ఒకే వేదికపై అమిత్ షా,గంగూలీ…కాషాయ కండువా కప్పుకోనున్న దాదా!

ఒకే వేదికపై అమిత్ షా,గంగూలీ…కాషాయ కండువా కప్పుకోనున్న దాదా!

Updated On : December 28, 2020 / 3:55 PM IST

After Meeting Bengal Governor, Sourav Ganguly Share Stage With Amit Shah బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ సౌరవ్​ గంగూలీ.. రాజకీయాల్లో రానున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీని ఎదుర్కొనేందుకు గంగూలీని బీజేపీలో చేర్చుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో ఆదివారం వెస్ట్ బెంగాల్​ గవర్నర్​ ను గంగూలీ కలవడం చర్చనీయాంశం కాగా..ఇవాళ దిల్లీలోని ఫిరోజ్​ షా కోట్ల మైదానంలో జరిగిన కార్యక్రమంలో గంగూలీ.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో వేదిక పంచుకోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది.

కేంద్ర మాజీ మంత్రి, డీడీసీఏ మాజీ అధ్యక్షుడు అరుణ్​ జైట్లీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ ఢిల్లీ ఫిరోజ్​ షా కోట్ల మైదానంలో జరిగింది. రూ.15 లక్షల విలువైన 6 అడుగుల జైట్లీ విగ్రహాన్ని అమిత్​ షా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గంగూలీ కూడా హాజరయ్యారు. రూ.15 లక్షల విలువైన 6 అడుగుల జైట్లీ విగ్రహాన్ని అమిత్​ షా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో గంగూలీ-షా మధ్య రాజకీయంపై చర్చ జరిగిందా అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

మరోవైపు, అమిత్ షాతో భేటీ వార్తలను గంగూలీ ఖండించాడు. సదరు కార్యక్రమానికి ఢిల్లీ వెళ్లే సమయంలో విలేకరులు ప్రశ్నించగా అలాంటిదేం లేదని గంగూలీ బదులిచ్చాడు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్​కు సంబంధించిన కార్యక్రమానికి మాత్రమే తాను హాజరవుతున్నానని… అమిత్​ షాతో ఎలాంటి భేటీ లేదని సౌరవ్​ గంగూలీ సృష్టం చేశారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్​ను కలిసిన విషయంపైనా గంగూలీ స్పందిచాడు. భేటీని రాజకీయ కోణంలో చూడవద్దని అన్నారు. గవర్నర్​ మిమ్మల్ని కలవాలి అనుకుంటే మీరు వెళ్లాల్సిందే. కనుక ఈ విషయాన్ని అలానే వదిలేస్తే మంచిది అని దాదా వ్యాఖ్యానించారు.

కాగా,బెంగాల్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గంగూలీ ఆదివారం.. బెంగాల్ గవర్నర్​ను కలవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ మాజీ క్రికెటర్​ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్​ను కలవడం చర్చనీయాంశమైంది. అయితే రాజ్​భవన్​ వర్గాలు మాత్రం గంగూలీ.. మర్యాదపూర్వకంగానే గవర్నర్​ను కలిశారని, ఇందులో రాజకీయపరమైన అంశాలకు తావులేదని పేర్కొన్నాయి. గవర్నర్​ కూడా కాసేపటికే ట్వీట్​ చేశారు. పురాతన క్రికెట్​ స్టేడియం ఈడెన్​ గార్డెన్స్​ను సందర్శించాలని గంగూలీ కోరారని, అందుకు అంగీకరించినట్లు వెల్లడించారు.

మరోవైపు, గతంలో కూడా గంగూలీ బీజేపీలో చేరుతారనే వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలను అప్పుడే గంగూలీ ఖండించాడు. ప్రస్తుతం అమిత్​ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా ఉండటం గమనార్హం. కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ సోదరుడు అరుణ్​ ధుమాల్​ బీసీసీఐ కోశాధికారిగా ఉన్నారు.