PubGపై నిషేధం, మరో 275 చైనా యాప్‌లపైనా బ్యాన్ చేసే యోచనలో కేంద్రం

చైనాపై డిజిటల్ వార్ ప్రకటించిన భారత్ ఇప్పటికే 59 చైనా యాప్ లపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం అనూహ్యంగా 59 యాప్ లపై నిషేధం విధించడంతో చైనా కంగుతింది. భారీగా నష్టపోయింది. 59 యాప్ లలో ప్రముఖ మేసేజింగ్ యాప్ టిక్ టాక్ కూడా ఉంది.
లిస్టు రెడీ చేసిన భారత్:
ఇప్పుడు చైనాకి మరో పెద్ద షాక్ ఇచ్చేందుకు భారత్ రెడీ అయినట్టు తెలుస్తోంది. చైనాతో సంబంధం ఉన్న మరో 275 యాప్‌లను నిషేధించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో వాటి జాబితాను తయారు చేసి ఉంచినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ యాప్‌ల బ్యాన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని ప్రచారం జరుగుతోంది. దేశ భద్రత, పౌరుల వ్యక్తిగత సమాచార గోపత్యను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు సమాచార మార్పిడి జరుగుతోందని గుర్తించిన భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది.
పబ్జీ, రెసో, జిలీ, యూలైక్ పై బ్యాన్:
కాగా, కేంద్రం నిషేధం విధించనున్న 275 యాప్స్ లో వివాదాస్పద గేమింగ్ యాప్ PUBG కూడా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పబ్జీని బ్యాన్ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని సమాచారం. పబ్జీ… చైనాకు చెందిన ఇంటర్నెట్ మేజర్ టెన్ సెంట్(Tencent) ఆధ్వర్యంలో ఉంది. అలాగే xiaomi కి చెందిన జిలీ(Zili), ఈ కామర్స్ దిగ్గజం అలీబాబాకు(Alibaba) చెందిన అలీ ఎక్స్ ప్రెస్(AliExpress), టిక్ టిక్(Tiktok) ఓనర్ బైట్ డ్యాన్స్(ByteDance) ఆధ్వర్యంలోని రెసో(Resso), ULike యాప్ లపై కేంద్రం బ్యాన్ విధించే చాన్స్ ఉంది.
దేశ భద్రత, పౌరుల వ్యక్తిగత సమాచారం గోప్యత:
దేశ భద్రత, రక్షణ, పౌరుల వ్యక్తిగత సమాచారం గోప్యత దృష్ట్యా ఇప్పటికే చైనాకు చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఆ విధంగా డ్రాగన్ కంట్రీపై డిజిటల్ స్ట్రైక్‌ని ప్రకటించిన భారత్.. ఆ దేశ ఆదాయానికి గండి కొట్టింది. ఇక భారత్‌ను ఫాలో అవుతూ చైనా యాప్‌లను నిషేధించాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు సైతం ట్రంప్‌కు ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే.
పబ్జీ బ్యాన్ చేయాలని డిమాండ్:
గల్వాన్ లోయలో చైనా సైనికులు కుట్రపూరితంగా వ్యవహరించి భారత సైనికులపై దొంగ దాడి చేశారు. ఈ దాడిలో పలువురు భారత జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన తర్వాత యావత్ భారతం ప్రతీకారంతో రగిలిపోయింది. చైనాని దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అని నినదించారు. దీంతో భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా డిజిటల్ స్ట్రైక్ ప్రకటించింది. ముందుగా చైనా కంపెనీలకు చెందిన 59 యాప్ లపై బ్యాన్ విధించింది. ఈ నిర్ణయాన్ని భారతీయులంతా ఆహ్వానించారు. హర్షం వ్యక్తం చేశారు. అలాగే యువత ప్రాణాలు తీస్తున్న గేమింగ్ యాప్ పబ్జీపైనా నిషేధం విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తదుపరి టార్గెట్ పబ్జీపై పెట్టినట్టు తెలుస్తోంది.
పబ్జీ.. యువతకు పట్టిన పీడ:
గంటల తరబడి పిల్లలు పబ్జీ గేమ్ ఆడుతున్నారు. దానికి అడిక్ట్ అయిపోయారు. తిండితిప్పలు మానేసి మరీ ఆడుతున్నారు. ఈ క్రమంలో కొందరు పిచ్చోళ్లుగా మారుతున్నారు. మరికొందరు ఉన్మాదుల్లా తయారవుతున్నారు. కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. దీంతో పేరెంట్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా, పబ్జీ గేమ్‌ని దక్షిణ కొరియాకి చెందిన గేమ్ స్టూడియో బ్లూహోల్(Blue Hole) తయారు చేసింది. ఈ గేమ్ పాపులర్ అయ్యాక… చైనా కంపెనీ టెన్సెంట్(Tencent)… దీన్ని చైనాలో అనుమతించేందుకు డీల్ కుదుర్చుకుంది. క్రమంగా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని పెంచుకుంటూ పోతోంది. ఉదాహరణకు ఇండియాలో ఈ గేమ్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది టెన్సెంట్ అని గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంది. పబ్‌జీ యాజమాన్య హక్కులు ఇప్పుడు ఒక్కరి చేతుల్లో లేవు. అందువల్ల ఈ గేమ్ యాప్‌ని గతంలో భారత్ నిషేధించలేదట. మరిప్పుడు ఎలా ముందుకెళ్తుందో చూడాలి.