పాకిస్థానీయులను వెంటనే పంపించేయండి.. అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్
మెడికల్ వీసాలతో వచ్చిన వారికి మాత్రం ఏప్రిల్ 29వ తేదీ వరకు గడువు ఇచ్చారు.

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ దౌత్యపరమైన చర్యలు తీసుకుంటున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఓ సూచన చేశారు. ఆయా రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్థాన్ వ్యక్తులను గుర్తించి, వారు త్వరగా తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కేంద్ర హోం శాఖ డేటా ప్రకారం.. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 మధ్య పాక్‌లోని మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన 1,112 మందికి భారత్ లాంగ్ టెర్మ్ వీసాలు ఇచ్చింది.
అంతేగాక, భారత్ గతంలో సార్క్ వీసా పొడిగింపు పథకం కింద అనేకమంది పాకిస్థాన్ పౌరులకు దేశంలో పర్యటనకు అవకాశం కల్పించింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ పథకం కింద భారత్‌లో ఉన్నవారికి 48 గంటల్లో దేశం విడిచిపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
మెడికల్ వీసాలతో వచ్చిన వారికి మాత్రం ఏప్రిల్ 29వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఇకపై పాకిస్థాన్ నుంచి వచ్చే కొత్త వీసా దరఖాస్తులను తక్షణమే నిలిపివేశామని విదేశాంగ శాఖ వెల్లడించింది. అంతేకాదు, పాకిస్థాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే తిరిగి రావాలంటూ అధికారిక సలహా (అడ్వైజరీ) కూడా జారీ చేశారు. భారత్‌లో ఉన్న పాకిస్థాన్ పౌరులు కూడా గడువు ముగిసేలోపు దేశాన్ని వదిలివెళ్లాలని హెచ్చరించారు.
Also Read: భారత ఆర్మీ నర్సింగ్ వెబ్ సైట్ హ్యాక్.. హిందువులపై దారుణమైన మెసేజ్..
కాగా, పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్థానీయుల వీసాలు రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. హైదరాబాద్‌లోని పాకిస్థానీయుల వివరాలను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్‌లో మొత్తం 208 పాకిస్థానీయుల పేర్లు రిజిస్టర్ అయ్యాయి.
వీరిలో 156 మంది లాంగ్ టర్మ్ వీసాతో, 13 మంది షార్ట్ టర్మ్ వీసాతో, 39 మంది బిజినెస్ వీసాతో ఉన్నవారు. కేంద్ర సర్కారు ఆదేశాల ప్రకారం, వీరంతా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో స్పెషల్ బ్రాంచ్ అధికారులు అప్రమత్తమయ్యారు.
మరోవైపు ఇప్పటికే పాక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగిన అనంతరం, పాకిస్థాన్‌పై భారత సైన్యం ఎలా ప్రతీకారం తీర్చుకోనుందనే విషయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత పదేళ్లలో ఇలాంటి ఉగ్రదాడుల తరువాత భారత సైన్యం తీవ్రంగా స్పందించి, ప్రణాళికాబద్ధంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది.
పాకిస్థాన్‌పై భారత్ దాడులు చేయాలని భావిస్తే రాఫెల్ యుద్ధ విమానాలను వాడే అవకాశం ఉంది. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి ఎస్‌సీఏఎల్‌పీ క్షిపణులను రాఫెల్ జట్లు తీసుకెళ్లి వాటితో దాడులు చేస్తాయి.
భారత సైన్యం వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాలు ఇవి. శత్రు దేశంలోని ప్రాంతాల్లోకి చొచ్చుకువెళ్లి, దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించేందుకు అనుకూలంగా ఉంటాయి. భూమి మీద టార్గెట్లను గగనతలం నుంచి ఇవి లక్ష్యంగా చేసుకుంటాయి. రోస్టోవ్-నా-డోను జలాంతర్గామి, సెవాస్టోపోల్‌లోని ల్యాండింగ్ షిప్ సహా అనేక రష్యన్ టార్గెట్‌లను కూల్చివేసేందుకు ఉక్రెయిన్ కూడా ఈ క్షిపణులను ఉపయోగించింది.
ఎస్‌సీఏఎల్‌పీ క్షిపణులతో కూడిన రాఫెల్ జట్లతో పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్ వంటి లక్ష్యాలపై దాడులు చేయవచ్చు. ఈ ప్రాంతంలో ఎల్‌ఈటీ ప్రధాన కార్యాలయం ఉంటుంది. రాఫెల్ జట్లు శత్రు దేశంలోకి చొచ్చుకెళ్లి దాడులు చేస్తాయి.
అలాగే, శత్రుదేశం నుండి వచ్చే యుద్ధ విమానాలు, క్షిపణులను కూల్చేయడానికి భారత్ ఎస్400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా మోహరించింది. 2019లో పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ట్రైనింగ్ క్యాంప్‌పై భారత్ ఎయిర్ స్ట్రైక్స్ చేసిన సమయంలో రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ సర్వీసులో లేవు. ఆ సమయంలో భారత్ మిరాజ్ 2000 జట్లను ఉపయోగించింది.