దేశంలో 82కి చేరిన కొత్త కరోనా కేసులు

దేశంలో 82కి చేరిన కొత్త కరోనా కేసులు

Updated On : January 8, 2021 / 1:52 PM IST

new strain of COVID-19 భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. కొత్త కరోనా వైరస్​ స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా మరో 9మందికి కొత్త రకం కరోనా వైరస్​ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో కొత్త రకం కరోనా వైరస్ కేసుల సంఖ్య 82కి చేరింది. బాధితులందరూ అత్యాధునిక వైద్య సౌకర్యాలతో సింగిల్​రూమ్ ఐసోలేషన్​లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇక,యూకేలో తొలిసారిగా వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచదేశాలను భయపెడుతున్న సమయంలో ఇవాళ యూకే నుంచి 246మంది ప్రయాణికులతో వచ్చిన ఎయిరిండియా విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. కరోనా న్యూ స్ట్రెయిన్ నేపథ్యంలో గత నెల 23 భారత్-యూకే మధ్య రద్దైన విమానాలు.. వైర‌స్ ప్ర‌భావం ఏ మాత్రం త‌గ్గ‌క‌ముందే ఇవాళ తిరిగి ప్రారంభమ‌య్యాయి.

మరోవైపు, దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 18 వేల 139 పాజిటివ్ కేసులు, 234 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,13,417కు చేరింది. మరణాల సంఖ్య 1,50,570కి చేరింది. రికవరీ రేటు 96.39శాతంగా ఉందని తెలిపింది. భారత్​లో రోజువారీ నమోదవుతున్న కొవిడ్​ కేసుల్లో కేవలం 10 రాష్ట్రాల్లోనే 81.22 శాతం బాధితులు ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. వీటిల్లో కేరళ(గురువారం 5,051 కేసులు) ఫస్ట్ ఫ్లేస్ లో ఉండగా..మహారాష్ట్ర(3,729 కేసులు), ఛత్తీస్​గఢ్​(1,010 కేసులు) తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది.