ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తొలి సారిగా ట్రాన్స్ జెండర్ పోటీ

ప్రయాగ్ రాజ్ : లోక్ సభ ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ నుంచి తొలిసారిగా ట్రాన్స్ జెండర్ పోటీ చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోక్ సభ స్ధానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరుఫున “భవానీ మా” గా సుపరిచితురాలైన భవానీనాధ్ వాల్మీకి బరిలోకి దిగారు. ఇక్కడ బీజేపీ నుంచి రీటా బహుగుణ జోషి, ఎస్పీ-బీఎస్పీ కూటమి నుంచి రాజేంద్ర ప్రతాప్ సింగ్ పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా భవానీ నాధ్ మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు చాలా రాజకీయ పార్టీలను సంప్రదించానని, కానీ ఏ రాజకీయ పార్టీ కూడా తనకు అవకాశం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే తన ఆలోచనలు, సిధ్దాంతాలు నచ్చి ప్రయాగ్ రాజ్ స్ధానాన్ని కేటాయించిందని చెప్పారు.
ప్రయాగ్ రాజ్ నియోజక వర్గం నుంచి ముగ్గురు ప్రధాన మంత్రులు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఏమీ అభివృధ్ది జరగలేదని ఆమె చెప్పుకొచ్చారు. నియోజక వర్గంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారని, విద్యా, ఉద్యోగం, ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపుతానని ఆమె అన్నారు. కొన్ని ఏరియాల్లో 300 కుటుంబాలకు ఒక బోరింగ్ పంపు మాత్రమే ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. ట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం, సమాజంలో మార్పు కోసం కృషి చేస్తానని “భవానీ మా” హామీ ఇచ్చారు. నేను కిన్నెరా అఖాడాకు మహా మండలేశ్వర్ గా ఉన్నప్పటికీ ట్రాన్స్ జెండర్ల సమస్యలను పరిష్కరించలేను, కానీ చట్టసభల్లోకి వెళితే వారి సమస్యలను పరిష్కరించగలుగుతాననే విశ్వాసం ఉందని ఆమె చెప్పారు. 6వ విడతలో 2019 ,మే12న ఇక్కడ పోలింగ్ జరగనుంది.