Abhijit Mukherjee : కాంగ్రెస్ కి షాక్..టీఎంసీలో చేరిన ప్రణబ్ ముఖర్జీ కుమారుడు
వెస్ట్ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Tmc
Abhijit Mukherjee వెస్ట్ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోమవారం కోల్ కతాలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పార్టీలో చేరారు.కోల్ కతాలోని టీఎంసీ ఆఫీసులో అభిజిత్ కు టీఎంసీ నేతలు పార్థా ఛటర్జీ, సుదీప్ బంధోపాధ్యాయలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీఎంసీలో చేరిన అనంతరం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ధన్యవాదాలు తెలిపారు అభిజిత్. ఇటీవల బీజేపీ మతతత్వ వేవ్ ని మమతా బెనర్జీ నిలిపివేసిన విధానం, భవిష్యత్తులో ఇతరుల సహకారంతో ఆమె మొత్తం దేశంలో కూడా అదే విధంగా చేయగలదని తాను నమ్ముతున్నానని అభిషేక్ బెనర్జీ తెలిపారు. కాంగ్రెస్ లో ప్రాథమిక సభ్యత్వం తప్ప తనకు ఎలాంటి పొజిషన్ లేదని… టీఎంసీలోనూ సాధారణ సైనికుడిగానే చేరినట్టు అభిజిత్ తెలిపారు. పార్టీ సూచనలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు.
కాగా, గత నెలలో కోల్‌కతాలో టీఎంసీ నేత, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని.. అభిజిత్ ముఖర్జీ కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఎంసీ నేతలతో అభిజిత్ పార్టీ మారే విషయంపై సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. మరోవైపు ఇటీవల నకిలీ వ్యాక్సినేషన్ స్కామ్‌పై దీదీకి మద్దతుగా అభిజిత్ ట్విట్టర్ వేదికగా తన వాణిని వినిపించారు.
ఇక, 2011లో మొదటిసారి బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు అభిజిత్ బెనర్జీ. 2012లో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో… ఆయన రాజీనామా చేసిన జంగీపూర్ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు అభిజిత్. తర్వాత 2014లోనూ అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఎంపీగా గెలిచారు. అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో అభిజిత్ ఓటమి పాలయ్యారు.