Prema Katha : ‘ప్రేమకథ’ మూవీ రివ్యూ.. కేవలం ప్రేమకథే..
(Prema Katha)ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చింది. ప్రేమకథ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.

Prema Katha
Prema Katha : కిషోర్ శాంతి దినకరన్, దియా సీతపల్లి జంటగా తెరకెక్కించిన సినిమా ప్రేమకథ. విజయ్ మట్టపలి, సుశీల్ విజప్పిల్లి, సింగనమల కల్యాణ్ నిర్మాణంలో శివశక్తి రెడ్ డీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది, తమిళ్, తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా గత సంవత్సరం జనవరిలో థియేటర్స్ లో రిలీజయింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చింది. ప్రేమకథ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.(Prema Katha)
కథ విషయానికొస్తే.. ప్రేమ్ ని కొంతమంది కొట్టి రోడ్ మీద పడేయడంతో ఫ్లాష్ బ్యాక్ తో కథ మొదలవుతుంది. ప్రేమ్(కిషోర్ శాంతి దినకరన్) తండ్రి చనిపోవడంతో చదువు మానేసి యాదవ్(వినయ్ మహాదేవ్) సహాయంతో ఓ ఫ్యాక్టరీలో పనికి చేరతాడు. యాదవ్ తను ప్రేమించే అమ్మాయి సరోజ(నేత్ర సాధు)ని కలవడానికి వెళ్తుండటంతో ప్రేమ్ ని కూడా తీసుకువెళ్తాడు. సరోజ తన ఫ్రెండ్(దియా సీతేపల్లి)ని తీసుకొస్తుంది. అలా వీళ్ళు రెగ్యులర్ గా కలుస్తుండగా ప్రేమ్ సరోజ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేస్తే వెంటనే కొడుతుంది. కానీ తర్వాత ఇద్దరూ ఫ్రెండ్స్ అయి ప్రేమించుకుంటారు. మరి వీళ్ళ ప్రేమ ఏమైంది? యాదవ్ – సరోజల ప్రేమ ఏమైంది? అసలు ప్రేమ్ ని ఎవరు కొట్టారు ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Soothravakyam : ‘సూత్ర వాక్యం’ మూవీ రివ్యూ.. మలయాళం మర్డర్ మిస్టరీ తెలుగులో..
సినిమా విశ్లేషణ..
టైటిల్ ప్రేమకథకు తగ్గట్టు సినిమాలో ప్రేమకథ మాత్రమే చూపించాడు. సినిమాలో అసలు ప్రేమకథ ఫ్లాష్ బ్యాక్ లో కాసేపు, ప్రస్తుతం ప్రేమ్ ని కొట్టిన తర్వాత సీన్స్ తో కాసేపు స్క్రీన్ ప్లే సాగుతుంది. మొదటి అరగంట వాళ్ళు రోజూ కలవడం, మాట్లాడుకోవడం, బ్యాక్ గ్రౌండ్ లో పాట తప్ప ఏమి ఉండదు. అసలు కథ కదలదు. ఆ తర్వాత హీరో – హీరోయిన్ ప్రేమ కథ వాళ్ళ మధ్య గొడవలు, రొమాన్స్ తో సాగుతుంది.
సినిమా అంతా ఆల్మోస్ట్ ఒక రెండు మూడు లొకేషన్స్ లోనే సాగిపోతుంది. ఇది సినిమా కంటే కూడా ఒక షార్ట్ ఫిలిం చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇక క్లైమాక్స్ ఏదేదో రాసుకున్నారు. చివరకు అసలు క్లైమాక్స్ ఏంటి అని చూపించకుండా ముగింపు ఇచ్చేసారు. సినిమా అంతా హీరోయిన్ పాత్ర పేరు లేకుండానే నడిపించడం గమనార్హం. ఇది ఎప్పుడో కరోనా ముందు తీసిన సినిమా ఆలస్యంగా రిలీజ్ అయిందేమో అనే సందేహం రాక మానదు. లవ్ స్టోరీలు చూసేవాళ్ళు ఫార్వార్డ్ చేసుకుంటూ చూసేయొచ్చు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. కిషోర్ శాంతి దినకరన్ ఓ పేద ప్రేమికుడిగా బాగానే నటించాడు. దియా సీతపల్లి హీరోయిన్ గా కంటే టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తుంది. వినయ్ మహదేవ్ – నేత్ర సాధు జంటగా బాగానే నటించారు. రాజ్ తిరందాసు, మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు.. సాధారణంగా లవ్ స్టోరీలకు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగుంటాయి కానీ ఇందులో సింపుల్ గా కనిపిస్తాయి ఫ్రేమ్స్. మంచి లవ్ సీన్స్ ఉన్నా విజువల్స్ బాగోకపోవడంతో అవి కూడా పండలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు. పాటలు మెప్పించవు. బైలింగ్వల్ అయినా సినిమా తమిళ్ లో తీసి తెలుగు డబ్బింగ్ చెప్పినట్టు ఉంటుంది. కొన్ని చోట్ల డబ్బింగ్ మిస్ మ్యాచ్ అయింది. డైరెక్టర్ ఒక రొటీన్ కథని కాస్త స్క్రీన్ ప్లే ఆధారంగా నడిపించే ప్రయత్నం చేసాడు. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘ప్రేమకథ’ సినిమాలో ఒక ప్రేమకథనే సరైన ముగింపు ఇవ్వకుండా సాగదీసి చూపించారు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.