మధ్యప్రదేశ్ లో ఆపరేషన్ కమలం…హోటల్ లో 4గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 4, 2020 / 11:05 AM IST
మధ్యప్రదేశ్ లో ఆపరేషన్ కమలం…హోటల్ లో 4గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Updated On : March 4, 2020 / 11:05 AM IST

మధ్యప్రదేశ్‌లో ఆపరేషన్ కమలం స్టార్ట్ అయింది. 15నెలల కమల్ నాథ్ సర్కార్ సంక్షోభంలో పడినట్టు కనిపిస్తోంది. అధికార పక్షానికి చెందిన 4గురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి దగ్గర్లోని గురుగ్రామ్ లో ఉన్న ఓ లగ్జరీ హోటల్లో దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. దీంతో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే కేవలం 7 సీట్లు మాత్రమే వెనుకబడ్డ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. బీఎస్పీ,ఎస్పీ,ఇండిపెండెంట్ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మంగళవారం (మార్చి 3)అర్ధరాత్రి తర్వాత ఆపరేషన్ కమల్‌ తెర పైకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను,ఆ పార్టీకి మద్దతునిచ్చిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు,ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. కమల్‌నాథ్ సర్కార్‌ను కూల్చివేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మధ్యప్రదేశ్ ఆర్థికమంత్రి తరుణ్ భానోత్ చేసిన ఆరోపణలు ‘ఆపరేషన్ కమల్’ను బయటపెట్టాయి. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను,ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలను,ఒక ఎస్పీ,ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేను బీజేపీ గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో బలవంతంగా నిర్బంధించిందని ఆయన ఆరోపించారు. హర్యానా పోలీసుల సాయంతో బీజేపీ ఈ చర్యకు పాల్పడిందన్నారు. నిర్బంధించబడ్డ ఎమ్మెల్యేల్లో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే,మాజీ మంత్రి బిసహులాల్ సింగ్ తమకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్టు చెప్పారు.

అర్థరాత్రి హోటల్ కు మంత్రులు..
 సమాచారం అందిన వెంటనే పట్టణాభివృద్ది శాఖ మంత్రి జైవర్దన్ సింగ్,ఉన్నత విద్యాశాఖ మంత్రి జీతు పట్వారీ ఆ హోటల్‌ వద్దకు వెళ్లారని.. కానీ హోటల్ సిబ్బంది తమవాళ్లను లోపలికి అనుమతించలేదని తరుణ్ భానోత్ తెలిపారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమ ప్రభుత్వంపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మధ్యప్రదేశ్ మాజీ మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ ఆపరేషన్‌కు సూత్రధారిగా అనుమానిస్తున్నారు.

దిగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ సీనియర్ నేత,మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. తమ ఇద్దరు మంత్రులు గురుగ్రామ్‌లోని ఆ హోటల్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారన్నారు. కానీ బిసుహులాల్ సింగ్,రమాభాయ్ ఇద్దరు మాత్రమే తమతో కాంటాక్ట్‌లోకి వచ్చారని.. వారిలో రమాభాయ్ ఒక్కరే బయటకు వచ్చారని తెలిపారు. మిగతావారిని బయటకు రాకుండా బీజేపీ అడ్డుకుంటోందని.. రమాభాయ్‌ను కూడా ఆపే ప్రయత్నం చేసినా ఆమె వారిని వెనక్కి నెట్టి వచ్చేసిందన్నారు. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా వెలుగుచూసింది. గురుగ్రామ్ మానేసర్‌లోని ఐటీసీ హోటల్ నుంచి బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యే రమాభాయ్‌ని తీసుకుని మంత్రులు పట్వారీ,జైవర్దన్ అక్కడినుంచి వెళ్తున్నట్టుగా అందులో కనిపిస్తోంది.

కమల్ నాథ్

ఇక ఇప్పటికిప్పుడు తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని ముఖ్యమంత్రి కమల్‌నాథ్  ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమందికి బీజేపీ భారీగా డబ్బు ఆఫర్ చేసిన ప్రలోభ పెడుతోందని అన్నారు. బీజేపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తమ ప్రభుత్వం కూలిపోదని.. ఎమ్మెల్యేలు తమవైపే ఉన్నారని కమల్‌నాథ్ చెప్పారు. మరోవైపు కాంగ్రెస్‌ సంచలనాల కోసమే తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడుతున్నారు కమలనాథులు

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 228. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 122 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు బీఎస్పీ,ఒకరు ఎస్పీ,నలుగురు ఇండిపెండెంట్లు. మరోవైపు బీజేపీకి 107 మంది సభ్యుల ఉంది. కాంగ్రెస్‌కు మద్దతునిచ్చిన ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హోటల్లో బంధించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ కమలం సక్సెస్ అయితే కర్ణాటక మాదిరిగా మధ్యప్రదేశ్ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది.