ఐదేళ్ల జైలు..రూ.కోటి ఫైన్ : ఢిల్లీలో పొల్యూషన్ నియంత్రణకు కేంద్రం ఆర్డినెన్స్ జారీ

  • Published By: venkaiahnaidu ,Published On : October 29, 2020 / 03:50 PM IST
ఐదేళ్ల జైలు..రూ.కోటి ఫైన్ : ఢిల్లీలో పొల్యూషన్ నియంత్రణకు కేంద్రం ఆర్డినెన్స్ జారీ

Updated On : October 29, 2020 / 3:55 PM IST

Centre’s new law to tackle air pollution ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్(NCR)లో వాయుకాలుష్యాన్ని నియంత్రిచేందుకు ప్రత్యేక కమిషన్​ ఏర్పాటు చేస్తూ ఇవాళ కేంద్రం కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ ఫర్ ఢిల్లీ-ఎన్ సీఆర్ పేరుతో దాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలను కూడా ఈ కమిషన్ పరిధిలోకి తీసుకొచ్చింది కేంద్రం. పొల్యూషన్ నియంత్రించడానికి అనేక ముఖ్యమైన నిర్ణయాలను ప్రవేశపెట్టిన 22 ఏళ్ల నుంచి ఉన్న సుప్రీంకోర్టు ఆదేశిత పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ (EPCA) స్థానంలో ఈ కమిషన్ ఏర్పాటుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.



తాజా కమిషన్ లో… కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేదా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి పూర్తికాలం చైర్మన్​గా వ్యవహరిస్తారు. కమిషన్ లో మొత్తం 18మంది సభ్యులు ఉంటారు. వారిలో సంబంధిత రాష్ట్రాల ఉన్నతాధికారులు,పర్యావరణ వ్యవహారాలను పరిశీలించే నిపుణులు,ఎన్జీవోల నుంచి ముగ్గురు,ఇస్రో నామినేట్ చేసిన వ్యక్తి,నీతి ఆయోగ్ నుంచి సంయుక్త కార్యదర్శి లేదా, సలహాదారు స్థాయి అధికారి పూర్తిస్థాయి సభ్యులు.



పెట్రోలియం, విద్యుత్, ఉపరితల రవాణా, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ,పరిశ్రమల శాఖ,  వ్యవసాయ, వాణిజ్యశాఖల నుంచి ఒక్కొక్క అధికారిని కూడా సభ్యులుగా నియమించుకునే అవకాశం కమిషన్​ కి కేంద్రం కల్పించింది. అధికారుల మధ్య సమన్వయం కోసం కార్యదర్శి స్థాయి అధికారి ఉంటారు.



ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల అధికారులతో సంప్రదింపులు జరుపుతూ దేశ రాజధాని ప్రాంతంలో కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపట్టేందుకు అన్ని రకాల అధికారాలు కల్పిస్తూ కమిషన్ ఏర్పాటు చేసింది కేంద్రం.పర్యావరణ కాలుష్యానికి పాల్పడేవారిపై,అదేవిధంగా తన ఆదేశాలను ఉల్లంఘించేవారిపై ఎఫ్ ఐఆర్ నమోదుచేసే అవకాశం కూడా కమిషన్ కు కల్పించబడింది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు,ఏజెన్సీలు ఇచ్చే ఆదేశాలను తొసిపుచ్చేలా కమిషన్ కు అధికారాలు కల్పించబడ్డాయి. ఇది వాయు నాణ్యతను పర్యవేక్షించడంతోపాటు దానికి సంబంధించిన చట్టాలను అమలు చేస్తుంది. మరోవైపు, కాలుష్య నియంత్రణ, చేపట్టాల్సిన చర్యలు, పరిశోధనల కోసం ఉప సంఘాలను కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం ఆర్డినెన్స్ లో తెలిపింది. ఈ ఉప సంఘాల్లో ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది.



కాగా, ఇటీవల ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం సహా ఇతర కాలుష్య కారకాలు పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం నివారణకు చర్యలు చేపట్టేలా రిటైర్డ్ జడ్జి మదన్ బీ లోకూర్​తో కూడిన ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. అయితే, పొల్యూషన్ ని అరికట్టడానికి కేంద్రం సమర్థమైన చట్టం తీసుకురానుందని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా.. రెండు రోజుల క్రితం కోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో ఏకసభ్య కమిటీని కోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పిస్తునే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్ గెజిట్ తీసుకొచ్చింది.