కలెక్షన్లు @2019: వెలవెలబోయిన తెలుగు సినిమా బాక్సాఫీస్.. కారణం ఇదేనా?

తెలుగు సినిమా పరిశ్రమకు 2019 సంవత్సరంలో ప్రారంభం నుంచి గట్టి దెబ్బలే తగిలాయి. ఈ ఏడాది చెప్పుకోదగ్గ రీతిలో ఒక్క సినిమా కూడా లేదు. భారీ అంచనాలతో విడుదలైన పెద్ద చిత్రాలు భారీ నష్టాలను మిగిల్చాయి. వరుస ప్లాపులతో బాక్సాఫీస్ దద్దరిల్లి పోయింది. సంక్రాంతి సీజన్, వేసవి కాలం, దసరా సీజన్ అనే తేడాలు లేకుండా ఏ సీజన్ కూడా తెలుగు సినిమాను నష్టాల భారి నుంచి తేరుకోనివ్వలేదు. ఈ సంవత్సరం సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదనే చెప్పాలి.
ఈ సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ హిట్టు కేవలం ‘ఎఫ్ 2′.. ఈ సినిమా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కగా.. రూ. 130 కోట్ల పై చిలుకు గ్రాస్ వసూలు చేసింది. ప్యాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కించిన సినిమాలు ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయాయి. మొదటి అడుగు నుంచే పరాజయంతో మొదలవగా.. చివరివరకు అటువంటి ఆటపోట్లనే ఎదుర్కొంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు, రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన వినయ విధేయ రామ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు చిత్రాలు దాదాపు యాభై శాతం నష్టాలను మిగిల్చినట్టు టాక్.
ఇక సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా కాస్త గట్టెక్కించినట్టైంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా.. 175కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టినట్టు తెలుస్తుంది. ఇక మీడియం రేంజ్ సినిమాల హవా బాగానే ఉంది. మజిలీ, జెర్సీ, గద్దలకొండ గణేష్, ఓ బేబి సినిమాలు మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి. లేడీ ఓరియెంటెడ్‌గా వచ్చిన ఓ బేబీ సైతం మంచి వసూళ్లను రాబట్టింది. ఇక జెర్సీ సినిమాతో నాని, గద్దలకొండ గణేష్ చిత్రంతో వరుణ్ తేజ్ వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లు మాత్రం అనుకున్నంత స్థాయిలో లేవు.
ఇక చిన్న సినిమాలుగా వచ్చిన బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఫలక్‌నుమాదాస్ లాంటి సినిమాలు మంచి వసూళ్లను దక్కించుకున్నాయి. బ్రోచెవారెవరురా సినిమాతో హిట్ కొట్టిన శ్రీ విష్ణు, తిప్పరామీసం సినిమాతో బోల్తా కొట్టాడు. అయితే కలెక్షన్లు మాత్రం రెండింటికి అనుకున్నంత స్థాయిలో రాలేదు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రయ, ఫలక్‌నుమాదాస్ సినిమాలు పెట్టిన ఖర్చును రాబట్టుకున్నాయి. ‘ఎవరు’ సినిమాతో ఈ సంవత్సరం అడవి శేషు ఆకట్టుకున్నారు. ఈ సినిమా కాస్త ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టుకుంది.
ఇక భారీ ఎత్తున విడుదల చేసిన సాహో, సైరా సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేదు. దాదాపు వెయ్యి కోట్ల బిజినెస్ చేస్తాయని భావించిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశ్చర్యానికి గురి చేస్తూ నిరాశపరిచాయి. పెట్టిన డబ్బులను తీసుకురావడానికి చాలా కష్టపడ్డాయి. ఈ రెండు సినిమాలపై ద్వితీయార్థంలో ఆశలు పెట్టుకోగా అంచనాలు తారుమారు చేశాయి. సాహో వెయ్యి కోట్లను కొల్లగొడుతుందని భావిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 433కోట్ల గ్రాస్‌తో సరిపెట్టుకుందని టాక్. ఇక సైరా సినిమా 200కోట్లను మాత్రమే తిరిగి రాబట్టుకుందని సమాచారం.
ఇక ఈ సంవత్సరం మరో సినియర్ హీరోల్లో నాగార్జున నుంచి వచ్చిన సినిమా మన్మథుడు సీక్వెల్ మన్మథుడు2. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున అంతగా ఆకట్టుకోకపోయినా వెంకటేష్ మాత్రం రెండు మల్టీ స్టారర్ సినిమాలతో ఈ ఏడాది జోష్ పెంచాడు. వరుణ్ తేజ్‌తో ఎఫ్2, నాగచైతన్యతో వెంకీ మామ సినిమాలు చేసిన వెంకటేష్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాడు. ఇక వచ్చే ఏడాది రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాపై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సాఫీస్ దాహాన్ని ఆర్ఆర్ఆర్ సినిమా తీరుస్తుందని అందరూ భావిస్తున్నారు.
ఈ సంవత్సరం అమేజాన్ ప్రైమ్, హాట్ స్టార్, జీ5, సన్ nXT, జీయో సినిమా వంటి ఫ్లాట్ ఫామ్‌లు రావడం కూడా సినిమాల కలెక్షన్లు తగ్గడానికి కారణం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాలను థియేటర్లలో చూసేవారి సంఖ్య కూడా వీటి కారణంగానే తగ్గినట్లుగా భావిస్తున్నారు.