వలస కార్మికుల సామాన్లు మోస్తూ 80ఏళ్ల కూలీ ఉచిత సాయం

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. వలస కార్మికుల కోసం రైల్వే శాఖ మే మెుదటి వారంలో ప్రత్యేక లేబర్ రైళ్లను ప్రారంభించింది. దీంతో వలస కార్మికులు ప్రత్యేక రైళ్లలో తమ స్వంత గ్రామాలకు వెళుతున్నారు. లక్నోలోని చార్ బాగ్ రైల్వే స్టేషన్ కు వస్తున్న వలస కార్మికులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో 80ఏళ్ల ముజిబుల్లా అనే కూలీ ఉచితంగా వారి సామాన్లను మోస్తూ సాయం చేస్తున్నాడు. ఇలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లోను, అతను చేస్తున్న సేవలపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
80ఏళ్ల వయసులోనూ ముజిబుల్లా ప్రతిరోజూ 8 నుంచి 10 గంటలు పని చేస్తాడు. ఒక సమయంలో తలపై 50 కిలోల బరువున్న సామాన్లను మోయగలను అని ముజిబుల్లా తెలిపాడు. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చార్ బాగ్ రైల్వే స్టేషనకు వచ్చే వలస కార్మికులకు ఉచితంగా సేవలను అందిస్తున్నాడు. దీనిని ‘ఖిద్ మత్’ అంటారు. కార్మికులకు సేవ చేయటం తన కర్తవ్యం అని ముజిబుల్లా చెప్పారు. ఇలా ఉచితంగా సామాన్లను తీసుకెళ్లటమే కాకుండా, రైలులోని ప్రయాణికులకు ఆహారం, వాటర్ బాటిళ్లను కూడా పంపిణి చేస్తున్నాడు. ఈ కరోనా వైరస్ పరిస్థితి మెరుగుపడిన తర్వాత డబ్బు సంపాదించగలనని నేను నమ్ముతున్నాను అని అన్నారు.
కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాటానికి చాలా మంది సహకరిస్తున్నారని ముజిబుల్లా అన్నారు. అందుకే కార్మికుల సేవ కోసం రోజుకు 8 నుంచి 10 గంటలు పని చేస్తాను, పరిశుభ్రత పట్ల కూడా ముజిబుల్లా అప్రమత్తంగా ఉంటానని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే వారికి టాయిలెట్ ఎక్కడ ఉందో చూపిస్తాను అని చెప్పారు. ఈయన చేసిన సేవలకు సంబంధించిన కొన్ని పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన నిజమైన హీరో అని, ఇలాంటి వ్యక్తులు మానవాళిలో సజీవంగా నిలిచిపోతారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.