హలో, టిక్‌టాక్ బ్యాన్.. సినిమా వాళ్ల స్పందన ఏంటంటే..

  • Published By: sekhar ,Published On : July 1, 2020 / 05:19 PM IST
హలో, టిక్‌టాక్ బ్యాన్.. సినిమా వాళ్ల స్పందన ఏంటంటే..

Updated On : July 1, 2020 / 6:20 PM IST

సామాన్యులకు స్టార్‌ స్టేటస్‌ తీసుకొచ్చిన యాప్‌… టిక్‌టాక్‌! దీంతో సహా మరో యాప్‌ ‘హలో’ మాతృసంస్థ ఒక్కటే… బైట్‌డ్యాన్‌!! పేరుకు తగ్గట్టు ప్రజల చేత సంతోషంతో డ్యాన్సులు చేయించింది. వెండితెర, బుల్లితెర నటీనటులకు మించిన ఫాలోయింగ్‌ను సామాన్యులకు కట్టబెట్టింది. సినిమా, సీరియల్‌లో నటించక్కర్లేదు… కొత్తగా, వింతగా చేయగలగడమే టిక్‌టాక్‌లో పాపులారిటీకి సక్సెస్‌ మంత్ర! తెలుగు సినిమా పాటలకు ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ స్టెప్పులేసింది ఈ టిక్‌టాక్‌లోనే! ఇక సామాన్యుల సంగతి చెప్పనవసరం లేదు. అభిమాన తారల పాటలకు స్టెప్పులు వేయడం, డైలాగులకు యాక్ట్‌ చేయడం, పేరడీలు చేయడం.. అబ్బో వీటిలో సామాన్యులు చేసే సంగతులు తక్కువేం కాదు. ప్రజల్లో యాప్స్‌కి పెరుగుతున్న ఆదరణను చిత్ర పరిశ్రమ పట్టుకుంది. ప్రచారానికి వాడుకోవడం ప్రారంభించింది.

Helo, Tiktok

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘డియర్‌ కామ్రేడ్‌’ ప్రచారం కోసం విజయ్‌ దేవరకొండ టీమ్‌ హలో, టిక్‌టాక్‌తో అసోసియేట్‌ అయింది. ‘సరిలేరు నీకెవ్వరు’లో ‘హి ఈజ్‌ సో క్యూట్‌’ విడుదలకు ముందు రష్మిక చేత స్టెప్పులు వేయిస్తూ టిక్‌టాక్‌ కోసం స్పెషల్‌ ప్రోమో విడుదల చేశారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విడుదలప్పుడూ హలో, టిక్‌టాక్‌లో విస్తృతంగా ప్రచారం చేశారు. మరిన్ని సినిమాలు టిక్‌టాక్‌ను ప్రచారానికి వినియోగించుకున్నాయి. దర్శకుడు తేజ కొత్త సినిమా కోసం ‘హలో’లో అప్‌లోడ్‌ చేసిన వీడియోలను ఆడిషన్‌కు తీసుకుంటానని ప్రకటించారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్, వెబ్‌ మీడియాతో పాటు సోషల్‌ మీడియా ప్రచారానికీ సినిమా జనాలు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించిన తర్వాత టిక్‌టాకర్స్‌కి డిమాండ్‌ ఏర్పడింది. సినిమా విడుదలకు ముందు టిక్‌టాక్‌లో ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్న యువతను ప్రత్యేకంగా ఆహ్వానించి వారితో ప్రచారానికి పనికొచ్చేలా వీడియోలు చేసే పద్ధతి కూడా మొదలైంది. మరి ప్రభుత్వం ఈ యాప్స్ బ్యాన్ చేయడం పట్ల మన సినిమా వాళ్లు ఎలా స్పందించారంటే..

Sundeep Kishan

రుచి బావుందని శత్రువు పెట్టే విషాన్ని తినలేం కదా! – సందీప్ కిషన్
‘‘దేశం కంటే ఏదీ (చైనీస్‌ యాప్స్‌) ముఖ్యం కాదు టిక్‌టాక్‌లో నెగెటివిటీ ఎక్కువైందని ఇంతకు ముందు విమర్శలు వచ్చాయి. నిజాయతీగా చెప్పాలంటే… టిక్‌టాక్‌లో నెగెటివ్‌ వీడియోలు వస్తున్నాయి. అవన్నీ ఎవరో వ్యక్తిగతంగా పోస్ట్‌ చేసినవే. అంటే… యాప్‌ రాంగ్‌ కాదు. మనుషులు పోస్ట్‌ చేసే కంటెంట్‌ రాంగ్‌! అయితే, ఈ యాప్‌ వాడటం వలన ఏ దేశం అయితే మన దేశంపై దాడి చేస్తోందో? ఆ దేశానికి మనం ట్యాక్స్‌ రూపంలో డబ్బులు చెల్లిస్తున్నామని తెలిసినప్పుడు… వాడటం కరెక్ట్‌ కాదు కదా! సరిహద్దుల్లో సైనికులు మన కోసం ప్రాణాలు ఇస్తుంటే… వాళ్లపై దాడి చేస్తున్న ప్రత్యర్థులకు డబ్బులు కడుతున్నాం. అది ఎంత దురదృష్టకరం! అందుకే సినిమాలు, క్రీడలు, వినోదం, ఏదైనా… దేశం తర్వాతే!’’..

