Sasivadane Review : ‘శశివదనే’ మూవీ రివ్యూ.. సరికొత్త క్లైమాక్స్ తో ప్రేమకథ..
శశివదనే సినిమా చాన్నాళ్లుగా వాయిదా పడుతూ ఎట్టకేలకు నేడు రిలీజయింది. (Sasivadane Review)
Sasivadane Review
Sasivadane Review : రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా తెరకెక్కిన సినిమా ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, SVS స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మాణంలో సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శశివదనే సినిమా నేడు అక్టోబర్ 10న థియేటర్స్ లో రిలీజ్ అయింది.(Sasivadane Review)
కథ విషయానికొస్తే.. గోదావరి జిల్లాల్లోని ఓ గ్రామంలో 2007 బ్యాక్ డ్రాప్ లో ఈ కథ సాగుతుంది. చదువుకుంటూ సరదాగా ఫ్రెండ్ తో తిరిగేస్తూ లైఫ్ గడుపుతుంటాడు రాఘవ(రక్షిత్ అట్లూరి). ఓ రోజు రోడ్డుపై శశి(కోమలీ ప్రసాద్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి వెంటే తిరుగుతాడు రాఘవ. మొత్తానికి ఈ ఇద్దరూ ప్రేమలో పడతారు. అనుకోకుండా రాఘవ.. శశి బావ(దీపక్ ప్రిన్స్)తో గొడవ పెట్టుకుంటాడు. దీంతో శశి బావ రాఘవపై రివెంజ్ తీర్చుకోవాలని చూస్తాడు. మరి శశి బావ రాఘవపై రివెంజ్ తీర్చుకుంటాడా? శశి – రాఘవ ప్రేమ ఏమైంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Ari Review : ‘అరి’ మూవీ రివ్యూ.. అరిషడ్వర్గాలను మనిషి అదుపులో పెట్టుకుంటాడా?
సినిమా విశ్లేషణ..
శశివదనే సినిమా చాన్నాళ్లుగా వాయిదా పడుతూ ఎట్టకేలకు నేడు రిలీజయింది. టీజర్, ట్రైలర్స్ తో గోదావరి బ్యాక్ డ్రాప్ లో ప్రేమకథ అని అంచనాలు నెలకొన్నాయి. అయితే కథ కథనం మాత్రం రొటీన్. ఫస్ట్ హాఫ్ అంతా హీరో – హీరోయిన్ పరిచయం, హీరో హీరోయిన్ వెనక తిరగడంతోనే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా సాగదీశారు. ఇంటర్వెల్ కూడా సింపుల్ గా ఉంటుంది. ప్రతి సీన్ నెక్స్ట్ ఏంటో చెప్పేయొచ్చు. క్లైమాక్స్ మాత్రం కొత్తగా ఉందని ప్రమోషన్స్ లో చెప్పారు. చెప్పినట్టే సెకండ్ హాఫ్ కూడా కొద్దిసేపు రొటీన్ గా సాగదీసినా క్లైమాక్స్ మాత్రం కాస్త కొత్తగానే రాసుకున్నారు.
సినిమా చాలా సాగదీశారు అనే ఫీలింగ్ ప్రతి సీన్ లో వస్తుంది. ఫ్రెండ్ పాత్రతో చేసిన అక్కర్లేని కామెడీ అసలు పండదు. విలన్ కి ఏదో బ్యాక్ గ్రౌండ్ ఉన్నట్టు, హీరోయిన్ – ఆమె అమ్మమ్మ భయపడుతున్నట్టు బిల్డప్ ఇస్తారు కానీ అదేంటో చెప్పరు. ఓపెనింగ్ సాంగ్ లేకపోయినా పర్లేదు అనిపిస్తుంది. కొన్ని లవ్ సీన్స్ మాత్రం క్యూట్ గా బాగుంటాయి. కొన్ని రొమాంటిక్ సీన్స్ గుడిలో ఎలా పెట్టాలనిపించిందో డైరెక్టర్ కే తెలియాలి. అసలు ఈ కథకు 2007 బ్యాక్ డ్రాప్ ఎందుకు అనేది కూడా అర్ధం కాదు. ప్రస్తుత కాలంలో కూడా ఈ కథని నడిపించొచ్చు. అక్కడక్కడా మహేష్, బాలయ్య, చరణ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యేలా వాళ్ళ సినిమా రిఫరెన్స్ లు ఉంటాయి. నాన్న ఎమోషన్ అంతగా పండలేదు. అసలు హీరోకి శ్రీమాన్ నాన్నలానే అనిపించడు. అన్నయ్య, మామయ్య అంటే నమ్ముతారు కానీ చూడటానికి ఎక్కడా నాన్న- కొడుకు లాగా కనపడరు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
రక్షిత్ అట్లూరి బాగానే నటించాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో మాత్రం మెప్పించాడు. సినిమాకు కోమలీ ప్రసాద్ కాస్త ప్లస్ అయింది. ప్రతి సీన్ లో క్యూట్ గా సినిమా అంతా హాఫ్ శారీలో కనిపించి లవ్ స్టోరీలో చక్కగా నటించి తెరపై అందంగా అలరించింది. తండ్రి పాత్రలో శ్రీమాన్ పర్వాలేదనిపించారు. విలన్ పాత్రలో దీపక్ ప్రిన్స్ బాగానే నటించాడు. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన వ్యక్తి, జబర్దస్త్ బాబీ.. అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు.. సినిమా అంతా గోదావరి బ్యాక్ డ్రాప్ లో చూపించడంతో సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం అందంగా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పిస్తుంది. ఒక పాట తీసేస్తే బెటర్. మిగిలిన పాటలు వినడానికి బాగానే ఉన్నాయి. ఎడిటర్ ఇంకా చాలా కట్ చేయాల్సింది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఆల్మోస్ట్ ఇంకో 20 నిమిషాలపైనే సినిమాని కట్ చేయొచ్చు. లొకేషన్స్ కూడా గోదావరి జిల్లాల్లో రియల్ లొకేషన్స్ కావడంతో స్క్రీన్ పై చూడటానికి బాగున్నాయి. దర్శకుడు ఒక రొటీన్ లవ్ స్టోరీ తీసుకొని రెగ్యులర్ కథనంతో కొత్త క్లైమాక్స్ జోడించి తెరకెక్కించాడు ఈ సినిమాని. ప్రేమకు సంబంధించిన డైలాగ్స్ మాత్రం బాగా రాసుకున్నారు. నిర్మాణ పరంగా మాత్రం బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘శశివదనే’ సినిమా గోదావరి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొత్త క్లైమాక్స్ తో రొటీన్ కథ కథనంతో సాగదీసిన ప్రేమకథ. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
