తమిళనాడు ఎన్నికల్లో సింగిల్‌గా బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా విజయ్.. ప్రజల్లోకి వెళ్లేందుకు భారీ ప్లాన్ 

సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు తమిళనాడు అంతటా పర్యటించనున్నారు.

తమిళనాడు ఎన్నికల్లో సింగిల్‌గా బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా విజయ్.. ప్రజల్లోకి వెళ్లేందుకు భారీ ప్లాన్ 

Actor Vijay

Updated On : July 4, 2025 / 6:46 PM IST

తమిళనాడు రాజకీయాల్లోకి కొన్ని నెలల క్రితమే ఎంట్రీ ఇచ్చిన సినీనటుడు ‘దళపతి’ విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) పోటీ చేస్తుందని ఇవాళ ప్రకటించారు. టీవీకే తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తానే బరిలోకి దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, బీజేపీతో పొత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. “బీజేపీతో ఎప్పటికీ పొత్తు ఉండదు” అని స్పష్టం చేశారు.

చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో విజయ్ మాట్లాడుతూ.. అధికార డీఎంకే, ప్రతిపక్ష బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  “అవకాశం కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టే పార్టీ మాది కాదు. అన్నా, పెరియార్‌ను అవమానించే బీజేపీతో కలిసి తమిళనాడులో గెలవలేరు. బీజేపీతో డీఎంకే, అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంటాయి. మా పార్టీ అలాంటిది కాదు” అని చెప్పారు. తన పోరాటం డీఎంకే, బీజేపీ రెండింటికి వ్యతిరేకంగానే ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read: దారుణం.. ఆ గ్రామంలో సింగిల్‌ కిడ్నీతో బతుకుతున్న జనాలు.. సంచలన విషయాలు వెల్లడి

ప్రజల్లోకి వెళ్లేందుకు భారీ ప్లాన్
కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు టీవీకే కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది సభ్యులను చేర్చుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు విజయ్, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు తమిళనాడు అంతటా పర్యటించనున్నారు.

ఆగస్టులో జరగబోయే ఈ సదస్సులో ఎన్నికల వ్యూహాన్ని ప్రకటించనున్నారు. రైతులు, తమిళ గుర్తింపు కోసం పోరాటం చేయనున్నారు.

కాగా, నేటి సమావేశంలో టీవీకే పలు కీలక తీర్మానాలను ఆమోదించింది, ఇవి పార్టీ ప్రాధాన్యతలను స్పష్టం చేస్తున్నాయి.

తీర్మానాలు ఇవే..

  • కచ్చతీవు దీవిని తిరిగి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేయడం
  • తవ్వకాల్లో బయటపడిన తమిళ నాగరికతను కేంద్రం దాచిపెట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించడం
  • ఢిల్లీ రైతుల ఆందోళన సమయంలో కేంద్రం వ్యవహరించిన తీరును తప్పుబట్టడం
  • మెల్మా SIPCOT పరిశ్రమ విస్తరణ ప్రణాళికను తమిళనాడు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • కృష్ణగిరి, తేని, తిరువళ్లూరు, సేలం, దిండిగుల్ జిల్లాల్లో మామిడిపండ్ల రైతుల హక్కుల కోసం పోరాటం చేయాలని ప్రతిజ్ఞ

విజయ్ దూకుడు, స్పష్టమైన వైఖరి తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. డీఎంకే, అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్న విజయ్.. బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.