఆ పని చేస్తూ సంపాదిస్తుంటారు.

కానీ అందులో వచ్చేవి అక్రమాయుధాలు అని, వాటివల్ల తన వాళ్ళ ప్రాణం కూడా పోయింది అని దేవరకు తెలియడంతో ఇకపై ఈ పని చేయకూడదు అని ఫిక్స్ అవుతాడు. కానీ భైరా, కుంజర విబేధించడంతో వాళ్ళు దేవరకు శత్రువులుగా మారతారు. తనని కాదని ఎవరైనా సముద్రంలోకి వెళ్తే వాళ్ళకి భయాన్ని చూపిస్తాను అంటూ చంపుతూ ఉంటాడు దేవర. దీంతో ఎలాగైనా దేవరను చంపాలని ప్లాన్ వేస్తారు. కానీ కొంతమంది మనుషులను చంపి దేవర మాయమవుతాడు. సంద్రంలో కాపలా ఉంటాను, ఎవరైనా దొంగతనానికి వస్తే చంపేస్తాను అని భయం ఇచ్చి దేవర మాయం అవుతాడు. దేవర ఎక్కడికి వెళ్ళిపోయాడు? భైరా మళ్ళీ సముద్రంలో దొంగతనానికి వెళ్లాడా? భైరా కొడుకు వర పిరికివాడిలా ఎందుకు ఉన్నాడు? వర, తంగం(జాన్వీ కపూర్)ల ప్రేమ కథేంటి? యతి ఎవరు? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read  : Devara : ‘దేవర’ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్, ఆడియన్స్ రియాక్షన్స్ ఏంటి..?

సినిమా విశ్లేషణ.. ఎన్టీఆర్ ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా రావడం, కొరటాల ఆచార్య ఫ్లాప్ తర్వాత రావడం, రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవరతో రావడంతో ఈ సినిమాపై ముందునుంచి అంచనాలు ఉన్నాయి. ఇక రిలీజ్ కి ముందు సాంగ్స్, ట్రైలర్, టీజర్స్ తో చేసిన హడావిడికి ఫ్యాన్స్, ప్రేక్షకులు అంచనాలు భారీగా పెట్టుకున్నారు. అయితే సినిమా కథ యతి అనే గ్యాంగ్ స్టర్ తో మొదలుపెట్టి అసలు సంబంధం లేకుండా ఆఫీసర్ కి భయం చూపించాలని దేవర కథలోకి వెళ్తారు. దీంతో సినిమాలో అసలు యతి ప్రస్తావన మళ్ళీ రాదు. సెకండ్ హాఫ్ లో అతనే విలన్ ఏమో చూడాలి.

దేవర, నాలుగు ఊళ్లు, చుట్టూ పాత్రల ఎస్టాబ్లిషమెంట్ మాత్రం బాగా రాసుకున్నారు కొరటాల. స్క్రీన్ ప్లే లో ఎలాంటి కొత్తదనానికి పోకుండా కథ మామూలుగానే నడిపించారు. ఫస్ట్ పార్ట్ అంతా దేవర కథ చూపించిన తర్వాతే సెకండ్ పార్ట్ లో వర ఎంట్రీ ఇస్తాడు. సినిమా లెంగ్త్ ఆల్మోస్ట్ మూడు గంటలు కావడం, అక్కర్లేని కొన్ని సీన్స్ తో కథ సాగదీసినట్టు ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం అందరూ ముందు నుంచి ఊహించిందే. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం బాహుబలి ట్విస్ట్ ని గుర్తుచేస్తుంది. దీంతో సెకండ్ పార్ట్ వచ్చేంతవరకు ఆ ట్విస్ట్ ని మోయాల్సిందే. యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రం చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. చుట్టమల్లే సాంగ్ కేవలం జాన్వీ అందాలని చూపించడానికి పెట్టినట్టు ఉన్నారు. దావుది సాంగ్ సినిమాలో అసలు లేకపోవడం గమనార్హం. హీరో ఎలివేషన్స్ మాత్రం కావాల్సినన్ని ఇచ్చారు. మొత్తంగా చెడ్డ పని చేయకుండా ఉండటానికి భయం ఉండాలి, ఆ భయం దేవర ఎలా అయ్యాడు అనే కథాంశంతో చూపించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఎన్టీఆర్ రెండు పాత్రల్లో చాలా బాగా నటించాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో అదరగొట్టాడు. ఇక ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోసారి తన డ్యాన్స్ తో కూడా ప్రేక్షకులను అలరించాడు. జాన్వీ కపూర్ పాత్ర అయితే కాసేపే కనిపించి తన అందాలు చూపించడానికి మాత్రమే. సెకండ్ పార్ట్ లో జాన్వీకి ఎక్కువ లెంగ్త్ ఉండొచ్చేమో. శృతి మరాఠి దేవర భార్య పాత్రలో అదరగొట్టేసింది. సైఫ్ అలీఖాన్ నెగిటివ్ రోల్ లో బాగా నటించారు. దేవర తల్లి పాత్రలో రామేశ్వరి, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ చామ్ టాకో, నరైన్, అజయ్, మురళి శర్మ.. వారి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకు సాంకేతికంగా అన్ని విభాగాలు బలంగా ఉన్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ డార్క్ టోన్ లో చాలా అందంగా చూపించారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనిరుధ్ అదరగొట్టేసాడు. చుట్టమల్లే సాంగ్ మెప్పించినా మిగిలిన పాటలు మాత్రం ఓకే అనిపిస్తాయి. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ బాగా కష్టపడ్డారు. పడవలు, సముద్రం, అడవిలో ఊరు సెట్స్.. ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ గా డిజైన్ చేసారు. గ్రాఫిక్ వర్క్స్ కూడా పర్ఫెక్ట్ గా చేసారు. కథ, కథనం మాత్రం కొంచెం బలహీనంగా, సాగదీతగా అనిపిస్తాయి. దర్శకుడిగా కొరటాల వంద శాతం సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా దేవర సినిమాకు చాలా ఎక్కువే ఖర్చుపెట్టినట్టు తెరపై గ్రాండ్ గా కనిపిస్తుంది.

మొత్తంగా దేవర సినిమా మంచి కోసం తన వాళ్ళతోనే పోరాడే ఓ వ్యక్తి కథ. ఆ వ్యక్తి ఏమయ్యాడో అని వెతుకులాట కథ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం పండగే. మిగిలిన వాళ్ళు ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి చూస్తే కొంచెం సాగదీత అనిపించినా నచ్చుతుంది. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.