Himaja

దేశం తర్వాతే ఏదైనా… – హిమజ
‘‘ఒకప్పుడు టిక్‌టాక్‌ యాప్‌ను బాగా ఉపయోగించేదాన్ని. టైమ్‌పాస్‌ కోసం వీడియోలు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాను. లాక్‌డౌన్‌ సమయంలో మాత్రం ఆ యాప్‌తో భలే టైమ్‌ పాస్‌ అయింది. కొద్ది రోజులుగా టిక్‌టాక్‌ మీద ఇంట్రెస్ట్‌ పోయింది. పైగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేదించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని మనం గౌరవించాలి కదా! ఫోన్లో యాప్‌ ఉన్నా ఇకపై ఉపయోగించేది లేదు. చైనా మీద, ఆ దేశ వస్తువుల మీద ఒకప్పుడు ఉన్న గౌరవం ఇప్పుడు లేదు. మన డబ్బు తీసుకుంటూనే మన సైనికుల మీద వారు దాడి చేయడం అసలు నచ్చలేదు. మనదేశ గౌరవం తర్వాతే ఏదైనా’’..

Teja

దేశం కంటే ఏదీ ముఖ్యం కాదు – తేజ
‘‘ఇలాంటి యాప్స్‌ ఉంటాయి, పోతాయి. కానీ దేశం కంటే ఏదీ ముఖ్యం కాదు. దేశ ప్రధానిగా మనం ఒక వ్యక్తిని ఎన్నుకొన్నాం. ఆయన ఏం చెబితే అది పాటించాల్సిందే. ఆయనకు తప్పనిసరిగా మద్దతు పలకాలి. ఇలా 59 రకాల యాప్స్‌ను మన మీదకు వదిలి, దాని ద్వారా డబ్బు సంపాదించి, ఆ డబ్బుతోనే మన మీదకు యుద్ధానికి వస్తున్న చైనాను క్షమించకూడదు. యుద్ధం వస్తే కనుక ప్రతిరోజూ దాని అవసరం నిమిత్తం లక్షల కోట్లు ఖర్చవుతాయి. వాటిని భరించే స్థితిలో మనం ఉన్నామా? అందుకే యుద్ధాన్ని నివారించేందుకు ప్రధాని మోదీగారు చెప్పినట్లు నడుచుకోవాలి. నేను ఓ యాప్‌ ద్వారా ఆడిషన్స్ నిర్వహించాలనుకున్నాను. అది లేకపోతే మరో రకంగా చేస్తాను. నాకు దేశం ముఖ్యం’’..

Anil Sunkara

జనంలో మార్పు రావాలి – అనిల్ సుంకర
‘‘సినిమాల ప్రమోషన్‌ కోసం జనం ఎక్కువగా చూసే ప్రచార సాధనాలు ఉపయోగించు కోవడం సినిమా పరిశ్రమలో సర్వసాధారణమే. టిక్‌‌టాక్‌ కానీ, హలో మరేదైనా కానివ్వండి. అవి లేకపోతే మరొకటి ఎంపిక చేసుకుంటాం. మా సినిమా జనానికి చేరువ కావడం ముఖ్యం. ఇక నా వ్యక్తిగత అభిప్రాయానికి వస్తే.. చైనా యాప్స్‌ బ్యాన్‌ చేయడం మంచిదే.. కాదనను కానీ, వాటికి ప్రత్యామ్నాయంగా మన దేశంలో అలాంటివి తయారు చేసి చూపించాలి కదా. మనం చైనా యాప్స్‌ను బ్యాన్‌ చేసినట్లే అక్కడ కూడా మన వస్తువుల్ని బ్యాన్‌ చేసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా అలాంటి యాప్స్‌ చూడకూడదనే భావన ప్రజల్లో బలంగా రావాలి. అది ముఖ్యం’’..

Read:వెంక‌య్య నాయుడుకి శుభాకాంక్ష‌లు తెలిపిన‌ నందమూరి బాలకృష్ణ