MS Swaminathan : ‘హరిత విప్లవ పితామహుడు’ ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత.. ప్రముఖుల నివాళులు

భారతదేశం 'హరిత విప్లవ పితామహుడిగా' పిలుచుకునే వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ వయోభారంతో కన్నుమూసారు. ఆయన మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

MS Swaminathan : ‘హరిత విప్లవ పితామహుడు’ ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత.. ప్రముఖుల నివాళులు

MS Swaminathan passed away

Updated On : September 28, 2023 / 1:41 PM IST

MS Swaminathan passed away : భారతదేశం ‘హరిత విప్లవ పితామహుడిగా’ పిలుచుకునే వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ చెన్నైలో మరణించారు. వయోభారంతో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

1925, ఆగస్టు 7 న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించిన మంకొంబు సాంబశివన్ స్వామినాథన్ తేనాంపేటలోని తన నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. స్వామినాథన్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1943 లో బెంగాల్‌లోని కరువును చూసిన ఆయన వైద్య విద్య నుంచి వ్యవసాయరంగానికి మారారు. స్వామినాథన్ 1949 లో బంగాళదుంప, గోధుమలు, బియ్యం, జనపనార వంటి వాటిపై పరిశోధనలు చేస్తూ వృత్తిని ప్రారంభించారు. 1960 లలో భారతదేశంలో ఆహార ధాన్యాల కొరత సందర్భంలో స్వామినాథన్‌తో పాటు నార్మన్ బోర్లాగ్, ఇతర శాస్త్రవేత్తలు అధిక దిగుబడి ఇచ్చే గోధుమ విత్తనాలను అభివృద్ధి చేసారు.

భారత్‌లో సంప్రదాయ వ్యవసాయం నుండి అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు ప్రవేశపెట్టడంలో స్వామినాథన్ కొత్త విధానాలను తీసుకువచ్చారు. ఈ మార్పు హరిత విప్లవానికి దారితీసింది. అందుకే స్వామినాథన్‌ను ‘హరిత విప్లవ పితామహుడు’ అని పిలుస్తారు. స్వామినాథన్ అనేక వ్యవసాయ పరిశోధన ప్రయోగశాలలలో అనేక పదవులను నిర్వహించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ తరువాత ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసారు.

1988 లో ఎంఎస్ స్వామినాథన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్స్ అధ్యక్షుడిగా పనిచేసారు. వ్యవసాయ శాస్త్ర రంగంలో ఆయన చేసిన సేవలకు అనేక అవార్డులు పొందారు. 1961 లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, 1986 ఆల్బర్ట్ ఐన్ స్టీన్ వరల్డ్ అవార్డ్ ఆఫ్ సైన్స్ ఆయనను వరించాయి. భారత ప్రభుత్వం 1967 లో పద్మశ్రీ, 1972 లో పద్మభూషణ్, 1989 లో పద్మ విభూషణ్‌తో సత్కరించింది.

Also Read: గతేడాది రికార్డు బ్రేక్.. భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎవరు, ఎంత ధరకు దక్కించుకున్నారంటే..

ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశంలో మేలైన వరి వంగడాలను సృష్టించి హరిత విప్లవానికి నాంది పలికిన స్వామినాథన్ మరణం దేశంలో వ్యవసాయ రంగానికి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.