PM Modi : “ఉగ్ర సామ్రాజ్యం” తాత్కాలికమే..తాలిబన్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్ సంస్థను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Modi : “ఉగ్ర సామ్రాజ్యం” తాత్కాలికమే..తాలిబన్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Modi On Taliban

Updated On : August 20, 2021 / 3:44 PM IST

PM Modi అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్ సంస్థను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదం పునాదులపై సామ్రాజ్యాలు నిర్మించాలనుకునే విచ్చిన్న శక్తులు ఓ సమయం వరకూ పైచేయి సాధించవచ్చు, కానీ వారి ఉనికి శాశ్వతం కాదని..మానవత్వాన్ని ఎంతో కాలం అణిచి ఉంచలేరని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. గుజరాత్​లోని చారిత్రక సోమనాథ్​ ఆలయానికి చెందిన పలు ప్రాజెక్టులకు వర్చువల్​గా శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

గుజరాత్​లోని చారిత్రక సోమనాథ్​ ఆలయానికి చెందిన రూ.83 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు గురువారం వర్చువల్​గా శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యంగా సోమనాథ్​ యాత్ర, సోమనాథ్​ ఎగ్జిబిషన్​ సెంటర్​, పార్వతీ ఆలయం, పాత జునా సోమనాథ్​ ఆలయ పునరుద్ధరణ వంటివి ఉన్నాయి. ప్రధాన ఆలయం వద్ద రూ.30 కోట్లతో పార్వతీ దేవీ ఆలయం నిర్మిస్తున్నారు. సోమనాథ్​ ఆలయం వెనుక సముద్ర తీరంలో రూ.49 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కిలోమీటర్​ పొడవైన సముద్ర దర్శనం నడక మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు. కాగా, శ్రీ సోమనాథ్​ ట్రస్ట్​(SST) ఛైర్మన్​గా వ్యవహరిస్తున్నారు ప్రధాని.

గతంలో సోమనాథ్​ ఆలయంపై గతంలో జరిగిన దాడులను మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సోమనాథ్​ ఆలయాన్ని చాలా సార్లు ధ్వంసం చేశారు.. విగ్రహాలను అపవిత్రం చేశారు.. ఆలయ ఉనికిని రూపుమాపేందుకు ప్రయత్నాలు జరిగాయి.. దాడి జరిగిన ప్రతిసారీ రెట్టింపు వైభవాన్ని ప్రదర్శించింది.. అది మనకు ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుంది… విధ్వంసాన్ని సృష్టించే మూకలు, ఉగ్రవాద సిద్ధాంతాలతో రాజ్యస్థాపన నమ్మే వ్యక్తులు కొంత కాలం ఆధిపత్యం చలాయించవచ్చు.. కానీ వారి ఉనికి శాశ్వతం కాదు.. అది గతంలో సోమనాథ ఆలయం ధ్వంసం చేసిన సమయాల్లో నిజమని తేలింది.. ఇప్పుడు కూడా అదే నిజమవుతుందని పరోక్షంగా తాలిబన్ ని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు.

అప్ఘనిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న తాలిబన్లు.. ప్రతీ ఇంటినీ గాలిస్తూ అమెరికాకూ, ఇతర దేశాలకు సహకరిస్తున్న వారి జాడను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు అమెరికా విడుదల చేసిన ఓ తాజా పరిశోధనా పత్రం వెల్లడించిన నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోవైపు భారత విదేశాంగశాఖ..అప్ఘానిస్తాన్ లో చిక్కుకున్న భారతీయుల్ని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించింది. అఫ్ఘన్ పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నట్లు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కూడా వెల్లడించారు. తాలిబన్లతో భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలన్న అంశంపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమన్నారు