దారుణం : ఒకే కుటుంబంలోని 16మందిపై యాసిడ్ దాడి 

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 09:14 AM IST
దారుణం : ఒకే కుటుంబంలోని 16మందిపై యాసిడ్ దాడి 

Updated On : August 28, 2019 / 9:14 AM IST

బీహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. చిన్నపిల్లల మధ్య జరిగిన ఓ గొడవ దారుణ ఘటనకు దారి తీసింది. ఒకే కుటుంబంలోని 16మందిపై యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బీహార్‌లోని వైశాలి జిల్లా వైశాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దావూద్‌పూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది.

ఈ ఘటనపై పోలీస్ అధికారి రాఘవ్ దయాల్ మాట్లాడుతూ దావూద్‌పూర్ గ్రామంలో రెండు కుటుంబాలకు చెందిన చిన్నపిల్లల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవకాస్తా ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ఈ క్రమంలో ఒక కుటుంబానికి చెందినవారు ఆగ్రహంతో ఊగిపోయారు. అనంతరం మరో కుటుంబంలోని 16మందిపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు తప్పించుకోగా..ఇద్దరు మహిళలతో సహా 13మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన బాధితులను హాజీపూర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో  పలువురు పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఓ సందర్భంలో తమ కుటుంబం లైంగిక వేధింపులను అడ్డుకున్న కారణంగానే తమపై యాసిడ్ దాడి చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.