శ్మశానవాటికలో కూలిన పైకప్పు…19మంది మృతి

శ్మశానవాటికలో కూలిన పైకప్పు…19మంది మృతి

Updated On : January 3, 2021 / 6:39 PM IST

cremation ground in UP’s Muradnagar collapses ఉత్తరప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. గాజియాబాద్ జిల్లాలోని మురాద్‌నగర్‌లోని ఓ శ్మశానవాటిక కాంప్లెక్స్‌లో వర్షం కారణంగా ఓ భవనం పైకప్పు కూలింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు.మరో 24 మందికి గాయాలయ్యాయి. వీరిని సమీప ఆస్పత్రులకు తరలించారు. మరి కొంతమంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలంలో ఇంకా సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద జరిగిన సమయంలో శ్మశానవాటిక కాంప్లెక్స్‌ కింద సుమారు 60 మంది ఉన్నట్లు సమాచారం. ఓ వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. దీంతో మృతుల్లో ఎక్కువ మంది అతని బంధువులే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. విచారణకు ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ కూడా ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని.. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామమని కమిషనర్ అనిత సి మేష్రామ్ తెలిపారు.శిథిలాల కింద చిక్కుక్కున్న వారిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఘజియాబాద్‌ జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.