బస్సు ప్రమాదం: 20మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ బస్సు.. ట్రక్కును ఢీకొనడంతో మంటలు చెలరేగి, 20 మందికిపైగా ప్రయాణికులు చనిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిలోయి గ్రామంలో శుక్రవారం(10 జనవరి 2020) రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఫరుఖాబాద్ నుంచి 50మంది ప్రయాణికులతో జైపుర్ బయల్దేరిన ఏసీ బస్సు చిలోయి వద్ద ట్రక్కును ఢీకొట్టింది. ఈ ధాటికి మంటలు అంటుకుని క్షణాల్లో వ్యాపించాయి. పోలీసులు 21 మందిని రక్షించి, ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
వాహనాలు బలంగా ఢీకొనడంతో డీజిల్ ట్యాంకు పగిలి భారీగా మంటలు విస్తరించి ఉండవచ్చని అంటున్నారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే సహాయచర్యలు అందించాలని పోలీసులను ఆదేశించారు.
ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ. 2లక్షలను.. గాయపడినవారికి రూ.50వేలను ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులోని ప్రయాణికులు నిద్రపోతూ ఉండడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.