Ari Review : ‘అరి’ మూవీ రివ్యూ.. అరిషడ్వర్గాలను మనిషి అదుపులో పెట్టుకుంటాడా?

మనిషికి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేవి ఉంటాయి. (Ari Review)

Ari Review : ‘అరి’ మూవీ రివ్యూ.. అరిషడ్వర్గాలను మనిషి అదుపులో పెట్టుకుంటాడా?

Ari Review

Updated On : October 10, 2025 / 3:43 PM IST

Ari Review : ఆర్వీ సినిమాస్ బ్యానర్ పై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మాణంలో జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ట్యాగ్ లైన్. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. అరి సినిమా నేడు అక్టోబర్ 10న రిలీజయింది.(Ari Review)

కథ విషయానికొస్తే.. ‘అరి’ సినిమాని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాల అసాధారణ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఈ ఆరు రకాల మానవ బలహీనతలకు ప్రతీకగా ఆరు కీలక పాత్రలను పరిచయం చేస్తారు. అమూల్ (వైవా హర్ష) కామంతో, సన్నీ లియోన్‌తో ఒక్క రాత్రి గడపాలని కోరుకుంటాడు. గుంజన్ (శుభలేఖ సుధాకర్) లోభంతో, తన కుటుంబ ఆస్తిని మొత్తం కాజేయాలని చూస్తాడు. లక్ష్మీ (సురభి ప్రభావతి) మోహంతో చనిపోయిన తన భర్తను తిరిగి బ్రతికించమని కోరుకుంటుంది. విప్లవ్ నారాయణ్ (సాయి కుమార్) మదంతో తన తరతరాలు డబ్బు, హోదాతో తనలానే బతకాలని ఆశిస్తాడు. ఇన్‌స్పెక్టర్ చైతన్య (శ్రీకాంత్ అయ్యంగార్) క్రోధంతో ఒక రహస్య నిధిని సొంతం చేసుకోవాలని చూస్తాడు. ఆత్రేయి (అనసూయ) మాత్సర్యంతో, తన సహోద్యోగి అయిన అవ్య కంటే మరింత అందంగా మారాలని కోరుకుంటుంది.

ఇలా ఆరు పాత్రలు తమ తమ కోరికలు తీర్చుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఇచ్చట అన్ని కోరికలు తీర్చబడును అనే ఒక రహస్య ప్రకటన చూస్తారు. ఆ ప్రకటన చూసిన ఈ ఆరుగురు తమ అసాధారణ కోరికలను నెరవేర్చుకోవడానికి ఏం చేశారు? వారిని టాస్కులో పేరుతో ఆడించింది ఎవరు? చివరకు ఆ ఆరుగురు ఏం చేశారు? చివరకు ఆ ఆరుగురు అరిషడ్వర్గాలను జయించారా.. అనేది థియేటర్లో చూడాల్సిందే.

Also Read : Mahesh Babu: దర్శకధీరుడి పుట్టిన రోజు.. స్పెషల్ ఫోటో షేర్ చేసిన మహేష్ బాబు

సినిమా విశ్లేషణ..

మనిషికి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేవి ఉంటాయి. వాటి వల్ల మనషులు ఎంతగా దిగజారిపోతోంటారు అనేది చెప్పాల్సిన పని లేదు. మనిషిలో ఉండే ఈ శత్రువల్ని ఎలా జయించాలి? అసలు మనిషి.. ఓ మనిషిలా బతకాలి అంటే ఈ ఆరిషడ్వర్గాలను వదిలేయాలి అనే కాన్సెప్ట్‌తోనే దర్శకుడు జయశంకర్ అరి మూవీని తెరకెక్కించాడు. ఈ క్రమంలో ఆయన ఎంచుకున్న పాయింట్ బాగానే ఉంటుంది. అయితే కథనం ఇంకాస్త ఎఫెక్టివ్ గా రాసుకోవాల్సింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆరు పాత్రల పరిచయం, వారి వింత కోరికలతో సాగుతూ పోతుంది. మధ్యలో గోవాలోని పాట అడ్డుగా కనిపిస్తుంది. ఆ ఆరుగురికి ఇచ్చే టాస్కులు మాత్రం కాస్త డిఫరెంట్‌గా కొత్తగా అనిపిస్తాయి. ఇంటర్వెల్‌కు అసలు కథలో కదిలిక కనిపిస్తుంది.

మనిషి కోరికలతో రగిలిపోతోంటే అసలు ఏం చేస్తున్నామనే దానిపై స్పృహ ఉండదు. ఆ ఆరు పాత్రలు కూడా అలానే వ్యవహరిస్తుంటాయి. కానీ సెకండాఫ్‌కి వచ్చే సరికి ఆ పాత్రల్లో మెల్లిమెల్లిగా మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులు వచ్చే క్రమం, అక్కడ రాసుకున్న సీన్లు ఆలోచింపజేసేలా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మరింత ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌లో డైరెక్టర్ కి చెప్పదల్చుకున్న సందేశాన్ని ఎంతో వివరంగా, అర్థవంతంగా ఆడియెన్స్‌కు చెప్పే ప్రయత్నం చేశాడు. చివర్లో మైథలాజికల్ టచ్ కూడా ఇవ్వడం గమనార్హం. ఇలాంటి యూనివర్సల్ సబ్జెక్ట్‌ ని మరింత ప్రభావవంతంగా చెబితే బాగుండేదనిపిస్తుంది.

Ari Review

నటీనటుల పర్ఫార్మెన్స్.. వినోద్ వర్మ పాత్ర హైలెట్‌గా నిలుస్తుంది. ఎక్కువగా కంటి చూపుతోనే నటించినట్టుగా అనిపిస్తుంది. అనసూయ, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రభావతి.. మెయిన్ పాత్రల్లో నటించిన వీరంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. చమ్మక్ చంద్ర, శ్రీనివాస్ రెడ్డి పాత్రలు కూడా మెప్పిస్తాయి. వైవా హర్ష కామెడీ, చమ్మక్ చంద్ర, శ్రీనివాస్ రెడ్డిలు అక్కడక్కడా కాస్త నవ్వించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Kiran-Ravi: కిరణ్ అబ్బవరం ప్రశ్న.. నిర్మాత సమాధానం.. అలా మాట్లాడటం కరక్ట్ కాదంటున్నాడు

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ పరంగా విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. రెండు పాటలు బాగుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. డైరెక్టర్ ఓ కొత్త కాన్సెప్ట్ చెప్పాలని సరికొత్త ప్రయత్నం చేసాడు. చాలా డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచింపచేస్తాయి. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.

మొత్తంగా ‘అరి’ సినిమా ఇప్పటి తరానికి, సమాజానికి అవసరమయ్యే ఓ సందేశాన్ని ఇచ్చేలా తెరకెక్కించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.