1980s Radhe Krishna : ‘1980లో రాధేకృష్ణ’ మూవీ రివ్యూ.. తెలుగు, బంజారా భాషల్లో..
‘1980లో రాధేకృష్ణ’ సినిమా ఓ గ్రామీణ ప్రేమకథకు కుల వివక్షతో పాటు మావోయిస్టుల అంశాన్ని జతచేసి చూపించారు.

Saidulu Bramarambika 1980s Radhe Krishna Movie Review and Rating
1980s Radhe Krishna Movie Review : SS సైదులు హీరోగా, భ్రమరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘1980లో రాధేకృష్ణ’. ఎస్‌వీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఊడుగు సుధాకర్ నిర్మాణంలో ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 1980లో రాధేకృష్ణ సినిమా పలుమార్లు వాయిదా పడి నిన్న అక్టోబర్ 18న థియేటర్స్ లో రిలీజయింది. తెలుగు, బంజారా భాషల్లో ఈ సినిమా విడుదల కావడం గమనార్హం.
కథ విషయానికొస్తే.. వంశీ తన కుటుంబంతో జాతర కోసం సొంతూరు కృష్ణలంకకు వెళ్తాడు. అక్కడ కర్రసాము పోటీలు చూసి వంశీ కొడుకు వాళ్ళ నాన్నని కర్రసాము గురించి అడుగుతాడు. దీంతో వంశీ కర్రసాము పోటీల్లో తన ఫ్రెండ్ కృష్ణ(ఎస్‌ఎస్ సైదులు)ని ఓడించేవాళ్లే లేరు అని చెప్తూ 1980 లోకి తీసుకెళ్తాడు కథని..
కృష్ణ(ఎస్‌ఎస్ సైదులు), వంశీ మంచి ఫ్రెండ్స్. ఇద్దరు కులాలు వేరు అయినా, ఊళ్ళో కులాల పట్టింపులు ఎక్కువ ఉన్నా వీరిద్దరూ ఫ్రెండ్స్ లాగే ఉంటారు. వంశీ పెద్దనాన్న రాఘవయ్య ఆ ఊరికి సర్పంచ్. ఆయన కూతురు రాధ(భ్రమరాంబిక) వంశీ చదివే కాలేజీలో జాయిన్ అవ్వడంతో కృష్ణ – రాధ ప్రేమలో పడతారు. వీళ్ళ ప్రేమకు కులం అడ్డొస్తుంది. అలాగే వీళ్ళ ప్రేమ కథలోకి పోలీసులు, మావోయిస్టులు ఎంటర్ అవుతారు. అసలు రాధ – కృష్ణ ప్రేమలోకి మావోయిస్టులు, పోలీసులు ఎందుకొచ్చారు? వాళ్ళ ప్రేమకు రాధ తండ్రి ఎలా అడ్డుపడ్డాడు? వాళ్ళ ప్రేమకు కులం అడ్డొస్తే వాళ్ళు ఏం చేసారు? రాధ కృష్ణ ఒక్కటయ్యారా? కుల వివక్షకు వాళ్ళ ప్రేమ ఏమైంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : KCR Movie : రాకింగ్ రాకేష్ KCR సినిమా ట్రైలర్ రిలీజ్.. ఎమోషన్ తో అదరగొట్టారుగా..
సినిమా విశ్లేషణ.. గతంలో గ్రామీణ ప్రేమకథలు, కులం పేరుతో ప్రేమకథలు చాలా సినిమాలు వచ్చాయి. ఈ కథ కూడా అంతే. కాకపోతే ఇది 1980లో జరిగినట్టు చూపించారు. పీరియాడిక్ లవ్ స్టోరీ కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు మాత్రం అది ప్రస్తుతం జరిగే కథేనేమో అని సందేహం కలుగుతుంది. కుల వివక్ష, పరువు హత్యలు అంశంపై కథను నడిపించారు. అలాగే చదువుకున్న వాళ్ళు మావోయిస్టులుగా ఎందుకు మారుతున్నారు, వాళ్ళని ఎలా మార్చారు అనేది చూపించారు.
ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమకథతో సాగదీసి ఇంటర్వెల్ నుంచి రాధ – కృష్ణ ప్రేమకు వచ్చినా కష్టాలు, అడవిలో అన్నలు, వాళ్ళ కోసం పోలీసులు, మధ్యలో వీళ్ళు అన్నట్టు ఆసక్తిగా సాగుతుంది. ఓ మెసేజ్ తో ఎండింగ్ ఇచ్చారు. ఓ రెగ్యులర్ ప్రేమకథకు కుల వివక్ష, మావోయిస్టులు, పోలీసులు, ఊరి సమస్యలు ఇలా అన్ని జతచేసి కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. హీరోగా నటించిన SS సైదులు గ్రామీణ యువకుడిగా బాగానే నటించి మెప్పించాడు. కర్రసాముతో కూడా అదరగొట్టాడు. హీరో ఫ్రెండ్‌గా వంశీ పాత్ర చేసిన నటుడు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో మెప్పించిన భ్రమరాంబిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటనతో, తన అందంతో అలరించింది. అర్పిత లోహి బాగానే నటించింది. మిగిలిన నటీనటులు కుడా వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు.. ముఖ్యంగా ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. గ్రామీణ వాతావరం కావడంతో బ్యాక్ గ్రౌండ్ విజువల్స్ అందంగా చూపించారు. కర్రసాము, యాక్షన్ సీక్వెన్స్ లు బాగా డిజైన్ చేసుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి. రెగ్యులర్ ప్రేమకథకు మావోయిస్టుల అంశం జతచేసి కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేసాడు దర్శకుడు షేక్ ఇస్మాయిల్. నిర్మాణ పరంగా కూడా చిన్న సినిమా అయినా బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘1980లో రాధేకృష్ణ’ సినిమా ఓ గ్రామీణ ప్రేమకథకు కుల వివక్షతో పాటు మావోయిస్టుల అంశాన్ని జతచేసి చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.