ఎంతో గొప్ప ఆలోచన: మనసున్న మారాజు ప్రకాష్ రాజ్

సినిమాల్లో తన నటనతో విలక్షణ నటునిగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్.. కరోనా వైరస్ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించడమే తప్ప చేసేది ఏం లేదు కాబట్టి.. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పిలుపునిచ్చిన క్రమంలో.. రెక్కాడితే కానీ డొక్కాడని వారి పరిస్థితిని కూడా ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు పట్టించుకోవాలని కోరుతూ.. తన వంతుగా ఏం చేయబోతున్నారో ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
‘జనతా కర్ఫ్యూతో.. నా నగదు నిల్వను ఒకసారి చూసుకున్నాను. నా ఇంట్లో, నా ఫార్మ్ హౌస్ లో, నా ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్ లో ఉద్యోగం చేసేవారికీ, నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకు జీతాలు ముందుగానే ఇచ్చేశాను. నేను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబంధించి దినసరి వేతనం తీసుకొనే కార్మికుల గురించి కూడా ఆలోచించాను. కరోనా మహమ్మారితో పాటిస్తున్న సోషల్ డిస్టెన్సింగ్ మూలంగా షూటింగ్స్ నిలిచిపోయాయి’
‘ఆ దినసరి వేతన కార్మికులకు సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించాను. ఇక్కడితో పూర్తి కాదు. నా శక్తి మేరకు చేస్తాను. మీ అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే. మీ చుట్టూ ఒకసారి చూడండి. మీ సహాయం అవసరమైనవారు ఉంటారు. వారిని ఆదుకోండి. ఒకరి జీవనాన్ని… జీవితాన్ని మీరు నిలిపే సమయం ఇది. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం ఇది’ అంటూ ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలు లాక్ డౌన్ అవ్వడంతో రోజువారి కూలీలకు డబ్బులు దొరికే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ తీసుకున్న నిర్ణయంతో ఆయనను మనసున్న మారాజు అని అంటున్నారు నెటిజన్లు.. ఇది ఎంతో గొప్ప ఆలోచన అని దీనిని ప్రతిఒక్కరు ఆలోచించాలని అంటున్నారు.
#JanathaCurfew .. what I did today .. let’s give back to life .. let’s stand together.?? #justasking pic.twitter.com/iBVW2KBSfp
— Prakash Raj (@prakashraaj) March 22, 2020