కార్గిల్‌ విజయానికి 26ఏళ్లు.. అప్పటి యుద్ధ దృశ్యాల ప్రత్యేక వీడియోతో కార్గిల్ అమరవీరులకు వాయుసేన నివాళి.. ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్ సహా..

‘కార్గిల్ విజయ్ దివస్’కు 26యేళ్లు నిండిన సందర్భంగా.. అమరవీరులకు భారత వాయుసేన ఘనంగా నివాళులర్పించింది.

కార్గిల్‌ విజయానికి 26ఏళ్లు.. అప్పటి యుద్ధ దృశ్యాల ప్రత్యేక వీడియోతో కార్గిల్ అమరవీరులకు వాయుసేన నివాళి.. ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్ సహా..

Kargil Vijay Diwas

Updated On : July 26, 2025 / 1:08 PM IST

Kargil Vijay Diwas: భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కుట్ర పన్నిన పాకిస్థాన్‌కు ఇండియన్ ఆర్మీ పరాక్రమాన్ని రుచిచూపించిన రోజు ఇది. ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ నుంచి యుద్ధభేరి మోగించి కార్గిల్ కొండల నుంచి శత్రుమూకలను తరిమికొట్టిన సందర్భంగా ప్రతీయేటా జులై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను నిర్వహిస్తాం. ఇవాళ్టితో కార్గిల్ విజయ్ దివస్‌కు సరిగ్గా 26ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ ను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.

‘కార్గిల్ విజయ్ దివస్’ కు 26యేళ్లు నిండిన సందర్భంగా.. అమరవీరులకు భారత వాయుసేన ఘనంగా నివాళులర్పించింది. కార్గిల్ యుద్ధం నాటి చిత్రాలతో ప్రత్యేక వీడియోను రూపొందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను వాయుసేన తమ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. అమరవీరుల ధైర్యం, త్యాగం, దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది.


కార్గిల్ యుద్ధం ఎప్పుడు, ఎందుకు జరిగింది..
1999 జులై 26వ తేదీన భారత సైన్యం కార్గిల్ యుద్ధంలో శత్రు దేశం పాకిస్థాన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. 1999 మే- జులైలో ఇరు దేశాల మధ్య ఈ కార్గిల్ యుద్ధం జరిగింది. ముజాహిదీన్‌ల ముసుగులో నియంత్రణ రేఖను దాటి భారతదేశంలోని భూభాగంలోకి శత్రు సేన చొచ్చుకొని వచ్చింది. కార్గిల్ లో ఖాళీగా ఉన్న భారత కీలక స్థావరాలను శత్రు సేనలు ఆక్రమించుకున్నాయి. వీరి ఆక్రమణను తెలుసుకున్న భారత సైన్యం శత్రు మూకలను తరిమికొట్టేందుకు ‘ఆపరేషన్ విజయ్’ను ప్రారంభించింది. భారత సైన్యం దెబ్బకు బెంబేలెత్తిపోయిన పాక్.. తోక ముడుచుకొని పారిపోయింది. భారత భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకొచ్చిన పాక్ సైన్యాన్ని ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఇండియన్ ఆర్మీ జులై 26న ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతీయేటా జులై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్‌ను నిర్వహించుకుంటున్నాం.


కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ పోస్టు చేశారు. ‘కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్భం మన భారతమాత వీర సైనికుల అసమాన ధైర్యం, పరాక్రమాన్ని గుర్తుచేస్తుంది. వారు దేశ ఆత్మగౌరవ రక్షణ కోసం తమ జీవితాలను అర్పించారు. మాతృభూమి కోసం ప్రతిదీ త్యాగం చేయాలనే వారి అభిరుచి ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. జై హింద్ !​​​​​​​​’ అంటూ మోదీ పేర్కొన్నారు.

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. ‘మన దేశాన్ని రక్షించడంకోసం అత్యంత కఠినమైన భూభాగాల్లో అసాధారణ ధైర్యం, దృఢ సంకల్పంతో పోరాడి ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులర్పిస్తున్నా. కార్గిల్‌ యుద్ధంలో వారి త్యాగం.. మన సాయుధ దళాల సంకల్పానికి నిదర్శనం. వారికి ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది’ అని కేంద్ర మంత్రి పోస్ట్‌ చేశారు.