ఎయిర్ ఇండియా ప్రమాదం.. ఒక్కొక్కరికి ఎన్ని కోట్లు పరిహారం వస్తుందంటే..
అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరింది.

Ahmedabad plane crash
Ahmedabad plane crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరింది. వీరిలో 241 మంది విమానంలో ప్రయాణిస్తున్నవారు కాగా.. మిగిలిన వారు మెడికోలు. విమానం వైద్యకళాశాల వసతి గృహంపై కూలడంతో భవనం బాగా ధ్వంసమైంది. ప్రమాదం సమయంలో 24మంది మరణించగా.. గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో తొమ్మిది మంది చనిపోయారు. దీంతో ఆ సంఖ్య 33కు చేరింది. ఇదిలాఉంటే.. విమాన ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది.
విమానానికి బీమా సదుపాయం ఎలాగూ ఉంటుంది. బీమా సంస్థ నుంచి నష్టాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం జరిగిన విమాన ప్రమాదం దేశ చరిత్రలోనే అతిపెద్ద ఏవియేషన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాబోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత విమానయాన సంస్థదే. ఈ విషయంపై స్పష్టమైన నియమనిబంధనలు ఉన్నాయి.
1999 నాటి మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం.. విమానం ప్రమాదానికి గురై ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగితే, ఎవరైనా క్షతగాత్రులుగా మారితే సంబంధిత విమానయాన సంస్థే ఆ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. విమానంలో ప్రయాణికుల వస్తువులు, సామాగ్రి ధ్వంసమైనా, అవి వారికి అందడంలో ఆలస్యం జరిగినా పరిహారం ఇవ్వాల్సిందే.
ఎయిరిండియా టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉన్న విషయం తెలిసిందే. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానాన్ని దాదాపు రూ.960 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించినట్లు సమాచారం. అయితే, అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదంలో.. నిబంధనల ప్రకారం.. ఎయిరిండియా సంస్థ ఒక్కో బాధిత కుటుంబానికి 1,51,880 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఎస్డీఆర్ విలువ దాదాపు రూ. 120. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి రూ.1.80కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉంది. మాంట్రియల్ తీర్మానం కింద ఇచ్చే పరిహారంతో పాటు ఒక్కో కుటుంబానికి అదనంగా రూ.కోటి చొప్పున ఇస్తామని టాటా గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. అంటే ఒక్కో కుటుంబానికి రూ.2.80కోట్ల పరిహారం దక్కబోతోంది.