రోజుకో టర్న్‌ తీసుకుంటున్న ఢిల్లీ పాలిటిక్స్.. రాష్ట్రపతి పాలన పెడతారని ఊహాగానాలు

ఢిల్లీ పరిస్థితులను కేంద్రహోంశాఖ పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. సీఎంను తప్పించే అంశాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇవేవి కుదరకపోవడంతోనే రాష్ట్రపతి పాలన పెట్టాలనే డెసిషన్‌కు వచ్చారని అంటోంది ఆప్.

రోజుకో టర్న్‌ తీసుకుంటున్న ఢిల్లీ పాలిటిక్స్.. రాష్ట్రపతి పాలన పెడతారని ఊహాగానాలు

Delhi Politics: దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. సీఎం కేజ్రీవాల్‌ బయట ఉన్నప్పుడు అంతా సాఫీగా సాగిన వ్యవహారం..ఆయన జైలుకు వెళ్లాక గాడి తప్పుతున్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు తమ నేతలు లాక్కుంటూనే.. మరోవైపు రాష్ట్రపతి పాలన పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తుంది ఆప్. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాలే కొనసాగుతారా లేక రాజీనామా చేసి ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తారా అని చర్చ జరుగుతుండగానే.. మరో కొత్త ఇష్యూ తెరమీదకు వచ్చింది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెడతారని తమకు పక్కా సమాచారం ఉందని ఆరోపిస్తున్నారు ఆప్ నేతలు.

ఢిల్లీ ప్రభుత్వాన్ని వీక్‌ చేసే కుట్ర జరుగుతోందని ఆప్‌ మంత్రి అతిషి ఆరోపించారు. కేజ్రీవాల్ గవర్నమెంట్‌ను అస్థిరపరిచి.. రాష్ట్రపతి పాలన పెట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని మండిపడుతున్నారు. పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ.. అధికారులను కేటాయించడం లేదని.. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి అధికారులు సమావేశాలకు హాజరుకావడం లేదంటున్నారు ఆప్ నేతలు. కుట్రలో భాగంగానే సీఎం పర్సనల్ సెక్రటరీని తొలగించారని ఆరోపిస్తున్నారు.

కేజ్రీవాల్ సీఎం పదవికి రిజైన్ చేయాల్సిందే
కేజ్రీవాల్ సీఎం పదవికి రిజైన్ చేయాల్సిందేనంటుంది బీజేపీ. అవినీతి కేసులో జైలుకెళ్లి..మళ్లీ జైలు నుంచే బాధ్యతలు నిర్వహిస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే కేజ్రీవాల్ ఏ తప్పు చేయలేదని.. అందుకే రాజీనామా చేయబోరని ఆప్ అంటోంది. కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్‌పై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ కూడా జరిగింది. కేజ్రీవాల్‌ సీఎంగా కొనసాగడానికి న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు లేవని కోర్టు తేల్చిచెప్పింది. అయితే సీఎంను తప్పించాలా..వద్దా అనేది కేంద్రం నిర్ణయమని చెప్పింది కోర్టు.

ఆప్‌ పార్టీకి ఢిల్లీలో ఫుల్ మెజార్టీ
అప్పటికే ఢిల్లీ పరిస్థితులను కేంద్రహోంశాఖ పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. సీఎంను తప్పించే అంశాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇవేవి కుదరకపోవడంతోనే రాష్ట్రపతి పాలన పెట్టాలనే డెసిషన్‌కు వచ్చారని అంటోంది ఆప్. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతల ఆరోపణల్లో వాస్తవం ఎంతుందో తెలియదు కాని.. టెక్నికల్‌గా ఎంతవరకు సాధ్యమనేది చర్చనీయాంశంగా మారింది. ఆప్‌ పార్టీకి ఢిల్లీలో ఫుల్ మెజార్టీ ఉంది. పైగా ఢిల్లీలో ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదు. సీఎంకు సభలో మద్దతు లేనప్పుడు, అవిశ్వాస తీర్మానంతో అసెంబ్లీలో మెజార్టీ కోల్పోయినప్పుడు, ఏదైనా తీవ్ర ఘర్షణ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే గవర్నర్‌ సిఫార్సుతో రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఈ పరిస్థితులు అయితే ఇప్పుడు ఢిల్లీలో లేవు.

Also Read: తమిళనాట సరికొత్త రాజకీయం.. బీజేపీని ఢీకొట్టేందుకు పాట్లు పడుతున్న ద్రవిడ పార్టీలు

కన్ఫ్యూజన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ
లిక్కర్‌ స్కాం కేసు ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేస్తుంది. కేజ్రీవాల్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన తర్వాత ఆప్ పార్టీ మరింత కన్ఫ్యూజన్‌లో పడింది. మొన్నటివరకు ఒక్కతాటిపై కనిపించిన నేతలంతా.. నెమ్మదిగా జారుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ మంత్రి పదవికి, ఆప్‌కు రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక మంత్రి రాజీనామా చేయగా.. సీఎం పీఎస్‌ వైభవ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించారు. అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలున్నాయి.